AP Employees: పెండింగ్ బిల్లులు 3 దశలుగా చెల్లిస్తామని ప్రభుత్వం హామీ: బొప్పరాజు

ABN , First Publish Date - 2023-03-08T15:59:06+05:30 IST

సీఎస్‌ జవహర్‌రెడ్డి (CS Jawahar Reddy)తో ఏపీ జేఏసీ అమరావతి ప్రతినిధుల భేటీ అయ్యారు. సమావేశానంతరం ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు

AP Employees: పెండింగ్ బిల్లులు 3 దశలుగా చెల్లిస్తామని ప్రభుత్వం హామీ: బొప్పరాజు

అమరావతి: సీఎస్‌ జవహర్‌రెడ్డి (CS Jawahar Reddy)తో ఏపీ జేఏసీ అమరావతి ప్రతినిధుల భేటీ అయ్యారు. సమావేశానంతరం ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు (AP JAC Amaravati Chairman Bopparaju Venkateshwarlu) మీడియాతో మాట్లాడారు. పెండింగ్ బిల్లులు 3 దశలుగా చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని తెలిపారు. నిన్నటి చర్చల సారాంశాన్ని లిఖితపూర్వకంగా ఇవ్వాలని సీఎస్‌ను కోరాయని, సాయంత్రంలోగా ఇస్తామని ఆయన అన్నారని బొప్పరాజు పేర్కొన్నారు. సాయంత్రంలోగా మినిట్స్ ఇస్తే ఉద్యమ కార్యాచరణపై రేపటిలోగా నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. మినిట్స్ ఇవ్వకుంటే యధావిధిగా ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని ఆయన హెచ్చరించారు. మినిట్స్ ఇచ్చినా పెండింగ్ బిల్లులు చెల్లించకుంటే ఉద్యమిస్తామని దామోదర్‌రెడ్డి (Damodar Reddy) తెలిపారు.

కాగా.. పెండింగ్‌ ఆర్థిక డిమాండ్లు తీర్చాలంటూ ఏపీ జేఏసీ అమరావతి ఉద్యమ కార్యాచరణకు పిలుపునిచ్చిన నేపథ్యంలో, ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మంగళవారం అమరావతి సచివాలయంలో మంత్రుల కమిటీ సమావేశమైంది. అయితే ఉద్యోగసంఘాలతో జరిగిన మంత్రుల కమిటీ సమావేశం ఏమీ తేలకుండానే ముగిసింది. ఉద్యోగ సమస్యల పరిష్కారంపై ఉద్యోగ నేతలు లిఖితపూర్వక హామీ కోరగా, నెలాఖరుకు రూ. 3 వేల కోట్లు ఇస్తామంటూ మంత్రుల కమిటీ దాటవేసింది. దీంతో ఉద్యమ కార్యాచరణ ఆగేదేలేదని బొప్పరాజు తేల్చి చెప్పారు. ప్రభుత్వం మాత్రం నెలాఖరుకు చేస్తాం... ఏప్రిల్‌లో చేస్తాం... అంటూ మాటల హామీలతోనే సరిపెట్టింది. దీంతో ఇతిమిత్థంగా ఏమీ తేలకుండానే సమావేశం ముగిసిపోయింది.

Updated Date - 2023-03-08T15:59:06+05:30 IST