ఘనంగా భీమేశ్వరుని రథోత్సవం
ABN , First Publish Date - 2023-02-05T00:47:23+05:30 IST
ద్రాక్షారామ భీమేశ్వరుని కల్యాణ మహోత్సవంలో భాగంగా భీమేశ్వర స్వామివారి రథోత్సవం శనివారం భక్తుల కోలాహలం మధ్య వైభవంగా జరిగింది. మధ్యాహ్నం కల్యాణమూర్తులైన మాణిక్యాంబ సమేత భీమేశ్వరస్వామి, లక్ష్మీ సమేత నారాయణస్వామి, చండికా సమేత సూరేశ్వరస్వామి వార్లను పుష్పాలంకృత రథంపై అర్చక స్వాములు కొలువుదీర్చారు. దూపసేవ అనంతరం 2.45 నిమిషాలకు రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ కొబ్బరి కాయ కొట్టి రథోత్సవం ప్రారంభించారు.
ద్రాక్షారామ, ఫిబ్రవరి 4: ద్రాక్షారామ భీమేశ్వరుని కల్యాణ మహోత్సవంలో భాగంగా భీమేశ్వర స్వామివారి రథోత్సవం శనివారం భక్తుల కోలాహలం మధ్య వైభవంగా జరిగింది. మధ్యాహ్నం కల్యాణమూర్తులైన మాణిక్యాంబ సమేత భీమేశ్వరస్వామి, లక్ష్మీ సమేత నారాయణస్వామి, చండికా సమేత సూరేశ్వరస్వామి వార్లను పుష్పాలంకృత రథంపై అర్చక స్వాములు కొలువుదీర్చారు. దూపసేవ అనంతరం 2.45 నిమిషాలకు రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ కొబ్బరి కాయ కొట్టి రథోత్సవం ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సుధీర్‌కుమార్‌రెడ్డి, జేసీ ధ్యానచంద్ర, దేవదాయ శాఖ ఉప కమిషనర్ ఎం.విజయరాజు, సహాయ కమిషనర్ కె.ఎన్.వి.డి.వి ప్రసాద్, తనిఖీదారు బాలాజీరామ్ ప్రసాద్, ఈవో పి.టి.వి సత్యనారాయణ, రాజాకాకర్లపూడి కిశోర్‌బాబు, వాడ్రేవు సుందర రత్నాకరరావు పాల్గొన్నారు. నూతన రథానికి విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానంద సరస్వతి పూజలు నిర్వహించారు. శాస్త్రోక్తంగా పూజాధికారులు జరిపారు. స్వామివారి రథం ఆలయం వద్ద నుంచి చంద్రవీధి గుండా వెలంపాలెం చేరుకుని సూర్యవీధి మీదుగా మెయిన్‌రోడ్డు చేరుకుంది. తదుపరి మార్కెట్, యానాం సెంటర్ నుంచి వేగాయమ్మపేట చేరుకుంది. హరహరమహాదేవ శంభోశంకర అంటూ భక్తులు ఉత్సా హంగా రథయాత్రలో పాల్గొన్నారు. రథంలో ఆశీనులైన కల్యాణమూర్తులు స్వామి, అమ్మవార్లను పురవీధులలో భక్తులు దర్శించుకున్నారు. అనంతరం రథం వేగాయమ్మపేటలో ఆస్థాన మండపానికి చేరుకుంది. రాత్రి 6.30 గంటలకు ఆస్థాన మండపంలో కల్యాణమూర్తులకు ఆస్థాన పూజ జరిగింది. వేద స్వస్తి అనంతరం పూజలు నిర్వహించారు. నీరాజన మంత్రపుష్పం కార్యక్రమంతో ఆస్థాన పూజ ముగిసింది. కార్యక్రమంలో వాడ్రేవు సుందరరత్నాకరరావు, ఆలయ ఈవో పి.టి.వి సత్యనారాయణ, ఆలయ సిబ్బంది, ఆలయ ఆస్థాన పండితులు దేవులపల్లి ఫణిరామకృష్ణ, అర్చకులు, వేదస్వస్తి వాచక బృందం, భక్తులు పాల్గొన్నారు. రఽథోత్సవం పురస్కరించుకుని రామచంద్రపురం సీఐ దుర్గారావు ఆధ్వర్యంలో ఎస్‌ఐ , పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. ఏపీఈపీడీసీఎల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీధర్ వర్మ ఆదేశాలతో విద్యుత్ సరఫరా క్రమబద్ధీకరించి విద్యుత్ కండక్టర్లు, వైర్లు తొలగించారు. రథోత్సవం అనంతరం పునరుద్ధరించే పని చేపట్టారు.