Bopparaju: ఉద్యోగుల సమస్యలను సీఎం జగన్ పరిష్కరించారు.. అందుకే..!

ABN , First Publish Date - 2023-06-13T16:16:25+05:30 IST

ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని సీఎంకు చెప్పాం. 47అంశాలపై సీఎస్‌కు లేఖ ఇస్తే 36 అంశాల పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. అన్ని అంశాలను కేబినెట్‌లోకి తీసుకు వచ్చి పరిష్కరించినందుకు సీఎంకు ధన్యవాదాలు తెలిపాం

Bopparaju: ఉద్యోగుల సమస్యలను సీఎం జగన్ పరిష్కరించారు.. అందుకే..!
Bopparaju

తాడేపల్లి: సీఎం వైఎస్ జగన్‌ను ఏపీజేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు (Bopparaju Venkateswarlu), నేతలు కలిశారు. అనంతరం బొప్పరాజు మీడియాతో మాట్లాడారు. ‘‘కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించినందుకు సీఎంకు ధన్యవాదాలు తెలిపాం. ఉద్యోగుల ఆర్థిక, ఆర్థికేతర సమస్యలు పరిష్కరించనందుకే ఉద్యమం చేశాం. తాము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని సీఎంకు చెప్పాం. 47అంశాలపై సీఎస్‌కు లేఖ ఇస్తే 36 అంశాల పరిష్కారానికి చర్యలు తీసుకున్నారు. అన్ని అంశాలను కేబినెట్‌లోకి తీసుకు వచ్చి పరిష్కరించినందుకు సీఎంకు ధన్యవాదాలు తెలిపాం.’’ అని వెల్లడించారు.

‘‘సోషల్ మీడియాలో ఉద్యోగ సంఘాలపై పలువురు మాకు వ్యతిరేకంగా పలు రకాల చర్చ నడుపుతున్నారు. రాజకీయ పార్టీలు ప్రభుత్వానికి ఉద్యోగులను దూరం చేసేందుకే ఈ చర్చ నడుపుతున్నారు. 1-7-2018, 1-1-2019 డీఏలు 734 కోట్లు బకాయిలు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది. సరెండర్ లీవ్‌లు, రెండు డీఏలు కలిపి రూ.1800 కోట్లు బకాయిలను సెప్టెంబర్‌లోపు చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. రిటైర్మెంట్ తర్వాత ఇస్తామన్న డీఏలు, పీఆర్సీ ఏరియర్లను ఏటా నాలుగు వాయిదాల్లో నాలుగేళ్లలో చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ప్రభుత్వ ప్రతిపాదనపై సమావేశంలో అందరూ అంగీకరించి బయటకు వచ్చాక వ్యతిరేకంగా ట్రోల్ చేస్తున్నారు. 2014 జూన్2 ముందు నుంచి పనిచేస్తోన్న కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసుల క్రమబద్దీకరణ చేస్తామన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణపై తప్పుడు సమాచారాలను బయటకు పంపుతున్నారు. వైద్య విధాన పరిషత్‌లో కాంట్రాక్టు సిబ్బందిని 010 కింద వేతనాలు ఇచ్చి క్రమబద్దీకరించడాన్ని సీఎంకు (CM JAGAN) ధన్యవాదాలు తెలిపాం. 12వ పీఆర్సీ కమిటీ వేసి చర్చలు జరుపుతామని సీఎం చెప్పారు. జీపీఎస్ విధానంలో పాత పించన్ విధానానికి సమానంగా 50 శాతం పింఛన్ ఇస్తామని, డీఆర్‌ను ఇస్తామన్నారు. పాత పింఛన్ విధానానికి దగ్గరగా జీపీఎస్ వచ్చినందున సంతోషంగా ఉన్నాం. జీపీఎస్ అనేది 80 శాతం వరకు పాత పింఛన్ విధానానికి దగ్గరగా ఉంది. జీపీఎస్ విధానంలో పీఆర్సీ ఏరియర్స్ ఒకటి వస్తే సరిపోతుంది. చట్టంలో పొందుపరచాలని కోరాం. ప్రభుత్వం వాడుకున్న.. ఉద్యోగులు దాచుకున్న జీపీఎఫ్ డబ్బును తిరిగి ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. ఆప్కాస్ కింద పని చేసే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంక్షేమ పథకాలు వర్తింప జేయాలని కోరగా సీఎం సానుకూలంగా స్పందించారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే బాధ్యతను ఏపీజేఏసీ అమరావతి తీసుకుంటుంది.’’ అని హామీ ఇచ్చారు.

Updated Date - 2023-06-13T16:16:25+05:30 IST