రోడ్‌ కం రైలు బ్రిడ్జి మూసి వేత.. ప్రజలకు ఇక్కట్లు

ABN , First Publish Date - 2023-09-28T01:09:52+05:30 IST

రోడ్‌ కం రైలు వంతెనను తాత్కాలిక మరమ్మతుల కారణంగా బుధవారం నుంచి మూసివేశారు.ఈ మేరకు కొవ్వూరు - రాజమహేంద్రవరం వైపు పోలీసు పికెటింగ్‌ ఏర్పాటు చేసి వంతెనపై పూర్తిగా వాహన రాకపోకలను నిలిపివేశారు.

రోడ్‌ కం రైలు బ్రిడ్జి మూసి వేత.. ప్రజలకు ఇక్కట్లు
మూసివేసిన రోడ్‌ కం రైలు బ్రిడ్

కొవ్వూరు, సెప్టెంబర్‌ 27 : రోడ్‌ కం రైలు వంతెనను తాత్కాలిక మరమ్మతుల కారణంగా బుధవారం నుంచి మూసివేశారు.ఈ మేరకు కొవ్వూరు - రాజమహేంద్రవరం వైపు పోలీసు పికెటింగ్‌ ఏర్పాటు చేసి వంతెనపై పూర్తిగా వాహన రాకపోకలను నిలిపివేశారు. రూ. 2.10 కోట్లతో రోడ్డు కం రైలు వంతెనపై రహదారి మరమ్మతు పనులు ఈ నెల 27వ తేదీ నుంచి ప్రారంభించి అక్టోబర్‌ 26వ తేదీ వరకు చేపట్టనున్న కారణంగా వంతెనపై రాకపోకలను నిషేధిస్తూ జిల్లా కలెక్టర్‌ కె.మాధవీలత ఉత్తర్వులు జారీచేశారు. దీంతో నెల రోజుల పాటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వాసులకు ఇబ్బందులు తప్పేట్టులేవు. కొవ్వూరు, నిడదవోలు, తాడేపల్లిగూడెం, తణుకు ప్రాంతాల నుంచి ప్రతిరోజు విద్య, ఉపాధి, వైద్య అవసరాల నిమిత్తం వేలాది మంది రాజమహేంద్రవరం వస్తుంటారు. అయితే బ్రిడిపై రాకపోకలు నిషేధించడంతో ప్రయాణికులు, విద్యార్థులకు అవస్థలు తప్పవు. ఏలూరు, జంగారెడ్డిగూడెం బస్సులు కొవ్వూరు డిపోకు వచ్చి ప్రయాణికులను ఎక్కించుకుని గామన్‌బ్రిడ్జి మీదుగా రాజమహేంద్రవరం వెళ్తుండగా తణుకు, తాడేపల్లిగూడెం బస్సులు రాజమహేంద్రవరం వెళ్లే ప్రయాణికులను కొవ్వూరు బస్టాండ్‌లో దింపివేసి వెనక్కి వెళ్లిపోతున్నాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా కలెక్టర్‌ ఆదేశాలమేరకు తణుకు, తాడేపల్లిగూడెం, నిడదవోలో డిపోల బస్సులు విజ్జేశ్వరం బ్యారేజ్‌ మీదుగా ధవళేశ్వరం, రైల్వేస్టేషన్‌ మీదుగా రాజమహేంద్రవరం చేరుకోవాల్సి ఉంది. అయితే కొవ్వూరు మండలం సీతంపేట సెంటర్‌లో బ్యారేజ్‌పై భారీ వాహనాలు ప్రయాణించకుండా బ్యారేజ్‌ అధికారులు గడ్డరు ఏర్పాటుచేశారు. గడ్డర్లను తొలగించకపోవడంతో తణుకు, తాడేపల్లిగూడెం డిపోల బస్సులు ప్రయాణికులను కొవ్వూరు బస్టాండ్‌ వరకు తీసుకువచ్చి దింపి వేస్తున్నారు. బ్యారేజ్‌ వద్ద గడ్డర్లను తొలగించి బస్సులు ధవళేశ్వరం వెళ్లేందుకు బ్యారేజ్‌ అధికారులు అనుమతులు ఇవ్వని పక్షంలో కొవ్వూరు రాజమహేంద్రవరంల మధ్య ప్రత్యేక బస్సులను ఏర్పాటుచేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.గతంలో మాదిరిగా కొవ్వూరు, రాజమహేంద్రవరంల మద్య గోదావరిలో ప్రయాణికులు రాకపోకలకు లాంచీలను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

వంతెన మరమ్మతు పనులు ప్రారంభం..

కొవ్వూరు, సెప్టెంబర్‌ 27 : రోడ్డు కం రైలు బ్రిడ్జి మరమ్మతుల కారణంగా కలుగుతున్న అసౌకర్యానికి వాహనదారులు సహకరించాలని రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌ అన్నారు. వంతెనపై మరమ్మతు పనులను బుధవారం ప్రారంభించి మాట్లాడారు. ఈ నెల 29వ తేదీన రైల్వే, అర్‌అండ్‌బీ శాఖల జాయింట్‌ సమావేశం ఉందని, దానిలో వంతెన పూర్తిస్థాయి మరమ్మత్తులకు సంబంధించి ఒక నిర్ణయానికి వస్తారన్నారు. గోదావరి నదిపై మరో కొత్త వంతెన ప్రతిపాదనను రైల్వేశాఖ మంత్రి దృష్టికి తీసుకు వెళ్లడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరు మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ బావన రత్నకుమారి, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-28T01:09:52+05:30 IST