Bopparaju: ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదు: బొప్పరాజు
ABN , First Publish Date - 2023-05-08T20:53:52+05:30 IST
ఉద్యోగ, ఉపాధ్యాయులపై అక్రమ అరెస్టులు, సస్పెన్షన్లు చేస్తే ఈ ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదని ఏపీ అమరావతి జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు
శ్రీకాకుళం: ఉద్యోగ, ఉపాధ్యాయులపై అక్రమ అరెస్టులు, సస్పెన్షన్లు చేస్తే ఈ ప్రభుత్వం మూల్యం చెల్లించుకోక తప్పదని ఏపీ అమరావతి జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు (Bopparaju Venkateswarlu) హెచ్చరించారు. విద్యార్థులకు పుస్తకాల పంపిణీలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే.. జిల్లా విద్యాశాఖాధికారితో పాటు ఇతర అధికారులు, ఉపాధ్యాయులను సస్పెండ్ చేయడం బాధకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయులపై కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని మండిపడ్డారు. 26 జిల్లాల్లో 3వ దశ ఉద్యమంలో భాగంగా ఉపాధ్యాయులపై, అక్రమ కేసులు, సస్పెన్షన్లు ఎత్తివేయాలని కోరుతూ కలెక్టర్లకు వినతపత్రాలను ఇస్తున్నామని బొప్పరాజు తెలిపారు.
రాష్ట్రంలో విద్యావ్యవస్థను నిర్వీర్యం చేయడానికి ఈ ప్రభుత్వం కుట్రపన్నుతోందని ఆరోపించారు. భవిష్యత్ తరాలకు ఉత్తమ విద్యను అందించాలనుకునే ఉపాధ్యాయులను ఇలా ఇబ్బందులు పాల్జేయడం సరికాదని, వారి ఆత్మగౌరవానికి భంగం కలిగించే విధి, విధానాలను మార్పు చేయాలని అన్నారు. పార్వతీపురం Parvathipuram) మన్యం జిల్లా పదో తరగతి పరీక్షల్లో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలోనే నిలవడం ఉపాధ్యాయుల వల్లేనని, ఈ విషయం ప్రభుత్వంతో పాటు ఉన్నతాధికారులు తెలుసుకోవాలని హితవు పలికారు. సీపీఎస్ రద్దు ఉద్యమంలో భాగంగా 1650 మంది ఉపాధ్యాయులపై పెట్టిన కేసులన వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ బొప్పరాజు వెంకటేశ్వర్లు చేశారు.