రైతులకు గుండె కోత

ABN , First Publish Date - 2023-03-16T01:00:07+05:30 IST

తెలుగు రాష్ట్రాల్లోనే ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలు విభిన్నంగా ఉంటాయి. ఒకపక్క గోదావరి తీరం, మరోపక్క సముద్ర తీరం ఆవహించి ఉంది. ముఖ్యంగా గోదావరి నది తీరం వెంబడి వందలాది లంక గ్రామాలు ఉన్నాయి. లంకగ్రామాల వారికి జీవనాధారమైన వేలాది ఎకరాల పంట భూములున్నాయి. నదీకోత ప్రభావంతో ప్రతి ఏడాది ఈ పంట భూములు నదీగర్భంలో కలిసిపోతున్నాయి.

రైతులకు గుండె కోత
వై.కొత్తపల్లిలో నదీపాతానికి గురై నదీగర్భంలో కలిసిపోతున్న కొబ్బరి చెట్లు.. (పైన) గంటిపెదపూడిలో నదీపాతానికి గురైన కొబ్బరి తోటలు (వరద సమయంలో ఫొటో)

గోదారమ్మ ఒడిలో కలిసిపోతున్న వ్యవసాయ భూములు

నదీకోత నివారణకు చర్యలు శూన్యం

టెక్నికల్‌ అడ్వయిజర్‌ కమిటీ (టీఏసీ) పరిశీలనతో ఒరిగిందేంటో

గ్రోయిన్ల నిర్మాణాలు ప్రతిపాదనలకే పరిమితం

పట్టించుకోని ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగం

జిల్లాలో కోత నివారణకు రూ.523.64 కోట్లతో ప్రతిపాదనలు

గత కొన్నేళ్లుగా లంక గ్రామాల్లో ఇదే పరిస్థితి

పి.గన్నవరం, మార్చి 15: తెలుగు రాష్ట్రాల్లోనే ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలు విభిన్నంగా ఉంటాయి. ఒకపక్క గోదావరి తీరం, మరోపక్క సముద్ర తీరం ఆవహించి ఉంది. ముఖ్యంగా గోదావరి నది తీరం వెంబడి వందలాది లంక గ్రామాలు ఉన్నాయి. లంకగ్రామాల వారికి జీవనాధారమైన వేలాది ఎకరాల పంట భూములున్నాయి. నదీకోత ప్రభావంతో ప్రతి ఏడాది ఈ పంట భూములు నదీగర్భంలో కలిసిపోతున్నాయి. ముఖ్యంగా జిల్లాలోని లంక గ్రామాల వారిలో ఎక్కువశాతం సన్న, చిన్నకారు రైతులు వ్యవసాయం పైనే ఆధారపడి జీవనం సాగిస్తూ ఉంటారు. ఉన్న కొద్దిపాటి వ్యవసాయ భూమి నదీపాతానికి గురై అన్నదాతకు గుండెకోత మిగులుస్తోంది. గోదావరి తీరంలో భూములన్నీ ప్రతి ఏడాది మాయమైపోతుంటే రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. కొన్నేళ్లుగా ఇంత జరుగుతున్నప్పటికీ ప్రజాప్రతినిధులు కనీసం పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. జిల్లాలోని ముమ్మిడివరం మండలం లంకాఫ్‌ ఠానేల్లంక, పొట్టిలంక, సలాదివారిపాలెం, ఐ.పోలవరం మండలం ఎదుర్లంక, రామాలయంపేట, పశుల్లంక, పాతఇంజరం, కొమరగిరి, అయినవిల్లి మండలంలో పొట్టిలంక, శానపల్లింక, యలకల్లంక, కొండుకుదురు కె.గంగవరం మండలం కూళ్ల, సుందరపల్లి, రావులపాలెం మండలం కొమరాజులంక, గోపాలపురం, ఆలమూరు మండలం బడుగువానిలంక ఆత్రేయపురం మండలం పులిదిండి, బొబ్బరల్లంక, మామిడికుదురు మండలం అప్పనపల్లి, పెదపట్నంలంక, బి.దొడ్డవరం, పాశర్లపూడి, ఆదుర్రు, మోరిపాలెం, సఖినేటిపల్లి మండలం అంతర్వేది పల్లిపాలెం, పి.గన్నవరం మండలం గంటిపెదపూడి, వై.కొత్తపల్లి, కె.ఏనుగుపల్లి, జొన్నల్లంక, రాజోలు తదితర ప్రాంతాల్లో వ్యవసాయ భూములు నదీపాతానికి గురవుతున్నాయి. అయితే గతంలో కొన్నిచోట్ల గ్రోయిన్లు నిర్మించినప్పటికి ఎక్కువ ప్రాంతాల్లో గ్రోయిన్ల నిర్మాణం జరగలేదు. లంక భూములతోపాటు జి రాయితీలు భూములు సైతం నదీపాతం అవుతుంటే, కొన్నిచోట్ల ప్రస్తుతం ఎకరానికి 20 నుంచి 30 సెంట్లు మాత్రమే మిగిలిఉన్నాయి. కొబ్బరి తోటలు సైతం గోదారమ్మ ఒడిలో కలిసిపోతుంటే రైతులు ఏమీ చేయలేక తమ బాధ ఎవరికి చెప్పాలో తెలియక వేదనకు గురవుతున్నారు. రెక్కాడితే కాని డొక్కాడని సన్న, చిన్నకారు రైతులు తమ కొద్దిపాటి భూమి నదీపాతానికి గురవుతుంటే.. వారి జీవనం అగమ్యగోచరంగా మారింది. అదేవిధంగా ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో పలుచోట్ల నివాస గృహాలు సైతం గోదారమ్మ ఒడిలో కలిసిపోతుంటే బాధిత కుటుంబాలు సమీప కాలనీలకు తరలిపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల కిందట ఉమ్మడి జిల్లాలో నదీకోతలపై అధ్యయనం చేసి సంబంధిత నివేదికను సమర్పించాలని టెక్నికల్‌ అడ్వయిజర్‌ కమిటీ (టీఏసీ)ని ఏర్పాటుచేసింది. అప్పట్లో ఉమ్మడి జిల్లాల్లో ఐదుగురు సభ్యులతో కూడిన టీఏసీ బృందం స్థానిక అధికారుల సహాయంతో పర్యటించి నదీ కోతలను పరిశీలించింది. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం కమిటీ పరిశీలనతో ఏం చర్యలు తీసుకుందో తెలియదు. కమిటీ మాట దేవుడెరుగు కనీసం ఏటా స్థానిక అధికారులు పంపిన ప్రతిపాదనలు సైతం పక్కన పెట్టడంతో వరదల సమయంలో వ్య వసాయ భూములు నదీగర్భంలో కలిసిపోతున్నాయి. కమిటీ పర్యటించి, రైతులకు ఏం న్యాయం చేసిందని రైతులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ప్రతిపాదనలు పరిశీలించి ఈ ఏడాది వేసవిలోనైనా నదీకోత నివారణకు గ్రోయిన్ల ఏర్పాటుచేయాలని వారు కోరుతు న్నారు. లేదంటే రైతులకు ఉన్న కొద్దిపాటి లంకభూములను కోల్పోవలసి వస్తుంది.

నిధుల మాటేమిటో

జిల్లావ్యాప్తంగా వశిష్ఠ, గౌతమి సబ్‌ డివిజన్ల పరిధిలోని పలు లంక గ్రామాల్లో నదీకోత నివారణకు రూ.523.64 కోట్ల నిధులతో రూపొందించిన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించినట్టు స్థానిక హెడ్‌వర్క్స్‌ అధికారులు చెబుతున్నారు. గౌతమి సబ్‌ డివిజన్‌లో ఆలమూరు మండలం బడుగువానిలంకలో రూ.80 కోట్లు, రావులపాలెం మండలంలో కొమరాజులంకలో రూ.57 కోట్లు, కె.గంగవరం మండలం కూళ్ల, సుందరపల్లి, గురజపులంక, కూనలంకలలో రూ.50 కోట్లు, ముమ్మిడివరం మండలం లంకాఫ్‌ ఠానేల్లంక, పొట్టిలంక, సలాదివారిపాలెంలలో మొత్తం రూ.111 కోట్లతో ప్రతిపాదనలు రూపొందిం చారు. అలాగే వశిష్ఠ సబ్‌ డివిజన్‌ పరిధిలోని ఆత్రేయపురం మండలం పులిదిండిలో రూ.40.50 కోట్లు, రావులపాలెం మండలం గోపాలపురంలో రూ.40 కోట్లు, బొబ్బర్లంకలో రూ.80 లక్షలు, మామిడికుదురు మండలం అప్పనపల్లి-పెదపట్నంలంక రూ.60.73 కోట్లు, బి.దొడ్డవరం, పాశర్లపూడి, ఆదుర్రులలో రూ.22.61 కోట్లు, సఖినేటిపల్లి మండలం అంతర్వేది పల్లిపాలెంలో రూ.61 కోట్లు నిధులతో నదీకోతల నివారణకు గ్రోయిన్లు నిర్మించేందుకు గాను ప్రతిపాదనలు రూపొందించారు.

Updated Date - 2023-03-16T01:00:07+05:30 IST