గంజాయి మామూళ్లలోనూ డిజిటల్ చెల్లింపులు
ABN , First Publish Date - 2023-04-26T00:45:44+05:30 IST
ఏవోబీ నుంచి గంజాయిని రాచమార్గంలో గమ్యాలకు తరలించుకునేందుకు వీలుగా ఆయా పోలీసులకు చెల్లించే మామూళ్లను స్మగ్లర్లు డిజిటల్ విధానంలో చేస్తుండడం సంచలనం కలిగిస్తోంది.
- పోలీసుల లంచాల కోసం డిజిటల్ చెల్లింపులు చేస్తున్న స్మగ్లర్లు
- ఒక్క ఏడాదిలోనే ఒకే ఫోనుపే నుంచి 1830 నగదు బదలాయింపులు?
- మోతుగూడెం గంజాయి లింకులను విశాఖ డీఐజీకి నివేదించిన నెల్లూరు అదనపు ఎస్పీ
- ఎవరెవరు ఇందులో భాగస్వాములో తేల్చే డేటా విశ్లేషణలో అల్లూరి పోలీసులు బిజీ
(రంపచోడవరం/మోతుగూడెం)
ఏవోబీ నుంచి గంజాయిని రాచమార్గంలో గమ్యాలకు తరలించుకునేందుకు వీలుగా ఆయా పోలీసులకు చెల్లించే మామూళ్లను స్మగ్లర్లు డిజిటల్ విధానంలో చేస్తుండడం సంచలనం కలిగిస్తోంది. తాజాగా బట్టబయలైన మోతుగూడెం పోలీసుల గంజాయి బాగోతం నేపఽథ్యంలో డిజిటల్ చెల్లింపుల అంశం వెలుగులోకి వచ్చింది. మోతుగూడెం పోలీసు స్టేషను పరిధి దాటి టీఎస్ 09 ఎఫ్‌డబ్ల్యు టి/ఆర్ 8810 నెంబరు గల మారుతీ షిఫ్ట్ కారులో గంజాయిని తరలిస్తూ నెల్లూరు ఎస్‌ఈబీ అధికారులకు ఈనెల 20న పట్టుబడిన సంగతి తెలిసిందే. ఈ కేసు దర్యాప్తులో మోతుగూడెం ఎస్‌ఐ, మరో ముగ్గురు పోలీసులు ఈ వ్యవహారంలో మామూళ్లు తీసుకున్నట్టు తెలియడంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకోగా, రంపచోడవరంలో ఎస్‌ఐ పరారైన విషయమూ విదితమే. ఈ కేసులో అల్లూరి జిల్లా మన్యం నుంచి గంజాయి తరలింపు, ఇందుకు మార్గాన్ని స్మగ్లర్లు ఎలా సుగమం చేసుకున్నారు? పోలీసులకు మామూళ్లను ఏ సాంకేతిక మాధ్యమంలో చెల్లిస్తున్నారు? వంటి అనేక కీలక అంశాలను సమగ్ర డేటాతో సహా నెల్లూరు ఎస్‌ఈబీ జిల్లా ఉన్నతాధికారి, అదనపు ఎస్పీ హిమవతి మొత్తం గంజాయి డొంకను కదిల్చేసి విశాఖ రేంజ్ డీఐజీకి ఈనెల 21న నివేదిక సమర్పించారు. ఐదు పేజీల ఈ నివేదికను అందుకున్న డీఐజీ తక్షణం అల్లూరి జిల్లా ఎస్పీ సిన్హాను రంగంలోకి దించారు. 21 రాత్రి 9 గంటలకల్లా సదరు నివేదికను ఆధారం చేసుకుని మోతూగూడెం పోలీసు స్టేషన్లోనే స్మగ్లర్లతో కలిపి ఆ స్టేషను ఎస్‌ఐ, ముగ్గురు కానిస్టేబుళ్లు, వారికి సహకరిస్తున్న మరికొందరిపై క్రైమ్ నెంబరు 19/2023గా కేసు నమోదు చేశారు. ఈ మోతుగూడెం ఘటనతో మన్యం పోలీసు వ్యవస్థలో ఉన్న గంజాయి మొక్కలను ఏరివేసే పనిలో పోలీసు ఉన్నతాధికారులు నిమగ్నమయ్యారు. కేసు దర్యాప్తులను సైతం వారే స్వయంగా పర్యవేక్షించుకుంటున్నారు. ఆయా సర్కిళ్లకు సంబంధం లేని నిబద్ధత కలిగిన అధికారులను గుర్తించి వారితో దర్యాప్తు సాగిస్తున్నారు. నెల్లూరు జిల్లా ఎస్‌ఈబీ ఉన్నతాధికారిణి అయిన అదనపు ఎస్పీ నివేదిక సారాంశాన్ని బట్టి గంజాయి నేరానికి సంబంధించి మోతుగూడెం పోలీసుస్టేషను పరిధిలో జరిగిన మొత్తం తతంగం, ఇక్కడి పోలీసులకు ఇచ్చే లంచాల కోసం స్మగ్లర్లు భార్య పుస్తెలను సైతం మణిప్పురం బంగారు రుణాల సంస్థలో తనఖా పెట్టి మరీ లంచాన్ని చెల్లించడం, పోలీసులు సూచించిన ఐడికి ఫోనుపే చెల్లింపును సాగించడం.. ఇలా తీగ లాగితే ఇందులో లింకు అయిన ఫోనుపే నెంబర్లు ఆయా నెంబర్లకు ఉమ్మడిగా బంధాలు ఉన్న నెంబర్లను సైతం ఛేదిస్తే కేవలం ఏడాదికాలంలోనే గంజాయి లింకులకు సంబంధించి 1830 నగదు బదలాయింపులు జరిగినట్టు గుర్తించారు. ఈ బదలాయింపులలో మోతుగూడెం పోలీసు లింకులు, ఇతర లింకులూ ఉన్నాయి. పోలీసులు తమ మనిషిగా ఒక ఫుడ్ సెంటర్ నడుపుకుంటున్న వ్యక్తిని ఇందులో వాడుకోవడం, అతడి డిజిటల్ పేమెంట్ నెంబరుకే స్మగ్లర్లు చెల్లింపులు జరపడం వంటి అంశాలను నిశితంగా గుర్తించారు. నగదు డిజిటల్ చెల్లింపులు, దానికి అనుబంధంగా నడిచిన ఫోను సంభాషణలు, డిజిటల్ చెల్లింపులకు వినియోగించిన క్యూఆర్ కోడ్ స్ర్కీను షాట్లు, కాల్ డేటా రికార్డులను కూడా నెల్లూరు పోలీసులు గుర్తించారు. పై డేటా, నివేదికల ఆధారంగా ఏ ఏ ఫోను నెంబర్లు అల్లూరి జిల్లా పోలీసు నెంబర్లతో సంభాషణలు జరిపాయో, ఏ ఏ నెంబర్లకు డిజిటల్ చెల్లింపులు జరిగాయో, ఆయా ఉమ్మడి కాంటాక్టులను సైతం పోలీసులు ఛేదిస్తున్నారు. ముఖ్యంగా ఈ గంజాయి బాగోతంలో అనుమానిత పోలీసులపై నిఘా సాగుతోంది. మూడు నక్షత్రాల అధికారుల నుంచి కానిస్టేబుల్ స్థాయి వరకూ ఇక్కడ పనిచేసే అందరి ఫోన్లను, వారి డిజిటల్ చెల్లింపు నెంబర్లను జల్లెడ పడుతున్నారు. మరికొద్ది రోజుల్లోనే మన్యం మీదుగా సాగుతున్న గంజాయి అక్రమ రవాణాలో పాత్రధారులను గుర్తించి చర్యలకు రంగాన్ని సిద్ధం చేస్తున్నారు.