ఘనంగా భీమేశ్వరుని కల్యాణం
ABN , First Publish Date - 2023-02-02T01:15:48+05:30 IST
బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం ద్రాక్షారామలో భీమేశ్వరస్వామివారి దివ్యకల్యాణ మహోత్సవం బుధవారం రాత్రి ఘనంగా జరిగింది. మాఘ శుద్ధ ఏకాదశి మృగశిర నక్షత్ర యుక్త మీన లగ్నమందు పుష్పాలంకృతమైన కల్యాణ వేదికపై మంగళ వాయిద్యాలు, వేదమంత్రాలతో జరిగిన భీమేశ్వరస్వామి, మాణిక్యాంబ అమ్మవారి పరిణయం భక్తులు తన్మయత్వంతో తిలకించారు.
ద్రాక్షారామ, ఫిబ్రవరి 1: బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం ద్రాక్షారామలో భీమేశ్వరస్వామివారి దివ్యకల్యాణ మహోత్సవం బుధవారం రాత్రి ఘనంగా జరిగింది. మాఘ శుద్ధ ఏకాదశి మృగశిర నక్షత్ర యుక్త మీన లగ్నమందు పుష్పాలంకృతమైన కల్యాణ వేదికపై మంగళ వాయిద్యాలు, వేదమంత్రాలతో జరిగిన భీమేశ్వరస్వామి, మాణిక్యాంబ అమ్మవారి పరిణయం భక్తులు తన్మయత్వంతో తిలకించారు. మూల విరాట్ శ్రీ భీమేశ్వరస్వామి, మాణి క్యాంబ అమ్మవార్లకు, క్షేత్ర పాలకులు శ్రీలక్ష్మీసమేత నారాయణస్వామి, శ్రీచండికా సమేత సూరేశ్వరస్వామికి ఏకకాలంలో జరిగిన కల్యాణ మహోత్సవం అమితాసక్తిగా భక్తులు తిలకించారు. కల్యాణ మూర్తులు మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి, క్షేత్ర పాలకులు లక్ష్మీ సమేత నారాయణ స్వామి, చండికా సమేత సూరేశ్వర స్వామివార్లకు నంది వాహనంపై నగరోత్సవం జరిగింది. అనంతరం కల్యాణ మూర్తులను అర్చకస్వాములు వేదమంత్ర పఠనంతో, మంగళ వాయిద్యాలతో కల్యాణ వేదికపైకి తోడ్కొని వచ్చారు. ఆలయ బ్రహ్మ దేవులపల్లి ఫణి రామకృష్ణ, వైదిక బృందం కల్యాణ వేదికపై కల్యాణమూర్తులను అధిష్ఠింపజేసి కల్యాణం తంతు ప్రారంభించారు. సంకల్పం, గణపతిపూజ, పుణ్యాహవాచనం అనంతరం కంకణధారణ జరిపించారు. తదుపరి స్వామివార్లకు సువర్ణ యజ్ఞోపవీతధారణ జరిగింది. రాత్రి 10.25 గంటలకు కల్యాణమూర్తులు స్వామివార్లు, అమ్మవార్ల శిరస్సున అర్చకస్వాములు జీల కర్రబెల్లం ఉంచి కల్యాణం జరిపించారు. అనంతరం మాంగల్యధారణ నిర్వహించారు. ఆహ్లాదంగా ముత్యాల తలంబ్రాల కార్యక్రమం జరిగింది . పున:పూజ, నీరాజన మంత్రపుష్పాలు సమర్పించడంతో కల్యాణమహోత్సవం తంతుముగిసింది. భక్తులకు ముత్యాల తలంబ్రాలు స్వామి తీర్ధప్రసాదాలు అందచేశారు. స్వామి వారికి తిరుమల తిరుపతి దేవస్థానం సమర్పించిన పట్టు వస్త్రాలను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖా మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, వరలక్ష్మి దంపతులు, దేవదాయ శాఖ ఆర్‌జేసీ సురేష్‌బాబు, ఉప కమిషనర్ ఎం.విజ యరాజు సంప్రదాయబద్ధంగా సమర్పించారు. ముత్యాల తలంబ్రాలను మంత్రి చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ దంపతులు, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు దంపతులు, కలెక్టర్ హిమాన్షుశుక్లా, కృతికాశుక్లా దంపతులు, ఎస్పీ సుధీర్‌కుమార్‌రెడ్డి దంపతులు సమ ర్పించారు. ఈవో పి.టి.వి.సత్యనారాయణ, దేవదాయశాఖ తనిఖీదారు రాపాక బాలాజీరామ్‌ప్రసాద్, వాడ్రేవు సుందరరత్నాకరరావు తదితరులు పాల్గొన్నారు.