గోదావరి తీరాన ఉద్యమ కెరటాలు!
ABN , First Publish Date - 2023-08-15T01:33:05+05:30 IST
తెల్లదొరల కబంధ హస్తాల్లో నలిగిపోతు న్న భారతావనికి స్వేచ్ఛావాయువులు లభించ డం వెనుక మహోజ్వల చరిత్ర ఉంది. భారత స్వాతంత్రోద్యమ పోరులో ఎందరో తమ జీవి తాలను త్యాగం చేశారు. మరెందరో భరత మాత ముద్దుబిడ్డలు తృణప్రాయంగా అర్పిం చిన ప్రాణాల ప్రతిఫలమే ఈ స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు. ప్రధానంగా బ్రిటిష్ దొరలను గడగడలాడించిన ఉద్దండులు ఎందరో రాజ మహేంద్రవరం కేంద్రంగా పోరాటం సాగించారు. అలాగే జాతిపిత మొదలుకొని ఎందరో ప్రముఖులు స్వాతంత్య్ర పోరులో భాగంగా ఇక్కడకు విచ్చేశారు. నగరంలోని అనేక ప్రాంతాలను సందర్శించి ఉద్యమ శంఖారావం పూరించారు. వారి వచ్చి వెళ్లిన ప్రాం
స్వాతంత్య్ర పొత్తిళ్లలో రాజమహేంద్రి
పోరాటంలో మన యోధులెందరో
గాంధీ, నేతాజీ ప్రసంగాలకు వేదిక పాల్‌చౌక్
(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)
తెల్లదొరల కబంధ హస్తాల్లో నలిగిపోతు న్న భారతావనికి స్వేచ్ఛావాయువులు లభించ డం వెనుక మహోజ్వల చరిత్ర ఉంది. భారత స్వాతంత్రోద్యమ పోరులో ఎందరో తమ జీవి తాలను త్యాగం చేశారు. మరెందరో భరత మాత ముద్దుబిడ్డలు తృణప్రాయంగా అర్పిం చిన ప్రాణాల ప్రతిఫలమే ఈ స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు. ప్రధానంగా బ్రిటిష్ దొరలను గడగడలాడించిన ఉద్దండులు ఎందరో రాజ మహేంద్రవరం కేంద్రంగా పోరాటం సాగించారు. అలాగే జాతిపిత మొదలుకొని ఎందరో ప్రముఖులు స్వాతంత్య్ర పోరులో భాగంగా ఇక్కడకు విచ్చేశారు. నగరంలోని అనేక ప్రాంతాలను సందర్శించి ఉద్యమ శంఖారావం పూరించారు. వారి వచ్చి వెళ్లిన ప్రాంతాలన్నీ ఇప్పటికీ చిరస్మరణీయమైన చరిత్రకు నేడు ఆనవాళ్లుగా నిలిచాయి. 1900 సంవత్సరంలో హేవలాక్ బ్రిడ్జి (పాత బ్రిడ్జి) నిర్మాణం తర్వాత విజయ వాడకు రైళ్లు నడిచేవి. గాంధీజీ గోదావరి జిల్లాలకు పర్యటనకు వచ్చినప్పుడు రైలులో రాజమహేం ద్రవరం వచ్చి గోదావరి స్టేషనులో దిగేవారు. ఇక్కడి నుంచే ఆయన పోరుబాట మొదలయ్యేది. స్వదేశీ ఉద్యమ ప్రచారానికి కూడా రాజమహేంద్రవరం ప్రముఖ కేంద్రంగా ఉండేది. 1905 జూలైలో బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా వందేమాతర ఉద్యమం మొదలైంది. అదే ఏడాది ఏప్రిల్‌లో బిపిన్‌చంద్రపాల్ రాజమహేంద్రవరం వచ్చారు. అంతకుముందే స్వదేశీ ఉద్యమాన్ని ప్రోత్సహించే క్రమంలో నగరంలో కొందరు యువకులు బాలభారతి సమితిని ప్రారంభించారు. పాల్ ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన వెంట మట్నూరి కృష్ణారావు కూడా వచ్చారు. వాళ్లిద్దరూ మాదెండ్ల శౌరయ్య ఇంట్లో బస చేశారు. 1907 ఏప్రిల్ 19, 20, 21లో నగరంలో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇప్పుడు మనం కోటిపల్లి బస్టాండ్‌గా పిలుస్తున్న ప్రాంతంలోనే పాల్ ఉత్తేజపరిచేలా ఉపన్యసించారు. అప్పట్లో ఈ ప్రాంతం విశాల మైదా నంగా ఉండేది. ఇప్పుడు జెట్టీ టవర్సు ఉన్న ప్రాంతం లారీల స్టాండు. పాల్ ఉపన్యాసాలతో ప్రజల్లో దేశభక్తి ఉప్పొంగింది. ఆయన గౌరవార్థం ఆ ప్రాంతానికి పాల్‌చౌక్‌గా పేరొచ్చింది. జాతీయోద్యమంలో భాగంగా రాజమహేంద్రవరంలో జాతీయ పాఠశాల నెలకొల్పడం కోసం అప్పటి రాజమండ్రి కరణం సత్యవోలు గున్నేశ్వరరావు పాల్‌కి అప్పట్లో రూ.వెయ్యి విరాళమిచ్చారు. పాల్ ఉపన్యాసాలను చిలకమర్తి లక్ష్మీనరసింహరావు తెలుగులోకి అనువదించేవారు.
ఆ సందర్భంలోనే ఆయన.. ‘‘భరత ఖండంబు చక్కటి పాడియావు, హిందువులు లేగదూడలై యేడ్చుచుండ, తెల్లవారను గడసరి గొల్లవారు, పితుకుచున్నారు మూతులు బిగియగట్టి’’ అనే పద్యాన్ని ఆశువుగా చెప్పారన్నది చరిత్ర. చిలకమర్తి తన స్వీయచరిత్రలో కూడా ‘కట్టకడపటి దినమున సభలో కూర్చుండి, నా మనస్సులో ఊహించుకొని బహిరంగంగా ‘భరత ఖండంబు’ పద్యమును కట్టకడపట చదివితిని’ అని రాశారు. 1939 సెప్టెంబరు 3న రెండో ప్రపంచ యుద్ధం ప్రారంభమైంది. అదేరోజున సుభాష్ చంద్రబోస్ నగరానికి వచ్చారు. ఆ ఏడాది మార్చిలో త్రిపు రలో జరిగిన సభలో ఆయన కాంగ్రెసు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అయితే కాంగ్రెసులోని మితవాద వర్గం ప్రతిష్టంభన సృష్టించింది. దాంతో బోసు తన పదవికి రాజీనామా ఇచ్చారు. క్రమశిక్షణ ఉల్లంఘిం చాడంటూ ఆయనను మూడేళ్లపాటు బాధ్యతాయుత స్థానాల నుంచి కాంగ్రెసు బహిష్కరించింది. అప్పు డు ఫార్వర్డు బ్లాకును ఏర్పాటు చేసిన బోసు.. ఆంధ్రదేశ పర్యటనకు ఉపక్రమించారు. దానిలో భాగంగా నగరానికి వచ్చారు. పాల్‌చౌక్‌లో గొప్ప బహిరంగ సభ జరిగింది. ఆయన ఉపన్యాసాన్ని మద్దూరు అన్నపూర్ణయ్య తెలుగులో అనువదించారు. అటు గాంధీజీ, నేతాజీ వంటి దిగ్గజ నాయకులు రాజమ హేంద్రవరం వస్తే దేవత శ్రీరామమూర్తి ఇంట్లో బసచేసేవారు. జాతీయ జెండాను తన ఇంటిపై ఎగుర వేసుకునే హక్కు హైకోర్టులో పోరాడి గెలిచారు శ్రీరామమూర్తి. రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల ఘటన స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రదేశ యువత చురుగ్గా పాల్గొనడానికి నాంది పలికింది. బిపిన్ చంద్రపాల్ ఉపన్యాసాలతో కళాశాల విద్యార్థులు ఉత్తేజితులయ్యారు. వందేమాతరం అని రాసిన ప్లకార్డులను పట్టు కొని తిరిగేవారు. వందేమాతరం పతాకాన్ని, చిహ్నాలను ధరించరాదని అప్పటి ప్రిన్సిపాల్ హంటర్ నిషేఽ దాజ్ఞలు జారీచేశాడు. అయితే, వందేమాతరం పతకాలను, చిహ్నాలను ధరించి పరీక్షలకు హాజరయ్యారు. అవి తీసేయాలని లేకపోతే బయటకు పోవాలని హంటర్ ఆదేశించగా ఓ గదిలో విద్యార్థులు తీసేయగా మరో గదిలోని వాళ్లు ‘వందేమాతరం’ అని నినదిస్తూ విద్యార్థులు బయటకు వెళ్లిపోయారు. కొందరిని హంటర్ సస్పెండ్ చేశాడు. మొత్తం 222 మంది విద్యార్థులుండగా 140 మందికిపైగా విద్యార్థులు ఏదో విధంగా నష్టపోయారు. 100మందికిపైగా కళాశాల నుంచి బహిష్కరణకు గురయ్యారు. 1920లో గాంధీ జీ సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నారు. రాజమండ్రిలో మహిళలు ఆ ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్లారు. వీరిలో దేశబాంధవి దువ్వూరి సుబ్బమ్మ ముఖ్యురాలు. 1942 ఆగస్టు 5న ముంబైలో జరి గిన కాంగ్రెసు మహాసభ క్విట్ ఇండియా తీర్మానాన్ని చేసింది. గాంధీ ‘డు ఆర్ డై’ అనే నినాదాన్ని ప్రకటించారు. రాజమహేంద్రవరం గోదావరి రైల్వే స్టేషనులో డాక్టరు నాగేశ్వరరావు, కొవ్విడి లింగరాజును అరెస్టు చేసి జైలుకు తరలించారు. మునిసిపల్ పార్కులో సూరంపూడి శ్రీహరిరావు సభ నిర్వహించారు. మూడో పట్టణ పోలీసులు దాడి చేయగా వాళ్లపై ప్రజలు రాళ్ల వర్షం కురిపించారు. గోదావరి స్టేషను, మూడో పట్టణ పోలీస్ స్టేషన్లపై దాడికి వెళ్లారు. డీలక్సు సెంటరులో పోలీసులతో ఒకరకంగా యుద్ధమే జరిగింది. సాయంత్రం శద్ధానంద(లాంచీల రేవు) ఘాట్‌లో బహిరంగ సభలో దేశభక్తులు కదంతొక్కారు.