నన్నయ ఓఎస్‌డీ ఆచార్య ఎస్.టేకి గుండెపోటుతో మృతి
ABN , First Publish Date - 2023-05-12T01:03:17+05:30 IST
ఆదికవి నన్నయ యూనివర్శిటీ మేనేజ్‌మెంట్ ప్రొఫెస ర్, ఓఎస్‌డీగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆచార్య టేకి సూరయ్య (ఎస్.టేకి)(53) గుండెపోటుతో రాజమహేంద్ర వరంలోని ఆయన స్వగృహంలో గురువారం మృతి చెందినట్టు యూనివర్శిటీ రిజిస్ట్రార్ ఆచార్య టి.అశోక్ తెలిపారు.
నేడు మారేడుబాకలో అంత్యక్రియలు
దివాన్‌చెరువు, మే 11: ఆదికవి నన్నయ యూనివర్శిటీ మేనేజ్‌మెంట్ ప్రొఫెస ర్, ఓఎస్‌డీగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆచార్య టేకి సూరయ్య (ఎస్.టేకి)(53) గుండెపోటుతో రాజమహేంద్ర వరంలోని ఆయన స్వగృహంలో గురువారం మృతి చెందినట్టు యూనివర్శిటీ రిజిస్ట్రార్ ఆచార్య టి.అశోక్ తెలిపారు. బీఆర్ అంబేడ్కర్ కోనసీమజిల్లా మండపేట పరిధిలోని మారేడుబాక గ్రామంలో జన్మించిన ఎస్.టేకి అంచెలంచెలుగా ఎదిగారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన 1993 భారతీయ విద్యాభవన్ జల్గావ్, 1995 ఉత్తర మహారాష్ట్ర విశ్వవిద్యాలయం జల్గావ్‌లో లెక్చరర్‌గా చేశారు. 1998 ఇండియన్ ఇన్‌స్ట్టిట్యూ ట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్ మెంట్ భోపాల్‌లో రీసెర్చ్ అసోసియేట్, 2007లో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షి యల్ మేనేజ్‌మెంట్, ఫరిదాబాద్‌లో అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహించారు. 2009లో ఆదికవి నన్నయ యూనివర్శిటీ మేనేజ్‌మెంట్ ఆచార్యునిగా గుర్తింపు పొందారు. యూనివర్శిటీ రిజిస్ట్రార్‌గా ఈసీ మెంబర్‌గా, ప్రిన్సిపాల్‌గా, డీన్‌గా బాధ్యతలు నిర్వర్తించి, విశ్వవిద్యాలయ పరిపాలనా వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొనే వారు. ప్రస్తుతం యూనివర్శిటీ ఓఎస్‌డీ, ఆర్ట్స్ అండ్ కామర్స్ కాలేజ్ ప్రిన్సిపాల్‌గా కొనసాగుతున్నారు. వర్శిటీ అధికారులు, అధ్యాపకులు, సిబ్బంది, ప్రముఖులు, విద్యార్థులు ఆయన స్వగృహంలో భౌతికకాయం వద్ద నివాళులర్పించారు. ఆచార్య ఎస్.టేకి మృతిపట్ల ఎస్‌ఎఫ్‌ఐ నన్నయ యూనివర్శిటీ కమిటీ సంతాపం తెలియ జేసింది. ఫెడరేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు డి.అశోక్‌కుమార్, యూనివర్శిటీ నాయకులు జి.ప్రవళ్లిక, ఎస్.సంధ్య, ఎం.గణేష్, కె.విక్రమ్ మాట్లాడుతూ టేకి మృతి నన్నయ వర్శిటీకి తీరనిలోటు అని అన్నారు. నేడు స్వగ్రామం మండపేట మండలం మారేడుబాకలో అంత్యక్రియలు నిర్వహిస్తారు.
ప్రొఫెసర్ ఎస్.టేకి మృతి బాధాకరం
రాజమహేంద్రవరం అర్బన్: నన్నయ వర్శిటీ ప్రొఫెసర్ ఎస్.టేకి అకాలమృతి బాధాకరమని ఆదికవి నన్నయ యూనివర్శిటీ ఎఫిలియేటెడ్ కాలేజెస్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి అన్నారు. గురువారం రాజమహేంద్రవరం సీటీఆర్‌ఐ భాస్కరనగర్‌లోని టేకి స్వగృహానికి వెళ్లి ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించారు.
మానవతావాది టేకి ...
విద్యార్థుల పట్ల, సమాజం పట్ల్ల ఎప్పుడూ మానవత్వాన్ని ప్రదర్శించే మానవతావాది ప్రొఫెసర్ ఎస్.టేకి అని, ఆయన మృతి విద్యారంగానికి తీరనిలోటని రాజమహేంద్రవరం ఎస్‌కేవీటీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఎబెల్ రాజబాబు అన్నారు. గురువారం కళాశాల మూల్యాంకన కేంద్రంలో టేకి చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించారు. ఐక్యూ కో ఆర్డినేటర్ డీవీ రమణమూర్తి, అసిస్టెంట్ క్యాంపు ఆఫీసర్ పీవీబీ సంజీవరావు, సూపరింటెండెంట్ మేడూరు నరసింహ, తులసీరామ్, కళాశాల అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.