చెరబట్టేశారు

ABN , First Publish Date - 2023-03-15T02:05:00+05:30 IST

కాకినాడ పోర్టు భూములపై అధికార పార్టీ నేతలు గద్దల్లా వాలిపోతున్నారు. ఖాళీగా ఉన్న ప్రతిచోటా కన్నేసి కబ్జా చేసేస్తున్నారు. రాత్రికి రాత్రుళ్లు గుట్టుచప్పుడు కాకుండా ఏకంగా చదును చేసేస్తున్నారు. అడిగేవారు ఎవరొచ్చినా ఏకంగా ప్రైవేటు సైన్యంతో బెదిరించేస్తున్నారు.

చెరబట్టేశారు
రాత్రికి రాత్రి చదును చేసేసిన పోర్టు భూములివే

కాకినాడ పోర్టు భూములపై కాకినాడ కీలక నేత మళ్లీ కన్ను

పూలే కాలనీ వెనుక ఐదెకరాల పోర్టు భూముల్లో గుట్టుగా పాగా

రూ.25కోట్ల విలువైన భూములపై రాత్రికి రాత్రి కన్నేసి కబ్జా

రామేశంమెట్టనుంచి పదుల సంఖ్యలో టిప్పర్లలో మట్టి తరలించి చదును

అటువైపు ఎవరూ రాకుండా ప్రైవేటు సైన్యాన్ని మోహరించి బరితెగింపు

మొన్న ఎన్జీటీ కోర్టులో ఉన్న మడ భూముల్లో పాగా వేయడానికి గుట్టుగా ఎత్తుగడ

అది బెడిసికొట్టడంతో తోక ముడిచి ఇప్పుడు ఇంకో చోట కబ్జా

(కాకినాడ, ఆంధ్రజ్యోతి)

కాకినాడ పోర్టు భూములపై అధికార పార్టీ నేతలు గద్దల్లా వాలిపోతున్నారు. ఖాళీగా ఉన్న ప్రతిచోటా కన్నేసి కబ్జా చేసేస్తున్నారు. రాత్రికి రాత్రుళ్లు గుట్టుచప్పుడు కాకుండా ఏకంగా చదును చేసేస్తున్నారు. అడిగేవారు ఎవరొచ్చినా ఏకంగా ప్రైవేటు సైన్యంతో బెదిరించేస్తున్నారు. అడ్డుకోవాల్సిన అధికారులు సైతం కాకినాడ కీలకనేతకు భయపడి కన్నెత్తిచూడడం లేదు. తాజాగా పూలే కాలనీ వెనుకనున్న ఐదెకరాల పోర్టు భూముల్లో సదరు కీలకనేత రాత్రికి రాత్రి కబ్జాకు దిగారు. రూ.25కోట్లు విలువ చేసే భూమిని కాజేసేందుకు పన్నాగం పన్నారు. రామేశంమెట్ట నుంచి పదుల టిప్పర్లలో మట్టి తెచ్చి ఏకంగా చదును చేసేయడం కలకలం రేపుతోంది. మొన్నటికి మొన్న ఎన్జీటీ పరిధిలో ఉన్న మడ భూములను మరింత చదును చేసి కబ్జాకు ప్రయత్నం చేయగా ‘ఆంధ్రజ్యోతి’ కథనంతో సదరు కీలక నేత, ఆయన అనుచరులు తోక ముడిచారు. ఇది మరువకముందే మళ్లీ దానికి సమీపంలో కోట్ల విలువైన పోర్టు భూములపై కన్నేసి కొట్టేయడానికి పావులు కదుపుతుండడం అధికార పార్టీ నేత భూముల దాహానికి తార్కాణంగా నిలుస్తోంది.

కనిపిస్తే చాలు కొట్టేయాల్సిందే..

కాకినాడ నగరానికి అతి సమీపంలో యాంకరేజ్‌ పోర్టుకు దాదాపు 1800 ఎకరాల భూములున్నాయి. ఇందులో పక్కనే ఉన్న డీప్‌ వాటర్‌ పోర్టుకు, ఇతర కంపెనీలకు లీజులకు కేటాయించగా ఇంకా వందల ఎకరాల వరకు ఖాళీగా ఉన్నాయి. వీటిలో అధికశాతం భూములు దుమ్ములపేట రైల్వే ట్రాక్‌ నుంచి పూలేకాలనీ వెనుక వరకు విస్తరించి ఉన్నాయి. వీటిలో 80 ఎకరాల వరకు కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే ద్వారం పూడి చంద్రశేఖరరెడ్డి ఒత్తిళ్లతో రెండేళ్ల కిందట వైసీపీ ప్రభుత్వం పేదల ఇళ్ల స్థలాల పేరుతో పోర్టునుంచి బల వంతంగా లాగేసుకుంది. తమకు అవసరం ఉందని, ఆ భూములు ఇవ్వమని అధికారికంగా ప్రభుత్వానికి పోర్టు లేఖ రాసినా పట్టించుకోలేదు. ఇందులో మడ భూములు ఉన్నాయని తెలిసినా జిల్లా రెవెన్యూ, కార్పొరేషన్‌ అధికారులు పట్టించుకోకుండా చదును చేసేశారు. తీరా వ్యవహారం ఎన్జీటీ వరకు వెళ్లడంతో తీవ్ర దుమారం రేగిం ది. దీని సంగతి తేల్చడం కోసం ఎన్జీటీ ప్రత్యేక విచారణ కమిటీని నియమించింది. ఈ కమిటీ ఇక్కడకు వచ్చి అధ్యయనం చేసి చదును చేసింది మడ భూములే అని తేల్చింది. దీంతో ఈ భూములు ప్రస్తుతం వివాదాస్పద జోన్‌లో ఉన్నాయి. వీటిపై ఇటీవల కాకినాడ కీలకనేత కన్నేశారు. ఇళ్లస్థలాలకోసం చదును చేసిన మడ భూ ములు ఖాళీగా ఉన్నాయనే సాకుతో ఏకంగా తన మనుషుల ద్వారా కబ్జాకు ప్రయ త్నించారు. రాత్రికి రాత్రి చదును చేసి పాగా వేయడానికి ప్రయత్నించారు. దీంతో ఈ వ్యవహారాన్ని ఆంధ్రజ్యోతి బయటపెట్టింది. ‘మడపై మళ్లీ తెగింపు’ అంటూ గత నెల 22న కథనాన్ని ప్రచురించింది. ఈ నేపథ్యంలో విషయం బయటకు పొక్కడంతో ద్వారంపూడి విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి సమర్దించుకునే ప్రయత్నం చేశారు. కలెక్టర్‌ సూచనలతో భూములవద్ద ఆగమేఘాలపై హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఫలితంగా సదరు కీలక నేత కబ్జా నుంచి మడ భూములు తప్పించుకున్నాయి.

రూ.25కోట్ల భూమిపై రాత్రికి రాత్రే

ఇది జరిగిన కొద్దిరోజులకు మళ్లీ ఇప్పుడు సదరు కీలకనేత బరితెగించారు. పూలే కాలనీ వెనుక ఉన్న పోర్టు భూములపై కన్నేశారు. ఇవి గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లకు అతి సమీపంలో ఉన్నాయి. ఖాళీగా ఉన్న ఈ భూముల్లో ఫేజ్‌-2కింద టిడ్కో ఇళ్లు ఇవ్వడానికి అప్పట్లో టీడీపీ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. కానీ ఈలోపు ప్రభుత్వం మారడంతో పోర్టు భూములు ఖాళీగా ఉన్నాయి. ఇవి నగరానికి ఆనుకుని ఉన్నవి కావడంతో మంచి గిరాకీ ఉంది. ఎకరం రూ.5కోట్ల వరకు ధర పలుకుతోంది. దీంతో సదరు కీలకనేత ఈ భూములపై కన్నేసి సోమవారం అర్ధరాత్రి కబ్జాకు రంగంలోకి దిగారు. తన మనుషులతో రాత్రికి రాత్రి ఐదెకరాల వరకు చదును చేయించేశారు. రామేశంమెట్ట ఎలాగూ తన అధీనంలో ఉండడంతో పదుల సంఖ్యలో టిప్పర్లలో మట్టిని ఇక్కడకు తరలించేశారు. పొద్దున లేచేసరికి ఐదెకరాలను ఏకంగా చదును చేసేశారు. దీంతో చుట్టపక్కనున్న స్థానికులు రాత్రికి రాత్రి చదును చేసేసిన భూములను చూసి కంగుతిన్నారు. రూ.25కోట్ల విలువైన ఈ భూములను పోర్టు కాపాడుకోవాల్సి ఉండగా, అదేం చేయకపోవడం సదరు నేతకు కలిసి వచ్చింది. ఇప్పుడు తాజా కబ్జా వ్యవహారం వెలుగులోకి వచ్చినా ఎవరూ నోరు మెదపడంలేదు. మరోపక్క ఇక్కడకు మీడియాతోపాటు ప్రతిపక్షాలు వస్తే బండారం బయట పడుతుందనే భయంతో ఐదెకరాలవద్ద ఏకంగా ప్రైవేటు సైన్యాన్ని మోహరించారు. చదును చేసిన భూముల వద్దకు ఎవరూ రాకుండా వారిని కాపలాగా ఉంచారు. దీంతో సదరు కీలకనేత కబ్జా కోరల్లో చిక్కుకున్న పోర్టు భూములు మున్ముందు ఏ అవసరాలకు మళ్లిస్తారో అనేది తేలాల్సి ఉంది. కాగా కబ్జాకు గురైన పోర్టు భూముల విషయం పోర్టు అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా మడ భూముల్లో చదును చేసిన మట్టిని కలెక్టర్‌ ఆదేశాల మేరకు అక్కడినుంచి తవ్వేసి ఐదెకరాల్లో పోస్తున్నారని చెప్పడం విశేషం. తవ్విన మట్టిని రాత్రికి రాత్రి తరలించి ఏకంగా చదును చేసేయాల్సిన అవసరం ఏంటనే అనుమానం కూడా రాకపోవడం విశేషం. అలాగని మడ భూముల వద్దకు వెళ్లి పరిశీలిస్తే అక్కడ మట్టి తవ్విన ఆనవాళ్లే లేవు. దీంతో సదరు కీలకనేత రూ.25కోట్ల భూములపై కబ్జా స్కెచ్‌ వేసి పథకం ప్రకారం తన అధికార బలంతో చెరబట్టడానికి పన్నాగం పట్టినట్లు అర్థమైపోతోంది. కానీ అడ్డుకోవాల్సిన పోర్టు, రెవెన్యూ అధికారులు అసలు తమకేం తెలియనట్లు వ్యవహరిస్తుండడం అనుమానాలకు తావిస్తోంది.

Updated Date - 2023-03-15T02:05:00+05:30 IST