తడిచిన ప్రతీ ధాన్యం గింజనూ కొంటాం..

ABN , First Publish Date - 2023-05-03T01:10:32+05:30 IST

కరప, మే 2: అకాల వర్షాల వల్ల తడిచిన ప్రతీ ధాన్యం గింజను కొనుగోలు చేస్తామని జిల్లా ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌ ఎస్‌.ఇలాక్కియా స్పష్టంచేశారు. కరప మండలం పెనుగుదురులో మంగళవారం అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి తడిచిన ధాన్యం రాశులు, మొలకెత్తిన వరి పంటను పరిశీలించారు. రెండు రోజులుగా కురుస్తున్న భా

తడిచిన ప్రతీ ధాన్యం గింజనూ కొంటాం..
కరప మండలం పెనుగుదురులో మొలకెత్తిన వరి పంటను పరిశీలిస్తున్న ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌ ఇలాక్కియా

ఇన్‌చార్జ్‌ జిల్లా కలెక్టర్‌ ఇలాక్కియా హామీ

కరప, మే 2: అకాల వర్షాల వల్ల తడిచిన ప్రతీ ధాన్యం గింజను కొనుగోలు చేస్తామని జిల్లా ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌ ఎస్‌.ఇలాక్కియా స్పష్టంచేశారు. కరప మండలం పెనుగుదురులో మంగళవారం అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి తడిచిన ధాన్యం రాశులు, మొలకెత్తిన వరి పంటను పరిశీలించారు. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చేతికందిన పంట నీటిపాలైందని, నిబంధనలను సడలించి మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేసేలా చూడాలని పలువురు రైతులు ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌కు మొరపెట్టుకున్నారు. రైతులెవరూ అధైర్యపడవద్దని బొండాలు రకం సహా రంగుమారిన, తేమశాతం తగ్గిన ధాన్యాన్ని ఆర్బీకేల ద్వారా కొనుగోలుచేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు 6 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలుచేశామన్నారు. బొండాలు రకం ధాన్యం కొనుగోలుకు సంబంధించి వస్తున్న పుకార్లను ఎవరూ నమ్మవద్దని, లక్ష్యాలతో సంబంధం లేకుండా బొండాలు కొంటామని తెలిపారు. జిల్లాలోని 12 బాయిల్డ్‌ రైసుమిల్లులకు బొండాలు ధాన్యం వస్తున్నాయన్నారు. ధాన్యం కొనుగోలుకు సం బంధించి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు, ఆర్బీకే సిబ్బంది చూడాలన్నారు. నడకుదురులోని విజయలక్ష్మి రైస్‌మిల్లును సందర్శించి ధాన్యం కొనుగోలుపై నిర్వాహకులతో మాట్లాడారు. పెనుగుదురులో జగనన్న శాశ్వత భూహక్కు-భూరక్ష కార్యక్రమంలో భాగంగా పొలాల సరిహద్దుల్లో పాతుతున్న స్టోన్‌ ప్లాంటేషన్‌ పనులను పరిశీలించి సిబ్బందికి సూచనలు చేశారు. ఆమె వెంట జడ్పీటీసీ యాళ్ల సుబ్బారావు, డ్వామా పీడీ అడపా వెంకటలక్ష్మి, తహశీల్దార్‌ పొన్నమండ శ్రీనివాసరావు, ఎంపీడీవో కర్రె స్వప్న, ఎంఏవో అప్పసాని వెంకటరాజేష్‌, రెడ్డిపల్లి రమేష్‌, వీఆర్వో పి.ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-05-03T01:10:32+05:30 IST