తెగిపడిన ఓహెచ్‌సీ విద్యుత్ లైన్లు
ABN , First Publish Date - 2023-05-21T02:06:07+05:30 IST
కాకినాడజిల్లా సామర్లకోట రైల్వేస్టేషన్ సమీపాన హుస్సేన్‌పురం-గూడపర్తి స్టేషన్ల మధ్య రైల్వే ట్రాక్ ఓహెచ్‌సీ విద్యుత్‌లైన్ రాజమహేంద్రవరంవైపు వెళుతున్న రత్నాచల్ రైలుపై తెగిపడడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయి ఎక్కడికక్కడే పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లు నిలిచిపోయాయి.
సామర్లకోట సమీపాన హుస్సేన్ పురం వద్ద ఘటన
సంఘటనా స్థలిలో రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ రైలు
సామర్లకోటలో గంటపాటు నిలిచిన ప్రశాంతి, యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు
ప్రయాణికుల ఇబ్బందులు
సామర్లకోట, మే20: కాకినాడజిల్లా సామర్లకోట రైల్వేస్టేషన్ సమీపాన హుస్సేన్‌పురం-గూడపర్తి స్టేషన్ల మధ్య రైల్వే ట్రాక్ ఓహెచ్‌సీ విద్యుత్‌లైన్ రాజమహేంద్రవరంవైపు వెళుతున్న రత్నాచల్ రైలుపై తెగిపడడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయి ఎక్కడికక్కడే పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లు నిలిచిపోయాయి. శనివారం సాయంత్రం 4 గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో ఆయా రైళ్లల్లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఏమి జరిగిందో, ఎందుకు రైలు నిలిచిపోయాయో తెలియక ఆందోళన చెందారు. విద్యుత్ సరఫరా నిలిచిపోయిన కారణంగా ప్రమాదంలో చిక్కుకున్న రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ రైలు సంఘటనా ప్రాంతంలో సుమారు గంటన్నరకు పైబడి నిలిచిపోయింది. ఇక సామర్లకోట రైల్వేస్టేషన్లో విశాఖ వైపు నుంచి సామర్లకోటకు చేరుకున్న ప్రశాంతి ఎక్స్‌ప్రెస్, హౌరా నుంచి యశ్వంత్ పూర్ వెళ్లాల్సిన ఎక్స్‌ప్రెస్ రైళ్లు సామర్లకోట స్టేషన్లో సుమారు 1.20 నిమిషాలు నిలిపివేశారు. బెంగుళూరు నుంచి గౌహతి వెళ్లే సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలుకు సామర్లకోటలో స్టాప్ లేకున్నప్పటికీ సుమా రు 10 నిమిషాలు నిలిచిపోయింది. మరికొన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లు అటు పిఠాపురం, గొల్లప్రోలు, అన్నవరం స్టేషన్లలోనూ, ఇటు జీ.మేడపాడు, బిక్కవోలు, అనపర్తి రైల్వేస్టేషన్లలో నిలిపివేశారు. శేషాద్రీ, తిరుమల ఎక్స్‌ప్రెస్ రైళ్లు సుమారు 20నుంచి 30 నిమిషాల పాటు ఆలస్యంగా సామర్లకోటకు చేరుకుని బయలుదేరివెళ్లాయి. మరో పక్క సామర్లకోట రైల్వే సిగ్నలింగ్ ఉన్నతాధికారులు, ట్రాక్షన్ విద్యుత్ అధికారులు సంఘటనా స్థలికి చేరుకుని విద్యుత్ లైన్ల పునరుద్ధరణ పనులు వేగవంతం చేశారు. అదే సమయంలో పెద్దఎత్తున ఈదురుగాలులు, భారీ వర్షం కురవడంతో లైన్ల పునరుద్ధరణ పనులకు అంతరాయం ఏర్పడింది. సాయంత్రం 6.15 గంటలకు పూర్తిస్థాయిలో రైళ్ల రాకపోకలను రెస్టోర్ చేసినట్లు ఎస్‌ఎస్, ఎం.రమేష్ తెలిపారు. సామర్లకోట రైల్వేస్టేషన్లో స్టేషన్ సూపరింటెండెంట్ ఎం.రమేష్, తదితర స్టేషన్ మేనేజర్లు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ప్రయాణికులకు సమాచారాన్ని చేరవేసి ప్రయాణికులకు సహకరించారు.