Kadapa Regional Joint Directorపై విచారణకు ఈసీ ఆదేశాలు
ABN , First Publish Date - 2023-02-17T10:33:02+05:30 IST
అనంతపురం ఆర్డిటీ వేదికగా వినూత్న ఘటన చోటు చేసుకుంది. ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్ ప్రతాప్ రెడ్డి విద్యాశాఖ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. నిజానికి ఈ సమావేశం ముసుగులో.. వైసీపీ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది.
అనంతపురం : అనంతపురం ఆర్డిటీ (Rural Development Test ) వేదికగా వినూత్న ఘటన చోటు చేసుకుంది. కడప రీజనల్ జాయింట్ డైరెక్టర్, ఎన్‌సీఈఆర్టీ డైరెక్టర్ ప్రతాప్ రెడ్డి విద్యాశాఖ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. నిజానికి ఈ సమావేశం ముసుగులో.. వైసీపీ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది. ఆర్డీటి సంస్థ కార్యాలయం ఆవరణలో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలతో ప్రతాపరెడ్డి విందు ఏర్పాటు చేశారు. ఇక ఈ విందులో ప్రతాప్‌రెడ్డి చేసిన పనులు విస్తుగొలిపాయి.
హెడ్ మాస్టర్లు, అధికారుల వద్దకు వెళ్లి పలకరింపుల వరకూ ఓకే కానీ.. కౌగిలింతలు, కరచాలానాలు, సెల్ఫీలతో ప్రతాప్ రెడ్డి హంగామా చేశారు. సమావేశం వేదికపైకి సంఘాల నేతలకు ఆహ్వానం పలికారు. మొత్తంగా విద్యాశాఖ సమావేశాన్ని వైసీపీ ఎన్నికల ప్రచారంగా మార్చారు. విందు సమాచారం తెలుసుకుని ఆర్డీటి కార్యాలయం వద్దకు ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల నేతలు వెళ్లారు. వైసీపీ మద్దతు అభ్యర్థి ఎంవీ రామచంద్రారెడ్డి గెలుపు కోసమే అంటూ విమర్శలు ఎన్నికల నిబంధనలను బేఖాతరు చేసి విందు సమావేశం ఏర్పాటు చేయడమేంటంటూ ప్రతాప్ రెడ్డిని విద్యార్థి సంఘాల నేతలు నిలదీశారు. దీంతో ప్రతాప్‌రెడ్డి రివర్స్ డ్రామాకు తెరదీశారు.
తనను హత్య చేసేందుకు వచ్చారంటూ విద్యార్థి సంఘం నేతలపై ఎదురుదాడికి దిగారు. ప్రశ్నించిన ఎస్ఎఫ్ఐ, ఎఐఎస్ఎఫ్, డివైఎఫ్ఐ సంఘాల నాయకులపై ఎన్సీఈఆర్టీ డైరెక్టర్ ప్రతాప్ రెడ్డి, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు దౌర్జన్యానికి దిగాయి. విద్యార్థి సంఘాల నేతలను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మొత్తానికి ఈ వ్యవహారం ఎన్నికల కమిషన్‌కు చేరింది. ప్రతాప్ రెడ్డిపై ఫిర్యాదుల నేపథ్యంలో ఎన్నికల కమిషన్ విచారణకు ఆదేశాలు జారీ చేసింది. వైసీపీ ఏజెంట్‌లా ప్రతాప్ రెడ్డి వ్యవహరిస్తున్నారంటూ సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ మండిపడ్డారు.