LokeshPadayatra: గజినీ.. జగన్: లోకేశ్
ABN , First Publish Date - 2023-02-17T21:01:06+05:30 IST
‘ఒక్క ఛాన్స్ ముఖ్యమంత్రి పేరు గజినీ. ఇతడు అబద్దాలు తప్ప మరేం మాట్లాడడు. 25 ఎంపీ స్థానాలను గెలిపిస్తే ఏపీకి ప్రత్యేక హోదా తెస్తానన్నాడు.
శ్రీకాళహస్తి: ‘ఒక్క ఛాన్స్ ముఖ్యమంత్రి పేరు గజినీ. ఇతడు అబద్దాలు తప్ప మరేం మాట్లాడడు. 25 ఎంపీ స్థానాలను గెలిపిస్తే ఏపీకి ప్రత్యేక హోదా తెస్తానన్నాడు. ఇప్పుడు 31 మంది ఎంపీలు ఉన్నారన్న విషయం గజినీ మరిచిపోయాడు’ అని సీఎం జగన్‌ను ఉద్దేశించి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (NaraLokesh) వ్యంగ్యంగా అన్నారు. 22వ రోజు యువగళం పాదయాత్ర (YuvaGalamPadayatra)లో భాగంగా శుక్రవారం ఆయన తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం నుంచి శ్రీకాళహస్తి నియోజకవర్గంలోకి ప్రవేశించి పాదయాత్ర కొనసాగించారు. శ్రీకాళహస్తి (Srikalahasti) శివారులోని రాజీవ్‌నగర్‌లో నిర్మించిన టిడ్కో ఇళ్లను పరిశీలించారు. టీడీపీ (TDP) హయాంలో నిర్మించిన ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఒక్క పరిశ్రమ ముందైనా సెల్ఫీ దిగగలవా?
‘ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి వారంలోనే సీపీఎస్ రద్దుచేస్తామన్నాడు. ఆంధ్రల ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టాడు. గజని కదా సీపీఎస్ (CPS)ను మరిచిపోయాడు. ఎన్నికల ముందు అమరావతి రాజధాని అన్నాడు. మూడుముక్కలాట ఆడాడు. ఎక్కడికి పోతే అక్కడ రాజధాని అంటాడు. కడప ఉక్కు ఫ్యాక్టరీ (Kadapa Steel Factory)లో 2019లో 20వేల ఉద్యోగాలని శంకుస్థాపన చేశాడు. మళ్లీ మొన్న శంకుస్థాపన చేసి 6వేల ఉద్యోగాలు ఇస్తానన్నాడు. గజినీ కదా అన్నీ మరిచిపోయాడు. బూంబూం, ప్రెసిడెంట్ మెడల్ వంటి జే బ్రాండ్లను తీసుకొచ్చి, ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుకుంటున్నాడు. ఎన్నికల్లో రాయలసీమ బిడ్డ అన్నాడు. సీమకు ఏమి పీకాడు. ఇంటి పన్ను నుంచి చెత్తపన్ను వరకు అన్నీ పెంచుకుంటూ పోతున్నాడు. అనుభవంలేని వ్యక్తి ఏపీ సీఎం అయితే ఇలానే ఉంటుంది. పబ్లిసిటీ పీక్ అసలు విషయం వీక్. సత్యవేడు పాదయాత్రలో డిక్సన్ కంపెనీ బస్సు ఎక్కి ఆ ఉద్యోగులతో సెల్ఫీ దిగాను. ఏపీలో ఒక్క పరిశ్రమైనా తీసుకొచ్చావా? దానిముందు సెల్ఫీ తీసుకోగలవా?’ అని సీఎం జగన్‌పై లోకేశ్ తీవ్ర విమర్శలు చేశారు.
కుక్కలు...పందులకు కూడా పన్ను
‘రానున్న కాలంలో పీల్చే గాలికి కూడా వలంటీర్లు పన్నులేసేందుకు వస్తారు. పొరపాటున మీరు వాళ్లు తెచ్చిన మెషిన్లలో గాలి ఊదారో.. మీరు పన్ను కట్టాల్సిందే’ అంటూ లోకేశ్ వ్యంగ్యంగా అన్నారు. కుక్కలు, పందులకు కూడా జగన్ రెడ్డి పన్నులు వేస్తాడని ఆరోపించారు. సైకో పాలనలో తనతోఆటు పోలీసులు కూడా బాధితులేనన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అక్రమ కేసులపై జుడీషియల్ విచారణ చేయించి, అవినీతి అధికారుల తాటతీస్తామని హెచ్చరించారు.
పెద్దఎత్తున పోలీసుల మోహరింపు
శ్రీకాళహస్తి నియోజకవర్గంలోకి లోకేశ్ పాదయాత్ర ప్రవేశించిన నేపథ్యంలో అసాధారణ రీతిలో పోలీసులు మోహరించారు. శివరాత్రి పర్వదినం సందర్భంగా పోలీసు బలగాలను పెంచామని, అంతేతప్ప పాదయాత్ర కోసమని కొందరు అపోహపడుతున్నారని తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వరరెడ్డి స్పష్టం చేశారు. అయితే మాడవీధులగుండా పాదయాత్ర వెళ్లేందుకు టీడీపీ వారు అనుమతి కోరారని, భక్తులకు ఇబ్బందులు కల్పించరాదనే ఉద్దేశ్యంతో అందుకు అనుమతించలేదన్నారు. దీనికి టీడీపీ నేతలూ అంగీకరించి.. ప్రత్యామ్నాయ మార్గంలో పాదయాత్ర చేస్తున్నారన్నారు. ఇక శ్రీకాళహస్తీశ్వర స్వామి దర్శనం కోసం లోకేశ్‌కు ఏర్పాట్లు చేస్తామన్నారు.