YuvagalamLokesh: దళిత ద్రోహి జగన్: లోకేశ్
ABN , First Publish Date - 2023-04-13T19:47:46+05:30 IST
రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా చంద్రబాబు పాలన సాగిస్తే.. జగన్ వచ్చాక ఏకంగా 100 సంక్షేమ పథకాలు రద్దు చేశారు. అందులో 27 దళితులకు చెందినవే
నంద్యాల: ‘‘రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా చంద్రబాబు పాలన సాగిస్తే.. జగన్ వచ్చాక ఏకంగా 100 సంక్షేమ పథకాలు రద్దు చేశారు. అందులో 27 దళితులకు చెందినవే. ఈ సైకో సీఎం వచ్చాక దళితులపై దాడులు పెరిగాయి, దళిత ద్రోహి జగన్’’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) దుయ్యబట్టారు. యువగళం పాదయాత్ర (Yuvagalam Padayatra) గురువారం నంద్యాల జిల్లా (Nandyala District) ప్యాపిలి మండలం డి.రంగాపురం వద్ద డోన్ నియోజకవర్గంలోకి చేరుకుంది. లోకేశ్‌కు ఉమ్మడి జిల్లా టీడీపీ నాయకులు, కార్యకర్తలు, తెలుగు యువత నాయకులు ఘన స్వాగతం పలికారు. అంతకుముందు అనంతపురం జిల్లా (Anantapur District)కు చెందిన మాజీ మంత్రులు పయ్యావుల కేశవ్, పరిటాల సునీత, తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి తదితరులు లోకేశ్‌కు వీడ్కోలు పలికారు.
ఉదయం 11.05 గంటలకు నంద్యాల జిల్లాలో అడుగు పెట్టాగానే రెట్టింపు ఉత్సాహంతో తెలుగు తమ్ముళ్లు పూలవర్షం కురిపించారు. ఇన్‌చార్జి సుబ్బారెడ్డి గజమాలతో స్వాగతం పలికారు. కందెనవోలు జిల్లాలో యువనేత పాదయాత్రకు జనసంద్రమై తెలుగు తుమ్ముళ్లు తరలివచ్చారు. డి.రంగాపురం నుంచి నల్లమేకలపల్లి, జక్కసాని కుంట వరకు మండుటెండను సైతం లెక్క చేయకుండా లోకేశ్ పాదయాత్రను సాగించారు. మధ్యాహ్నం 1.45 గంటలకు విరామ సమయంలో రెండు జిల్లాల నుంచి వచ్చిన దళితులు, వివిధ దళిత సంఘాల నాయకులతో ముఖాముఖి నిర్వహించారు. పలువురు దళిత మహిళలు, సంఘాల నాయకులు జగన్ ప్రభుత్వంలో తమకు ఆన్యాయాలు, దాడులు, భూ ఆక్రమణలపై ఏకరువు పెట్టారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి లోకేశ్ మాట్లాడుతూ మరో ఏడాదిలో టీడీపీ ప్రభుత్వం వస్తుందని, దళితులకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
సామాజిక న్యాయానికి టీడీపీ కట్టుబడి ఉంది: లోకేశ్
రాష్ట్రంలో సామాజిక న్యాయం కోసం టీడీపీ కట్టుబడి ఉందని, దళితుల్లో 62 ఉప కులాలకు న్యాయం చేస్తామని యువనేత భరోసా ఇచ్చారు. దళిత యువతి కుటుంబానికి న్యాయం చేయాలని పోరాటంలో భాగంగా తొలిసారి పోలీస్ స్టేషనుకు వెళ్లానన్నారు. గుంటూరులో రమ్య అనే దళిత యువతిని ఓ మృగాడు హత్య చేస్తే, ఆ కుటుంబానికి రూ.5 లక్షలు సాయం చేశామని లోకేశ్ గుర్తు చేశారు. అమరావతి దళిత రైతుల హక్కుల కోసం రెండోసారి పోలీస్ స్టేషన్‌కు వెళ్లానన్నారు. వైసీపీ నాయకులు వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న దళిత యువకుడు కరుణాకర్ కుటుంబానికి టీడీపీ అండగా నిలిచి రూ.15 లక్షలు సాయం చేసి, తనఖాలో ఇంటిని విడిపించిన ఘనత టీడీపీదన్నారు. ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయని తెలిపారు. దళితులకు చంద్రబాబు ప్రభుత్వంలో ఇన్నోవా, జేసీబీలు ఇచ్చి ఆత్మగౌరవాన్ని పెంచితే జగన్ వచ్చాక, ఇలాంటి పథకాలు అటకెక్కించడమే కాక, దళితులను ఇబ్బందులకు గురిచేశారని తెలిపారు. టీడీపీ అధికారంలోనికి రాగానే దళితుల శ్మశనాల కోసం స్థలం కేటాయిస్తామని హామీ ఇచ్చారు.