చిత్తగించండి..
ABN , First Publish Date - 2023-08-14T01:33:08+05:30 IST
పేరవరం సమీపంలో నదీకోతకు గురవుతున్న లంక పొలాలు కోసేస్తోంది..! నదీ కోత..రైతన్నకు గుండె కోత రైతుల కళ్లెదుటే లంక భూములు నదీగర్భంలో కలిసిపోతూ ఉండటంతో రైతన్నకు గుండెకోతను మిగిలిస్తుంది. ప్రతి ఏటా లంక భూములలో వివిధ పంటల సాగు చేస్తున్న రైతుల బాధలు కన్నీరుపెట్టిస్తున్నాయి. గోదావరి వరదలకు ప్రతి ఏటా లంక భూములు గోదావరిలో కొట్టుకుపోతున్నాయి. భూములు కోల్పోతున్న రైతులు అప్పులపాలై దుక్కుతోచని పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్నారు. ఫ నదీ గర్భంలో కలిసిపోతున్న తోటలు, భూములు ఫ వరదలు వచ్చిన ప్రతిఏటా భూమి కోల్పోతున్న రైతులు ఫ బలహీనంగా మారుతున్న ఏటిగట్లు (ఆత్రేయపురం) పులిదిండిలో నదీ ప్రవాహానికి అండలు అండలుగా విరిగిపోయి కొబ్బరి తోటలు గోదావరిలో కోతకు గురవుతున్నాయి. కొత్తపేట నియోజకవర్గ పరిధిలోని వశిష్ట, గౌతమి గోదావరి నదులను ఆనుకుని ఉన్న వందల ఎకరాల లంక భూములు నదీగర్భంలోకి కొట్టుకుపోతున్నాయి. మరికొన్ని లంకలు కనుమరుగయ్యే ప్రమాదం పొంచి ఉంది. ఆత్రేయపురం మండలంలోని వశిష్ట, గౌతమి పరీవాహక ప్రాంతాల పరిధిలోని 12 లంక గ్రామాల్లో నదీకోతలు ఎక్కువగా ఉన్నాయి. బొబ్బర్లంకలో నివాస గృహాలు కోతకు గురవుతున్నాయి. గ్రోయిన్లు నిర్మాణాల ద్వారా నదీకోతను నివారించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఎంతైనా ఉంది. అలాగే ఏటిగట్లు ఆధ్వానంగా ఉన్నాయి. రైతులు వ్యవసాయ ఉత్పత్తులను ఏటిగట్లపై తరలించేందుకు ఏ మాత్రం అనువుగా లేదు.కొన్ని చోట్ల బలహీనంగా ఉన్నాయి. వరదల సమయంలో ప్రమాదాలు సైతం పొంచి ఉంది. రైతుల పక్షపాతిగా చెప్పుకుంటున్న ప్రభుత్వం రైతుసంక్షేమానికి ఒరగబెట్టింది శూన్యమని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. రైతులకు ఉపయోగపడే విధంగా ఏటిగట్లను అభివృద్ధి చేసి నదీకోత నివారణకు గ్రోయిన్లు నిర్మించాల్సిన అవసరం ప్రభుత్వంపై ఎంతైనా ఉంది.
వాడపల్లి ఆలయానికి.. డిప్యూటీ కమిషనర్ హోదా కోసం
ప్రభుత్వానికి ప్రతిపాదించిన దేవదాయ శాఖ
ఏడాదికి వార్షిక ఆదాయం రూ.15 కోట్లు
హోదా వస్తే పరిపాలనా పరమైన సౌలభ్యం పొందే అవకాశం
ఆత్రేయపురం, ఆగస్టు 13: రాష్ట్రంలో వార్షిక ఆదాయం రూ. 5 కోట్లు పైబడి వస్తున్న ఆలయాలకు డిప్యూటీ కమిషనర్ హోదా కల్పించేందుకు దేవదాయ శాఖ కమిషనర్ ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి నివేదించారు. ఏడాది కాలం నుంచి ఈ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చడంలేదు. ఈ నెలలో జరగనున్న కేబినెట్ భేటీలో ఈ ప్రతిపాదనలు పరిపాలన ఆమోదం పొంది కేబినెట్ తీర్మానం ద్వారా డీసీ హోదా దక్కనున్నట్లు సమాచారం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన అన్నవరం సత్యనారాయణస్వామి జాయింట్ కమిషనర్ హోదాలో నడుస్తుంది. అప్పనపల్లి బాలబాలాజీ, అంతర్వేది నరసింహస్వామి, మందపల్లి శనేశ్వరస్వామి, పెద్దాపురం మరిడమ్మ, కాకినాడ ఎంఎస్‌ఎన్ చార్టీస్, రాజమహేంద్రవరంలోని పందిరిమహాదేవుడు, కోటిలింగాల సత్రాలు సహాయ కమిషనర్ హోదాలో పరిపాలన సాగుతున్నాయి. వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి పుణ్యక్షేత్రానికి ప్రతి శనివారం వివిధ రాష్ర్టాల నుంచి సుమారు 50 వేల మంది భక్తులు విచ్చేసి స్వామి వారికి ఏడు ప్రదక్షిణలు నిర్వహించుకుని దర్శించుకుంటున్నారు. రోజురోజుకు స్వామివారి ఖ్యాతి ఇనుమడింప చేయడంతో ఘననీయమైన ఆదాయం లభిస్తుంది. ఆలయంలో ప్రాకార మండప నిర్మాణంతో పాటు మాడ వీధులలో సీసీ రహదారులు భక్తులకు వివిధ సౌకర్యాలు కల్పిస్తున్నారు. రూ.4.50 కోట్లతో వకులమాత అన్నదాన భవనం నిర్మాణ దశలో ఉంది. రూ.2.80 కోట్లతో పుష్కరిణి అభివృద్ధికి నిధులుమంజూరయ్యాయి. స్వామి వారి వార్షిక ఆదాయం రూ.15 కోట్లు పైబడి లభిస్తుంది. ఈ ఆలయానికి డిప్యూటీ కమిషనర్ హోదా కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. డీసీ హోదా దక్కడం ద్వారా పరిపాలన సౌలభ్యంతో పాటు భక్తుల సమస్యలను సత్వరమే పరిష్కరిస్తూ అభివృద్ధి పనులపై సత్వరమే నిర్ణయం తీసుకునే అధికారం డిప్యూటీ కమిషనర్‌కు ఉంటుంది. కేబినెట్ ఆమోదం పొందితే డీసీ ఏలుబడిలో వెంకన్న ఆలయ పరిపాలన సాగనుంది.