జైలులో భయం భయం!
ABN , First Publish Date - 2023-09-12T00:46:19+05:30 IST
అదర లేదు.. బెదరలేదు. అదే ఠీవీ.. అదే గాంభీర్యం.. ఎప్పుడూ ఎలా ఉంటారో అచ్చం అలాగే ఉన్నారు. అయితే ఎప్పుడూ బిజీబిజీ ఉండే ఆయన ఖాళీగా కనిపించారంతే. పత్రికలు తెప్పించుకుని చదివారు. ఇంటి నుంచి వచ్చిన ఆహారం తీసుకున్నారు...
మాట్లాడేందుకు సిబ్బంది నిరాకరణ
పెద్దల నుంచి స్పష్టమైన ఆదేశాలు
జైలులో పత్రికలు చదివిన చంద్రబాబు
రాజమహేంద్రవరం, సెప్టెంబరు11(ఆంధ్రజ్యోతి): అదర లేదు.. బెదరలేదు. అదే ఠీవీ.. అదే గాంభీర్యం.. ఎప్పుడూ ఎలా ఉంటారో అచ్చం అలాగే ఉన్నారు. అయితే ఎప్పుడూ బిజీబిజీ ఉండే ఆయన ఖాళీగా కనిపించారంతే. పత్రికలు తెప్పించుకుని చదివారు. ఇంటి నుంచి వచ్చిన ఆహారం తీసుకున్నారు... ఇదీ జైలులో ఉన్న మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు సోమ వారం గడిపిన తీరు. గత మూడు రోజులుగా ఏసీబీ విచా రణ నేపథ్యంలో చంద్రబాబును అటూ ఇటూ తిప్పుతూనే ఉన్నారు. అయితే విజయవాడలో ఆదివారం సాయంత్రం ఏసీబీ స్పెషల్ కోర్టు రిమాండ్ విధించడంతో అర్ధరాత్రి 1.16 గంటలకు సెంట్రల్ జైలుకు తీసుకొచ్చారు. ఆ తరువాత జైలు వద్ద కార్యక్రమాలన్నీ పూర్తిచేసి సుమారు 2 గంటల సమయంలో స్నేహాబ్లాక్‌కు పంపించారు. అయితే చంద్ర బాబు జైలులో ఉండడంతో సెంట్రల్ జైలు లోపలా.. బయటా ఉద్విగ్న వాతావరణం కొనసాగుతోంది. మాజీ సీఎం ఉండడంతో లోపల సిబ్బంది భయభయంగా గడుపు తుండగా.. బయట ప్రజలూ అంతే ఉద్వేగానికి గురవుతు న్నారు. ప్రతిపక్ష నేత కావడంతో జైలు సిబ్బందికి ఇప్పటికే జైళ్లశాఖ ఉన్నతాధికారులు సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం. ముఖ్యంగా చంద్రబాబు ఉన్న బ్లాక్ వద్ద స్థానిక సిబ్బందికి డ్యూటీలు వేయడం లేదు. సీసీ కెమెరా లను పటిష్టం చేశారు. విజయవాడ నుంచి ఆ శాఖ ఉన్న తాధికారులు ప్రతి క్షణం మోనిటరింగ్ చేస్తున్నారని సమాచారం. దీంతో జైలు సిబ్బంది బయటి వాళ్లతో మాట్లా డడానికి హడలిపోతున్నారు. సిబ్బంది ఫోన్లపై కూడా నిఘా ఉంచారు. దీంతో చిన్న తప్పిదం జరిగినా వెంటనే ఉద్యోగం పోతుందనే ఆందోళన వారిలో నెలకొంది. ఈ నేప థ్యంలో డ్యూటీకి వెళ్లి రావడం సిబ్బందికి కత్తిమీద సాము లా మారింది. సెంట్రల్ జైలులో సుమారు 400 మంది సిబ్బంది షిఫ్టుల వారీగా విధులు నిర్వర్తిస్తారు. ఎప్పుడూ లేనివిధంగా అధికారులతో సహా సిబ్బంది అందరిలోనూ ఏదో తెలియని భయం ఆవహించింది. ఇక జైలు బయట రహదారిపై ఒకవైపు మాత్రమే వాహనాల రాకపోకలను అనుమతిస్తున్నారు. దీంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. పీటీ జెడ్, స్టాటిక్ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటి పరిధి వంద మీటర్లు. ఈ కెమెరాల పక్కనే పోలీసులు టెం టు వేసుకుని కాపలా కాస్తున్నారు. ములాఖత్‌ల విషయం లో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని ఇప్పటికే జైలు అధికారులకు ఆదేశాలందాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో సాధారణ ములాఖత్ తీసుకునేవారు బాగా తగ్గారు.
నేడు కలవనున్న లోకేశ్, భువనేశ్వరి, బ్రాహ్మణి
చంద్రబాబును మంగళవారం కలవడానికి ఆయన తన యుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ము లాఖత్‌కు దరఖాస్తు చేశారు. అనుమతిస్తే లోకేశ్ ఆయన తల్లి భువనేశ్వరి, సతీమణి బ్రాహ్మణి ముగ్గురూ బాబును కలిసే అవకాశం ఉంది. ఈ విషయాన్ని లోకేశ్ తెలిపారు.
నేడు ఉమ్మడి జిల్లా టీడీపీ సమావేశం
రాజమహేంద్రవరం, సెప్టెంబరు11 (ఆంధ్రజ్యోతి): చంద్రబాబునాయుడు అక్రమ అరెస్టు నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణ కోసం నిర్ణయం తీసుకోవడానికి మంగళవారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా టీడీపీ నేతలంతా సమావేశం కానున్నారు. కాతేరులోని వేంక టాద్రి ఫంక్షన్‌హాల్‌లో మధ్యాహ్నం మూడు గంటలకు ఈ సమావేశం నిర్వహించనున్నట్టు పార్టీ ప్రకటించింది.
చంద్రబాబు కోసం ముస్లింల ప్రార్థనలు
రాజమహేంద్రవరం సిటీ, సెప్టెంబరు11 : చంద్రబాబునాయుడు త్వరగా జైలు నుంచి విడుదల కావాలని, ఆయన ఆరోగ్యం బాగుండాలని కాంక్షిస్తూ పలువురు ముస్లింలు మసీదుల్లో ప్రార్థనలు చేశారు. సుమారు వందమంది ముస్లింలు చంద్రబాబు క్షేమం కోసం మసీదులో నమాజు చేసిన అనంతరం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు వద్దకు వచ్చారు. నూర్ బాషా ముస్లిం సాధికార కమిటీ రాష్ట్ర కన్వీనర్ షేక్ సుబాన్ మాట్లాడుతూ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబును కావాలనే ఇరికించారన్నారు. చంద్రబాబును ఇబ్బంది పెట్టడం ద్వారా తెలుగుదేశం కేడర్‌ను భయబ్రాంతులకు గురిచేయడానికే అరెస్టు చేశారన్నారు. 2024లో చంద్రబాబును ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రజలు చూస్తారని పేర్కొన్నారు. చంద్రబాబు అరెస్టు విషయం లో వెంటనే ప్రధాని మోదీ స్పందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కోఆప్షన్ సభ్యుడు చాన్‌బాషా, మైనార్టీ నాయకులు మహబూబ్ ఖాన్, మహబూబ్ జానీ, షేక్ కాశిమ్, ఎండీ షాపు, ఆదిల్ బాషా, షేక్ మదీనా సాహెబ్. ఎండి అజీజ్, షేక్ బాదుషా, అబ్దుల్ మునాఫ్ తదితరులు పాల్గొన్నారు.
ష్..గప్‌చుప్
బాబుకు వైద్యంపై నోరుమెదపని అధికారులు
రాజమహేంద్రవరం అర్బన్, సెప్టెంబరు11: రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండులో ఉన్న చంద్రబాబునాయుడికి ఎలాంటి వైద్యసేవలందుతున్నాయనే దానిపై సమాచారం బయటకు రావడంలేదు. ఆదివారం అర్థరాత్రి నుంచి ఆయన సెంట్రల్ జైలులో రిమాండ్‌లోనే ఉన్నారు. పెద్దవయసు కావడంతో ఆయన ఆరోగ్యంపై జైలు బయట పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కొంత ఆందోళనతో ఉన్నారు. చంద్రబాబుకు అందుతున్న వైద్యసేవలపై కనీస సమాచారం బయటకు పొక్కకుండా జైలు అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రభుత్వ పెద్దల నుంచి గట్టి ఆదేశాలు రావడంతో వైద్యసేవలపై నోరు మెదపవద్దని జైలు ఉన్నతాధికారులు వైద్యులను హెచ్చరించినట్టు సమాచారం. చంద్రబాబు రిమాండ్‌లో ఉన్నందున నిబంధనల ప్రకారం ఆయనకు బీపీ, షుగర్, ఇతర ఎలాంటి వైద్య పరీక్షలు నిర్వహించాలన్నా, ఇతర ఏ విధమైన వైద్యసహాయం అవసరమైనా జైలు ఆసుపత్రి వైద్యులే చూడాలి. సెంట్రల్ జైలులోని ఆసుపత్రిలో ముగ్గురు రెగ్యులర్ వైద్యులుండగా, వీరిలో ఒకరు డిప్యూటీ సివిల్ సర్జన్ హోదాలో పనిచే స్తున్నారు. ఆయనే ప్రస్తుతం సూపరింటెండెంట్‌గా వ్యవహరిస్తున్నారు. కానీ ఈ ముగ్గురూ స్పెషలిస్టు వైద్యులు కాదు. డిప్యూటీ సివిల్ సర్జన్ పర్యవేక్షణలోనే చంద్రబాబుకు వైద్యపరీక్షలు జరుగుతున్నట్టు తెలిసింది. సెంట్రల్ జైలుకు దగ్గరలోనే ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి (జీజీహెచ్) ఉంది. జీజీహెచ్‌లో ఎండీ స్థాయి సీనియర్ ఫిజీషియన్లు, ఇతర విభాగాలకు చెందిన పలువురు సీనియర్ వైద్యనిపుణులు ఉన్నారు.జైలు నిబంధనల ప్రకారం జీజీహెచ్ వైద్యులు చంద్రబాబుకు వైద్యసేవలు అందించే పరిస్థితి లేదు. రిమాండ్‌లో ఉన్న వారికి ఏదైనా అత్యవసరమైతే తప్ప స్పెషలిస్టు వైద్యులసేవలు పొందే అవకాశం లేదని వైద్యవర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
అందుబాటులో ఉండమని ఎటువంటి ఆదేశాలు రాలేదు
చంద్రబాబు రిమాండ్‌లో ఉన్న నేపథ్యంలో టీమ్ ఆఫ్ డాక్టర్స్ అందుబాటులో ఉండాలని ఉన్నతాధికారుల నుంచి ఇంకా మాకు ఎలాంటి ఆదేశాలు రాలేదు. అయినా మేము అప్రమత్తంగానే ఉన్నాం. ఎలాంటి అత్యవసర పరిస్థితి వచ్చినా వైద్యసేవలు అందించడానికి సిద్ధంగా ఉంటాం. మా ఆసుపత్రి కూడా సెంట్రల్ జైలుకు సమీపంలోనే ఉంది. - సూర్యప్రభ, ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్