డాక్టర్‌ సంతకం ఫోర్జరీ ఆరోపణలు

ABN , First Publish Date - 2023-09-28T01:11:17+05:30 IST

మెడికల్‌ ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ కోసం తన సంతకం ఫోర్జరీ చేశారంటూ రాజమహేంద్రవరం జీజీహెచ్‌ మెడికల్‌ హెచ్‌వోడీ డాక్టర్‌ పీవీవీ సత్యనారాయణ బుధవారం సూపరింటెండెంట్‌ దృష్టికి తెచ్చారు.

డాక్టర్‌ సంతకం ఫోర్జరీ ఆరోపణలు

రాజమహేంద్రవరం అర్బన్‌, సెప్టెంబరు 27 : మెడికల్‌ ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ కోసం తన సంతకం ఫోర్జరీ చేశారంటూ రాజమహేంద్రవరం జీజీహెచ్‌ మెడికల్‌ హెచ్‌వోడీ డాక్టర్‌ పీవీవీ సత్యనారాయణ బుధవారం సూపరింటెండెంట్‌ దృష్టికి తెచ్చారు. దీంతో ఈ వ్యవహారం రాజమహేంద్రవరం జీజీహెచ్‌లో కలకలం రేపుతోంది. ఏవీఎన్‌డీ శ్రీనివాస్‌ తనకు నెల రోజుల పాటు మెడికల్‌ ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ కావాలంటూ ప్రభుత్వాసుపత్రికి రావడంతో అక్కడ శానిటేషన్‌ (సులాభ్‌ ) విభాగానికి చెందిన ఒక సూపర్‌వైజర్‌స్థాయి ఉద్యోగి, సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న మరో ఉద్యోగి కలిసి శ్రీనివాస్‌ నుంచి కొంత మొత్తం తీసుకుని తాము సర్టిఫికెట్‌ చేయిస్తామంటూ చెప్పినట్టు సమాచారం. ఈ నెల 6వ తేదీన శ్రీనివాస్‌కు సర్టిఫికెట్‌ అందజేశారు. మెడికల్‌ హెచ్‌వోడీ డాక్టర్‌ పీవీవీ సత్యనారాయణ సంతకాన్ని ఫోర్జరీ చేసి శ్రీనివాస్‌కు మెడికల్‌ ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ ఇచ్చినట్టు ప్రధాన ఆరోపణ. శ్రీనివాస్‌ బుధవారం రాజమహేంద్రవరం జీజీహెచ్‌కు వచ్చి తనకు మరికొన్నాళ్లు సెలవు పొడిగిస్తూ సర్టిఫికెట్‌ ఇవ్వాలని డాక్టర్‌ పీవీవీని కోరడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చినట్టు తెలిసింది. ప్రస్తుతం ఈ విషయం జీజీహెచ్‌ సూపరింటెడెంట్‌ వద్దకు చేరింది. దీనిపై సూపరింటెండెంట్‌ను సంప్రదించడానికి ప్రయత్నించినా స్పందించలేదు. ఆర్‌ఎంవో నజీర్‌ను వివరణ కోరగా మెడికల్‌ లీవు, ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ తదితర వాటిని పొందాలంటే ఒక పద్ధతి ఉందని అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరు సర్టిఫికెట్లు తీసుకున్నా చెల్లవని స్పష్టం చేశారు. ఫోర్జరీ సంతకంపై సూపరింటెండెంట్‌తో మాట్లాడి వివరాలు తెలియజేస్తామని సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం ఈ సంఘటన రాజమహేంద్రవరం జీజీహెచ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది.

Updated Date - 2023-09-28T01:11:17+05:30 IST