కడియం పోలీసుల నుంచి ప్రాణహాని..

ABN , First Publish Date - 2023-01-22T01:00:44+05:30 IST

కడియం పోలీసుల నుంచి తమకు రక్షణ కల్పించాలని ఐదుగురు యువకులు ఏలూరు రేంజ్‌ డీఐజీకి ఫిర్యాదు చేశారు.

కడియం పోలీసుల నుంచి ప్రాణహాని..
వివరాలు వెల్లడిస్తున్న యువకులు

రాజమహేంద్రవరం సిటీ, జనవరి 21: కడియం పోలీసుల నుంచి తమకు రక్షణ కల్పించాలని ఐదుగురు యువకులు ఏలూరు రేంజ్‌ డీఐజీకి ఫిర్యాదు చేశారు. రాజమహేంద్రవరం ఆనం కళాకేంద్రం వద్ద శనివారం కడియం గ్రామానికి చెందిన బాధితులు మధు, కోదండ రామ్‌, రామకృష్ణ, రాజేష్‌, శశి కిరణ్‌ వర్మ విలేకరులకు వివరించారు. వివిధ రంగాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్న తామంతా సంక్రాంతి పండుగకు కలిసి ఈ నెల 17వ తేదీన కడియంలో వీరనరసింహారెడ్డి సినిమాకు ఆన్‌లైన్‌లో టిక్కెట్లు బుక్‌ చేసుకున్నామని తెలిపారు. అర్ధగంట ఆలస్యంగా థియేటర్‌కు వెళ్లగా సిబ్బంది అనుమతించకపోవడంతో వాగ్వాదం జరిగిందన్నారు. అనంతరం తమను లోపలకు పంపించారని తెలిపారు. కొద్ది సేపటికి దుర్గారావు అనే కానిస్టేబుల్‌ వచ్చి తమను బలవంతంగా స్టేషన్‌కు తరలించి దారుణంగా కొట్టారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తల,చేతులు,ఒంటిపై గాయాలైతే పీహెచ్‌సీకి తీసుకువెళ్లి ఓపీ లేకుండా వైద్యం చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు.స్టేషన్‌ అధికారి అయితే తమను నీచంగా తిట్టడంతో పాటు చంపి రైలు పట్టాలపై పడేస్తానని బెదిరించారని వాపోయారు.తమపై తప్పుడు కేసులు బనాయించి తమ ఫిర్యాదు తీసుకోకండా అన్యాయం చేశారని వాపోయారు.అందుకే డీఐజీని కలిసి తమ సమస్యను వివరించామన్నారు. థియేటర్‌ వద్ద అసలేమి జరిగిందో తెలుసుకోకుండా దారుణంగా వ్యవహరించారని చెప్పారు. తమకు ప్రాణహాని ఉందని..కడియం పోలీసుల నుంచి రక్షణ కల్పించాలని కోరారు.

Updated Date - 2023-01-22T01:00:46+05:30 IST