నిర్మాణాల్లేవు.. నిట్టూర్పులే
ABN , First Publish Date - 2023-03-18T01:32:56+05:30 IST
జిల్లాలో పేదల ఇళ్లు కదలనంటున్నాయి. ఏళ్లకు ఏళ్లు గడుస్తున్నా ఇంటి పునాదులు లేవనంటున్నాయి. అడ్డగోలు ధరలకు శివారు ప్రాంతా ల్లో భూములు కొని కట్టబెట్టిన భూములు ప్రభుత్వాన్ని వెక్కిరిస్తున్నాయి. లబ్ధిదారులు కనీసం పట్టా భూముల వైపు చూడకపోవడంతో లేఅవుట్‌లు పిచ్చిమొక్కలతో పలకరిస్తున్నాయి. ప్రభుత్వం ఎంత ఒత్తిడి తెచ్చినా లబ్ధి దారులు స్థలాల వద్దకు వెళ్లడానికి ససేమిరా అంటున్నారు.
ఏళ్లు గడుస్తున్నా జిల్లాలో పేదల ఇళ్ల నిర్మాణం నత్తనడకే
ప్రభుత్వం ఎంత ఒత్తిడి తెస్తున్నా ఇళ్లు కట్టడానికి ముందుకురాని లబ్ధిదారులు
జిల్లాలో 71వేల మందికి పట్టాలిస్తే ఇంతవరకు పూర్తయిన ఇళ్లు కేవలం 14వేలే
సీఎం ప్రారంభించిన కొమరగిరి లేఅవుట్‌లో 16వేల గృహలకు 320మాత్రమే పూర్తి
ఈ ఉగాదికి జిల్లాలో 18వేల మందికి ఇళ్లు అందజేస్తామని సర్కారు గొప్పలు
లక్ష్యం చేరుకోకపోవడంతో వచ్చేనెలాఖరుకు ముహూర్తం వాయిదా
(కాకినాడ, ఆంధ్రజ్యోతి)
జిల్లాలో పేదల ఇళ్లు కదలనంటున్నాయి. ఏళ్లకు ఏళ్లు గడుస్తున్నా ఇంటి పునాదులు లేవనంటున్నాయి. అడ్డగోలు ధరలకు శివారు ప్రాంతా ల్లో భూములు కొని కట్టబెట్టిన భూములు ప్రభుత్వాన్ని వెక్కిరిస్తున్నాయి. లబ్ధిదారులు కనీసం పట్టా భూముల వైపు చూడకపోవడంతో లేఅవుట్‌లు పిచ్చిమొక్కలతో పలకరిస్తున్నాయి. ప్రభుత్వం ఎంత ఒత్తిడి తెచ్చినా లబ్ధి దారులు స్థలాల వద్దకు వెళ్లడానికి ససేమిరా అంటున్నారు. వెరసి జిల్లా లో పేదల ఇళ్లు ప్రభుత్వాన్ని వెక్కిరిస్తున్నాయి. దాదాపు రెండేళ్లు దాటు తున్నా ఇళ్ల నిర్మాణంలో పురోగతి లేక పథకం చతికిలపడింది. 71వేల మందికి పట్టాలిస్తే ఇంతవరకు 14వేల ఇళ్లే పూర్తయ్యాయి. సీఎం జగన్ స్వయంగా పట్టాలు పంచిన కొమరగిరి లేఅవుట్‌లో 16వేల గృహాలకు 320 మాత్రమే పూర్తయ్యాయంటే లబ్ధిదారుల్లో ఎంత వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవచ్చు. మరోపక్క ఉగాదికి జిల్లాలో 18వేలమందికి ఇళ్లు పూర్తిచేసి అప్పగిస్తామని గొప్పలు చెప్పిన జగన్ ప్రభుత్వం తీరా అవి కూడా పూర్తి కాకపోవడంతో వచ్చే నెలకు వాయిదా వేసింది.
కదలడం అనుమానమే..
నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పేరుతో జగన్ ప్రభుత్వం 2020, డిసెం బర్ 25న జిల్లాలో పేదలకు ఇళ్లస్థలాలు పంపిణీ చేసింది. ఇందుకోసం జిల్లాలో 1.42లక్షలమంది లబ్ధిదారులను గుర్తించింది. ఇందులో పట్టణ పరిధిలో లబ్ధిదారు లకు సెంటు, గ్రా మాల్లో సెంటున్నర చొప్పున భూమిని పంచింది. అనువైన భూములు చాలా చోట్ల లేకపోవడం తో వందల కోట్లు వెచ్చించి ప్రైవేటు భూములు సేకరించింది. అధికార పార్టీ స్థానిక ప్రజాప్రతినిధులు కొంద రు అధికారులతో కుమ్మక్కై ఊరికి అత్యంత దూరంగా, శివారు ప్రాంతాల్లో ని వాగులు, వంకలు, కొండలు, గుట్టలపై కారుచౌక భూములను రెట్టింపు ధరలకు ప్రభుత్వంతో కొనిపించి ఇళ్లస్థలాల కింద పేదలకు కట్టబెట్టారు. దాదాపు రూ.1402కోట్లు వెచ్చించి 71వేలమందికి పట్టాలిచ్చారు. వీరంతా ఇళ్లు నిర్మించుకుంటే వచ్చే ఎన్నికల్లో తిరిగి తమకే వీరంతా ఓటేస్తారని ప్రభుత్వం ఊహించుకుంది. తీరా ఆచరణలో పేదలకు ఇచ్చిన భూములు ఏమాత్రం ఇళ్లనిర్మాణానికి వీలకపోవడంతో లబ్ధిదారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. రెండేళ్లు దాటిపోయినా ఇళ్లు కట్టుకోవడానికి ఇచ్చిన స్థలాలవైపు తొంగి చూడడంలేదు. దీంతో ఇళ్ల నిర్మాణం నత్తనడకగా మారింది. తొలుత తామే ఇళ్లు కట్టిస్తామని మాట ఇచ్చిన ప్రభుత్వం ఆ తర్వాత మీరే కట్టుకోవాలని సర్కారు మాట తప్పింది. ఇళ్లు కట్టుకునే వారికి రూ.1.80లక్షల సాయం ప్రకటించింది. కానీ ఏళ్లు గడుస్తున్నా ఇళ్ల నిర్మాణాలే అనేక చోట్ల మొదలవలేదు. ఇప్పటివరకు 71వేల ఇళ్లకుగాను జిల్లావ్యాప్తంగా 14,231 మాత్రమే పూర్తయ్యాయంటే పరిస్థితి ఎంత దారు ణంగా ఉందో తేటతెల్లమవుతోంది. ఇవి కూడా జాతీయ రహదారిని ఆను కుని ఇచ్చిన ప్రత్తిపాడులోని ధర్మవరం లేఅవుట్, పెద్దాపురం పట్టణానికి సమీపంలోని లేఅవుట్‌లో మాత్రమే పూర్తయ్యాయి. మిగిలిన చోట వెక్కి రిస్తున్నాయి. మొత్తం 353 లేఅవుట్‌ల్లో ఇళ్ల నిర్మాణం జరగాలని లక్ష్యం విధించుకోగా, వందల లేఅవుట్లలో అసలు పునాదులే తీయలేదు.
సీఎం పట్టాలు పంచిన చోట మరీ ఘోరం..
సీఎం జగన్ స్వయంగా యు.కొత్తపల్లి మండలంలో కాకినాడ లబ్ధిదా రులకు స్థలాలు ఇచ్చారు. ఇక్కడ 16వేల ఇళ్లు నిర్మాణం జరగాల్సి ఉంటే ఇంతవరకు కేవలం 320 మాత్రమే పూర్తయ్యాయి. ఇది కూడా అధికారు లు చెబుతున్న లెక్కలే. దీంతో సీఎం ప్రారంభించిన లేఅవుట్‌లోనే పరి స్థితి ఇలాఉంటే మిగిలిన స్థలాల దుస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి సీఎం ప్రారంభించిన లేఅవుట్ కావడంతో సాఽధ్యమైనంత వే గంగా ఇళ్లు పూర్తిచేయడానికి అధికారులు అనేక ప్రయత్నాలు చేశారు. సీఎం పేషీనుంచి అధికారులు పర్యవేక్షిస్తున్నారు. తరచూ వచ్చి పురోగతి పరిశీలించి వెళ్తున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా లబ్ధిదారులు మా త్రం ఖాతరు చేయడంలేదు. ఇళ్లు ప్రారంభించకపోతే పట్టా రద్దు చేస్తామ ని ఒత్తిడి తెస్తున్నా ససేమిరా అంటున్నారు. దీంతో పథకం కింద ఇళ్ల ని ర్మాణం ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. కాగా ఆచరణలో పథకం అభాసుపాలు కావడంతో పరువు పోగొట్టుకున్న ప్రభుత్వం ఈ ఉగాదికి జిల్లాలో 18వేలమందికి ఇళ్లు నిర్మాణం పూర్తి చేయించి అప్పగిస్తామని ఆర్భాటంగా ప్రకటించింది. కానీ ఇంకా 4వేలకు పైగా ఇళ్లు లక్ష్యానికి దూ రంగా ఆగిపోయాయి. దీంతో ముహూర్తం మళ్లీ మార్చింది. ఏదోలా లక్ష్యం పూర్తి చేసి వచ్చే నెలాఖరులో ఇళ్ల పంపకానికి ప్రయత్నాలు చేస్తోంది. అధికారుల ఒత్తిళ్లతో కొందరు పేదలు ఇళ్ల నిర్మాణం మొదలుపెట్టగా వారికి ఇవ్వాల్సిన బిల్లులు ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచేస్తోంది. దీంతో విసుగెత్తి అనేకమంది మధ్యలోనే వాటిని ఆపేశారు.