‘ప్రసాద్ స్కీం నిధులు’ విడుదలయ్యేది ఎప్పుడు?
ABN , First Publish Date - 2023-01-20T01:10:19+05:30 IST
అన్నవరం దేవస్థానం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ పథకం ప్రసాద్(తీర్థయాత్ర పునరుజ్జీవం, ఆధ్యాత్మిక వారసత్వం పెంపుదల డ్రైవ్) నిధులు విడుదల ఎప్పుడు జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. నాలుగేళ్ల క్రితం ప్రతిపాదనలు పంపించారు. అక్కడినుంచి సానుకూలంగా ఉండడంతో పలు దఫాల్లో కేంద్ర బృందం పర్యటించి ప్రతిపాదనలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. త్వరలోనే నిధులు విడుదలవుతాయని సెలవిచ్చారు.
అన్నవరం దేవస్థానం అభివృద్ధికి ఆటంకాలు
ఇటీవల తెలంగాణలో రెండు ఆలయాలకు నిధుల విడుదల
రూ.50కోట్లు ఇచ్చేందుకు సానుకూలంగా ఉన్నా జాప్యమే
అన్నవరం, జనవరి 19: అన్నవరం దేవస్థానం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ పథకం ప్రసాద్(తీర్థయాత్ర పునరుజ్జీవం, ఆధ్యాత్మిక వారసత్వం పెంపుదల డ్రైవ్) నిధులు విడుదల ఎప్పుడు జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. నాలుగేళ్ల క్రితం ప్రతిపాదనలు పంపించారు. అక్కడినుంచి సానుకూలంగా ఉండడంతో పలు దఫాల్లో కేంద్ర బృందం పర్యటించి ప్రతిపాదనలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. త్వరలోనే నిధులు విడుదలవుతాయని సెలవిచ్చారు. దీనిపై కాకినాడ ఎంపీ వంగా గీత తీవ్రంగా కృషి చేస్తున్నా నిధుల విడుదలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఈ నిధులు కేంద్ర టూరిజం శాఖ ద్వారా విడుదల కావాల్సి ఉన్నాయి.
రూ.62.82కోట్లతో డీపీఆర్
కేంద్ర టూరిజంశాఖకు తెలంగాణకు చెందిన కిషన్‌రెడ్డి మంత్రిగా ఉండడంతో అన్నవరం దేవాలయం కంటే వెనుక ప్రతిపాదనలు పంపిన తెలంగాణలోని రెండు ఆలయాలకు మంజూరయ్యాయి. అన్నవరం దేవస్థానానికి తొలుత రూ.62.82కోట్లతో డీపీఆర్‌ను రాష్ట్ర టూరిజంశాఖ అధికారులు కేంద్రానికి పంపించారు. అంచనాలు కొద్దిగా తగ్గించాలని కేంద్రం సూచించడంతో రూ.54.60 కోట్లకు మరోసారి ప్రతిపాదనలు పంపించారు. దీనికి రూ.50కోట్ల వరకు నిధులు కేటాయిస్తామని సూచనప్రాయంగా తెలపడంతో రూ.54.60కోట్ల పనులకు టెండర్లు పిలిస్తే లెస్ టెండర్ ద్వారా కేంద్రం ఇచ్చే నిధులు సరిపోతాయని లేకుంటే మిగిలిన మొత్తం దేవస్థానం భరించేందుకు సిద్ధమయ్యారు. ఈ వ్యవహారం నడిచి రెండు నెలలు గడుస్తున్నా దస్త్రాలు ముందుకు కదలలేదు. నిధులు మంజూరవుతాయనే ఉద్దేశ్యంలో దేవస్థానం అధికారులు ఉండడంతో భక్తులకు సౌకర్యవంతమైన పెద్ద నిర్మాణాల ప్రతిపాదనల జోలికి వెళ్లక ఆశలన్నీ ప్రసాద్ స్కీం పైనే ఉంచుకున్నారు. ఈ స్కీం కోసం సిద్ధం చేసిన ప్రతిపాదనల్లో కొండ దిగువ ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా రూ.6.57కోట్లతో డార్మెటరీ, రూ.7.73కోట్లతో టీటీడీ సత్రంవద్ద రూ.300 వ్రత మండపం, రూ.10.85కోట్లతో ప్రకాష్‌సదన్ వెనుక అన్నదాన భవనం తదితర పనులు ఉన్నాయి. ఇవి మంజూరై పనులు పూర్తయితే అన్నవరం దేవస్థానానికి రాబోయే 30ఏళ్లకు సరిపడా సౌకర్యాలు పూర్తవుతాయని అధికారులు చెప్తున్నారు.