అంతటా ఉత్కంఠ!
ABN , First Publish Date - 2023-09-21T00:41:19+05:30 IST
రాజమహేంద్రవరంలో ఉత్కంఠ నెలకొంది.. గురు వారం చంద్రబాబుకు బెయిల్ వస్తుందనే ప్రచారం ఓ వైపు, క్వాష్ పిటీషన్‌పైనా ఇప్పటికే తీర్పు రిజర్వులో ఉండడంతో దాని ఫలితంపైనా చర్చ సాగుతోంది.
క్వాష్ పిటిషన్ తీర్పు ఇప్పటికే రిజర్వు
నేడు బెయిల్ వస్తుందంటున్న టీడీపీ
సంబరాలకు సిద్ధమవుతున్న వైనం
భద్రత పెంపుపై ఎస్పీ ప్రత్యేక దృష్టి
చంద్రబాబును కలిసిన న్యాయవాది
జిల్లావ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ
రాజమహేంద్రవరం, సెప్టెంబరు 20(ఆంధ్రజ్యోతి): రాజమహేంద్రవరంలో ఉత్కంఠ నెలకొంది.. గురు వారం చంద్రబాబుకు బెయిల్ వస్తుందనే ప్రచారం ఓ వైపు, క్వాష్ పిటీషన్‌పైనా ఇప్పటికే తీర్పు రిజర్వులో ఉండడంతో దాని ఫలితంపైనా చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు విడుదలైతే ఒకపక్క పసుపు శ్రేణులు సంబరాలు చేసుకునేందుకు సన్నద్ధమవుతుం డగా.. మరోపక్క పోలీసులు భద్రత దృష్ట్యా పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. చంద్రబాబు నాయుడు 11 రోజులుగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. చంద్రబాబు కేసులో క్వాష్ పిటిషన్‌పై తీర్పును కోర్టు రిజర్వు చేసిన విషయం తెలిసిందే. ఎఫ్‌ఐఆర్‌తోపాటు, ఏసీబీ కోర్టు ఇచ్చిన రిమాండు రిపోర్టును క్వాష్ చేయాలంటూ చంద్రబాబు చేసిన అభ్యర్థనపై కోర్టు నిర్ణయాన్ని గురువారం ప్రక టించే అవకాశం ఉంది. కోర్టు తీర్పు చంద్రబాబుకు అనుకూలంగా వస్తే జైలు నుంచి బయటకు రావ డానికి ఎంత సమయం పట్టవచ్చు? ప్రక్రియ ఎలా ఉంటుంది? అనే సందేహాలకు సమాధానాలు ఇవి. కోర్టు తీర్పు ఉత్తర్వులను భౌతికంగా తీసుకువచ్చినా లేకున్నా.. కోర్టులకు, జైళ్లకు అనుసంధానంగా ఏర్పాటు చేసిన ఫాస్టర్ (ఎఫ్‌ఏఎస్‌టీఈఆర్)లో కోర్టు ఉత్తర్వు లను పంపిస్తే చంద్రబాబు విడుదల ప్రక్రియ మొదల వుతుంది. మిగతా ఈ మెయిళ్ల ద్వారా లేదా ఫోన్ల ద్వారాగానీ వచ్చే ఆదేశాలను పరిగణనలోకి తీసుకోరు. ఫాస్టర్ ద్వారా ఉత్తర్వులు అందిన సుమారు గంట లోపుగానే చంద్రబాబు బయటకు వస్తారు. అయితే చంద్రబాబు అత్యున్నత భద్రత అయిన ఎన్‌ఎస్‌జీ (నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్) రక్షణలో ఉన్నందున వాళ్లు జైలు బయటకు చేరుకునే వరకూ చంద్రబాబును జైలు బయటకు అనుమతించరు. జైలు అధికారులకు ఎన్‌ఎస్‌జీ సమాచారం ఇచ్చిన వెంటనే బయటకు పంపిస్తారు. ఎన్‌ఎస్‌జీ, చంద్రబాబు సెక్యూరిటీ అధికా రులు రాజమహేంద్రవరంలోనే ఉండడంతో తీర్పు అనుకూలంగా వెలువడిన పక్షంలో 15 నిమిషాల్లోనే కాన్వాయ్, ఎన్‌ఎస్‌జీ జైలు వద్దకు చేరుకునే అవకాశం ఉంది. క్వాష్ పిటిషన్‌పై తీర్పు రానున్న నేపథ్యంలో బందోబస్తుపై పోలీసులు ఇప్పటికే పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. ముఖ్యంగా సిటీ కంటే మండలా లపై ఎక్కువగా దృష్టి సారించారు. లేదంటే బెయిల్ వచ్చినా చంద్రబాబుకు కోర్టు తీర్పు అనుకూలంగా వెలువడిన అరగంటలోనే జైలు వద్ద బందోబస్తు పెంచే ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎస్పీ జగదీశ్ ఇప్పటికే బందో బస్తు ఏర్పాట్లను ఎప్పటికప్పుడు సమీక్షించి తగు ఆదే శాలిస్తున్నారు. పక్కా యాక్షన్ ప్లాన్‌తో ఆయన సన్న ద్ధంగా ఉన్నారు. స్థానిక పోలీసులతోపాటు రెండు ప్లటూన్ల ఏపీఎస్పీ సిబ్బంది భద్రత విధుల్లో ఉన్నారు. సీఆర్పీసీ సెక్షన్ 144, 30 అమల్లో ఉన్న విషయం తెలి సిందే. టీడీపీ శ్రేణులపై వీటిని కూడా ప్రయోగించే వీలుంది. సంబరాలకు ఈ సెక్షన్లతో అడ్డుకట్ట వేసే అవ కాశం ఉంది. ఇప్పటికే ఎక్కడికక్కడ నిఘాను అప్రమ త్తం చేశారు. కింది స్థాయి సిబ్బందిని సైతం పూర్తిగా అప్రమత్తం చేశారు. ఎలాంటి చిన్న అవాంఛనీయ సంఘటనకూ తావు లేకుండా చూసుకోవాలని ఉన్నతా ధికారులు ఆదేశాలిచ్చారు. కేసు విషయంపై చంద్ర బాబును బుధవారం హైకోర్టు న్యాయవాది లక్ష్మీనారా యణ కలుసుకోవడం చర్చనీయాంశంగా మారింది.