కదలరు.. వదలరు..!

ABN , First Publish Date - 2023-06-30T01:17:41+05:30 IST

తూర్పుకనుమల్లో కొలువై భక్తుల పాలిట కొంగుబంగారంగా వెలుగొందుతున్న తలుపులమ్మ అమ్మవారి దేవస్థానంలో ప్రత్యేక పనితీరుతో అధికారుల ప్రసన్నంతో ఒకేచోట పాతుకుపోయి, మరో విభాగానికి వెళ్లడానికి ఇష్టపడని ఉద్యోగులకు దేవదాయశాఖ ఝలక్‌ ఇచ్చింది.

కదలరు.. వదలరు..!

  • లోవ దేవస్థానంలో ఒకే విభాగంలో పాతుకుపోతున్న ఉద్యోగులు

  • అధికారుల ప్రసన్నంతో అదే సీటులో..

  • చెక్‌ పెట్టిన దేవదాయ శాఖ ఉత్తర్వులు

  • మూడు నెలలకోసారి మార్చాలని ఆదేశాలు

తుని, జూన్‌ 29: తూర్పుకనుమల్లో కొలువై భక్తుల పాలిట కొంగుబంగారంగా వెలుగొందుతున్న తలుపులమ్మ అమ్మవారి దేవస్థానంలో ప్రత్యేక పనితీరుతో అధికారుల ప్రసన్నంతో ఒకేచోట పాతుకుపోయి, మరో విభాగానికి వెళ్లడానికి ఇష్టపడని ఉద్యోగులకు దేవదాయశాఖ ఝలక్‌ ఇచ్చింది. ఇకనుంచి ఈ విధానానికి ఫుల్‌స్టాప్‌ పెట్టి, ఎవరు ఏ విభాగంలో పనిచేస్తున్నా, ఏ సీట్లో విధులు నిర్వర్తిస్తున్నా, ప్రతి మూడు నెలలకోసారి రొటేషన్‌ పద్ధతిలో మార్పులు చేయాల్సిందేనని ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఆదేశాలతో లోవ దేవస్థానంలో ఉద్యోగుల గొంతులో వెలక్కాయ పడినట్టయింది.

అసలు కథ ఇదీ..

సాధారణ బదిలీల సమయంలో సిబ్బంది ఒక దేవస్థానం నుంచి మరో దేవస్థానానికి బదిలీ అవుతున్నారు. ఇతర దేవస్థానాలనుంచి లోవ దేవస్థానానికి వచ్చిన సిబ్బంది వివిధ విభాగాల్లో విధుల్లో చేరిన ఉద్యోగులు అక్కడే సుస్థిర స్థానాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. అధికారుల ఆశీస్సులు పుష్కలంగా ఉంటే ఎన్నాళ్లయినా అక్కడే ఉండిపోతున్నారు. తెరవెనుక వ్యవహారాలు తెలివిగా చేసుకుంటున్నారు. ఈ చేష్టలు ఆలయ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నాయి. లోవ దేవస్థానంలో ఇంజనీరింగ్‌, ప్రసాదం, టికెట్‌ విభాగం, ఎస్టాబ్లి్‌షమెంట్‌, పారిశుధ్యంతో పాటు పలు విభాగాలున్నాయి. వీటికి ఏఈవోలు, ఇంజనీరిగ్‌ విభాగాలకు డీఈ, ఏఈలున్నారు. మిగిలిన విభాగాల్లో సూపరింటెండెంట్‌లు, సీనియర్‌, జూనియర్‌, రికార్డు అసిస్టెంట్లు, నాల్గో తరగతి సిబ్బంది ఉన్నారు. సాధారణ బదిలీలు వచ్చే వరకు వారంతా విభాగాలు మారుతున్న దాఖలాలు లేవు. అధికారులు అంతర్గత బదిలీలు చేస్తున్నప్పటికీ అందులో కొంతమందికే స్థానచలనం ఉంటుంది. అధికారుల ఆశీస్సులు పుష్కలంగా ఉన్నవారు మాత్రం చేరిన విభాగంలోనే సాధారణ బదిలీల వరకు కొనసాగుతున్నారు. కొంతమంది ఉద్యోగులపై ఆరోపణలు వస్తున్నప్పటికీ వారికి ఎలాంటి స్థానచలం ఉండట్లేదు. కొంతమంది అధికారులు ప్రస్తుతం నడుస్తున్న విధానాన్ని కదపడం ఎందుకులే అనుకుంటుండగా మరికొందరు వారి ప్రాధాన్యాలకు అనుగుణంగా మార్పులు చేసుకుంటున్నారు. ఇప్పటివరకు ఇదే పరిస్థితి కొనసాగుతూ వచ్చింది. ముఖ్యంగా ప్రసాదాలు, టిక్కెట్‌ కౌంటర్లు, ఇంజనీరింగ్‌, టెండర్ల విభాగాల్లో ఉద్యోగులు కొందరు ప్రత్యేక పనితీరు చూపిస్తున్నారు. ప్రత్యామ్నాయ మార్గంలో వచ్చే ఆదాయం ఉండడంతో ముందే ఖర్చీ ఫ్‌లు వేసుకుంటున్నారు. ఇలాంటి వారికి దేవదాయశాఖ ఇచ్చిన ఉత్తర్వులు షాక్‌కు గురిచేశాయి.

కొత్త నిబంధనలివీ..

ఏఈవోలు, సూపరింటెండెంట్లు, సీనియర్‌, జూనియర్‌, రికార్డు అసిస్టెంట్లను ప్రతి మూడు నెలలకు ఒకసారి రొటేషన్‌ పద్ధతిలో మార్పు చేయాలి.

కౌంటర్లలో విధులు నిర్వర్తించే ఉద్యోగులు, నాల్గో తరగతి ఉద్యోగులను ప్రతి మూడు నెలలకు ఒకసారి రొటేషన్‌ పద్ధతిలో మార్చాలి.

అవుట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు ఉద్యోగులను మూడు నెలలకు ఒకసారి రొటేషన్‌ చేయాలి.

పారిశుధ్య, సెక్యూరిటీ సిబ్బందిని కూడా ఇలాగే మార్చాలి.

అవుట్‌ సోర్సింగ్‌, కాంట్రాక్టు పద్ధతిలో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందిని వారు పనిచేస్తున్న విభాగంలోనే కొనసాగిస్తూ, సీట్లు మార్చవచ్చు.

Updated Date - 2023-06-30T01:17:41+05:30 IST