ISRO: వచ్చే ఏడాది గగన్‌యాన్ ప్రయోగం: సోమ్‌నాథ్
ABN , First Publish Date - 2023-04-22T20:49:07+05:30 IST
ఇస్రోకు ఈ ఏడాది ఇది రెండో వాణిజ్య రంగ ప్రయోగ విజయమని ఇస్రో చైర్మన్ సోమ్‌నాథ్ (ISRO Chairman Somnath) తెలిపారు. పీఎస్‌ఎల్వీ-సీ 55 (PSLV-C 55) రాకెట్ విజయం
సూళ్లూరుపేట: ఇస్రోకు ఈ ఏడాది ఇది రెండో వాణిజ్య రంగ ప్రయోగ విజయమని ఇస్రో చైర్మన్ సోమ్‌నాథ్ (ISRO Chairman Somnath) తెలిపారు. పీఎస్‌ఎల్వీ-సీ 55 (PSLV-C 55) రాకెట్ విజయం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ఏడాది అంతా ఇస్రోకు శుభపరిణామాలే అన్నారు. ఈ ఏడాది ప్రయోగించిన మూడు ప్రయోగాలు విజయబావుటా ఎగురవేశాయని ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. పీఎస్‌ఎల్వీ-సీ 55 రాకెట్ పూర్తిగా వాణిజ్య రంగ ప్రయోగమని ఈ రాకెట్ ద్వారా సింగపూర్ (Singapore) దేశానికి చెందిన ఉపగ్రహాలను విజయవంతంగా రోదసీలోకి చేర్చామన్నారు. ఇప్పటి వరకు 33 దేశాలకు చెందిన 424 ఉపగ్రహాలను మన వాహక నౌక ద్వారా పంపామని పేర్కొన్నారు.
ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి చేర్చిన తరువాత పీఎస్-4లో ఆరిస్-2, పైలెట్, ఆర్కా-200, స్టార్ బెర్రి, డీఎస్‌వోడీ (DSVOD), డీఎస్‌వోడీ-3 యూ, డీఎస్‌వోడీ-06 అనే 7 రకాల చిన్న పేలోడ్లను కూడా ఈ ప్రయోగంలో ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టామన్నారు. ఈ తరహా ప్రయోగం జరగడం ఇదే తొలిసారి అని ఇస్రో చైర్మన్ ప్రకటించారు. ఇది పూర్తిగా వాణిజ్య ప్రయోగమని ఉపగ్రహం నుంచి సంకేతాలు కూడా అందుకున్నట్లు తెలిపారు. త్వరలోనే మరో పీఎస్‌ఎల్వీ ద్వారా సూర్యుని మీద అధ్యయనం కోసం ఆదిత్య-ఎల్ 1 ప్రయయోగం, జీఎస్‌ఎల్‌వీ ద్వారా నావిక్ ఉపగ్రహ ప్రయోగం, మార్క్ 3 ద్వారా చంద్రయాన్-3 ఉపగ్రహ ప్రయోగం ఉంటాయని పేర్కొన్నారు. వచ్చే ఏడాది మొదట్లో మానవ రహిత గగన్‌యాన్ ప్రయోగం ఉంటుందని దీనికి సంబంధించిన కీలక పరీక్షలు సైతం వేగంగా సాగుతున్నాయని సోమ్‌నాథ్ వెల్లడించారు.