Rajahmundry: నేటి నుంచి టీడీపీ మహానాడు

ABN , First Publish Date - 2023-05-27T09:19:51+05:30 IST

తూర్పుగోదావరి జిల్లా: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహానాడు శనివారం నుంచి రాజమండ్రిలో జరగనుంది. ఇందు కోసం భారీ ఏర్పాట్లతో వేమగిరి సభా ప్రాంగణం సిద్ధమైంది. తొలిరోజు సభకు పార్టీ అభిమానులు.. నేతలు..కార్యకర్తలు లక్షల్లో తరలివస్తున్నారు.

Rajahmundry: నేటి నుంచి టీడీపీ మహానాడు

తూర్పుగోదావరి జిల్లా: తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహానాడు శనివారం నుంచి రాజమండ్రిలో జరగనుంది. ఇందు కోసం భారీ ఏర్పాట్లతో వేమగిరి సభా ప్రాంగణం సిద్ధమైంది. తొలిరోజు సభకు పార్టీ అభిమానులు.. నేతలు..కార్యకర్తలు లక్షల్లో తరలివస్తున్నారు. మహానాడులో భాగంగా శనివారం ఉదయం10 గంటలకు ప్రతినిధుల నమోదు కార్యక్రమం జరుగుతుంది. 10.30కు ఫొటో ఎగ్జిబిషన్, 10.45కు రక్తదాన శిబిరం, 10.50... జ్యోతి ప్రజ్వలన జరుగుతుంది. అనంతరం 11.00 గంటలకు ఏపీ, తెలంగాణపై ప్రధాన కార్యదర్శి నివేదిక, 11.10 గంటలకు మృతి చెందిన పార్టీ కార్యకర్తలు, నేతలకు సంతాపం ప్రకటన. 11.50 గంటలకు జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ప్రసంగం, ప్రారంభోపన్యాసం ఉంటుంది. అనంతరం మధ్యాహ్నం 12.15 గంటల నుంచి పలు అంశాలపై తీర్మానాలు చేస్తారు.

కాగా రాజమహేంద్రవరంలో శని, ఆదివారాల్లో జరుగుతున్న మహానాడు సందర్భంగా ట్రాఫిక్‌కి ఇబ్బంది కలగకుండా ట్రాన్స్‌పోర్ట్‌ వాహనాలను మళ్లిస్తారు. ముఖ్యంగా వైజాగ్‌ వైపు నుంచి వచ్చే వాహనాలను కత్తిపూడి వద్ద మళ్లిస్తారు. సభ జరుగుతున్న వేమగిరి ప్రాంతానికి అనుమతించరు. విజయవాడ నుంచి వచ్చే ట్రాన్స్‌పోర్టు వాహనాలను గుండుగొలను వద్ద మళ్లిస్తారు. విజయవాడ నుంచి విశాఖ వెళ్లే ట్రాన్స్‌పోర్టు, సాధారణ వాహనాలు గుండుగొలను, నల్లజర్ల, కొవ్వూరు, గామన్‌ బ్రిడ్జి (నాలుగో వంతెన) మీదుగా పంపిస్తారు. తాడేపల్లిగూడెం, పశ్చిమగోదావరి నుంచి వచ్చే వాహనాలను నల్లజర్ల, కొవ్వూరు, గామన్‌ బ్రిడ్జి మీదుగా విశాఖవైపు.. జొన్నాడ నుంచి మండపేట, రామచంద్రాపురం, కాకినాడ మీదుగా కత్తిపూడి హైవేకు వెళ్తాయి. విశాఖ నుంచి వచ్చే వాహనాలు కత్తిపూడి వద్ద డైవర్షన్‌ తీసుకొని పిఠాపురం, కాకినాడ, రామచంద్రాపురం, మండపేట, జొన్నాడ, రావులపాలెం, తణుకు, తాడేపల్లిగూడెం, ఏలూరు మీదుగా విజయవాడ వైపు వెళ్తాయి. తూర్పుగోదావరి జిల్లాలో.. పెరవలి వద్ద దారి మళ్లించి సమిశ్రగూడెం, విజ్జేశ్వరం, కొవ్వూరు, గామన్‌ బ్రిడ్జి గుండా విశాఖపట్నం పంపిస్తారు. విశాఖ వైపు నుంచి వచ్చేవాటిని దివాన్‌చెరువు సమీపంలోని జీరో పాయింట్‌ వద్ద మళ్లించి గామన్‌ బ్రిడ్జి మీదుగా గుండుగొలను పంపిస్తారు. పెరవలివైపు నుంచి వచ్చే వాటిని విజ్జేశ్వరం వద్ద డైవర్షన్‌ ఇచ్చి కొవ్వూరు, గామన్‌ బ్రిడ్జి మీదుగా విశాఖ పంపిస్తారు.

Updated Date - 2023-05-27T09:19:51+05:30 IST