Chandrababu : చంద్రబాబు అంటే ఓ బ్రాండ్
ABN , First Publish Date - 2023-10-30T02:38:56+05:30 IST
చంద్రబాబు నాయుడు అంటే ఒక బ్రాండ్ అని.. తెలుగుజాతి ఉన్నంత వరకూ ముఖ్యమంత్రిగా ఆయన చేసిన అభివృద్ధిని ప్రపంచంలోని తెలుగువారు మరిచిపోలేరని సీబీఎన్ అభిమానులు భావోద్వేగానికి గురయ్యారు.

విజనరీ లీడర్‌గా ప్రపంచవ్యాప్త గుర్తింపు
ఆయన చేసిన అభివృద్ధిని తెలుగుజాతి మరవదు
‘సీబీఎన్స్ గ్రాటిట్యూడ్’ కాన్సర్ట్‌కు భారీగా వచ్చిన
అభిమానులు, కార్యకర్తల భావోద్వేగ వ్యాఖ్యలు
సీబీఎన్ నినాదాలతో నాలుగు గంటలపాటు
మార్మోగిన గచ్చిబౌలి స్టేడియం పరిసరాలు
హైదరాబాద్ సిటీ/ గచ్చిబౌలి/రాయదుర్గం, అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి): చంద్రబాబు నాయుడు అంటే ఒక బ్రాండ్ అని.. తెలుగుజాతి ఉన్నంత వరకూ ముఖ్యమంత్రిగా ఆయన చేసిన అభివృద్ధిని ప్రపంచంలోని తెలుగువారు మరిచిపోలేరని సీబీఎన్ అభిమానులు భావోద్వేగానికి గురయ్యారు. ఐఎ్‌సబీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటివాటికి పునాదులు వేసిన చంద్రబాబును దార్శనికుడైన నాయకుడిగా ప్రపంచం ఎప్పుడో గుర్తించిందని పేర్కొన్నారు. హైటెక్ సిటీ అనగానే తెలుగువారందరికీ గుర్తొచ్చే ‘సైబర్‌టవర్స్’ నిర్మాణం జరిగి 25 ఏళ్లవుతున్న (రజతోత్సవం) సందర్భంగా ఆదివారం గచ్చిబౌలి స్టేడియంలో ‘తెలుగు ప్రొఫెషనల్స్ వింగ్’ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సీబీఎన్స్ గ్రాటిట్యూడ్ కాన్సర్ట్’కు అన్ని వర్గాల నుంచీ అనూహ్య స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు.. సీబీఎన్ అభిమానులు, ఐటీ ఉద్యోగులు, గ్రేటర్‌లోని పలుప్రాంతాల నుంచి యువత భారీ సంఖ్యలో తరలిరావడంతో స్టేడియం కిక్కిరిసిపోయింది. సుమారు 4 గంటలపాటు స్టేడియం పరిసరాలు సీబీఎన్ నినాదాలతో మారుమోగాయి. మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్ రాక్‌బ్యాండ్ నిర్వహించిన పాటల ప్రదర్శన పత్యేక ఆకర్షణగా నిలిచింది. మహిళలు, ఐటీ ఉద్యోగులు, సీనియర్ సిటీజన్స్, యువకులు.. సీబీఎన్ వెంట తాముంటామంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. తెలుగుదేశం వ్యవస్థాపకుడు, తెలుగువాడి ఆత్మగౌరవ పతాకను ప్రపంచవ్యాప్తంగా రెపరెపలాడించిన ఎన్టీఆర్ కుటుంబసభ్యులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అలాగే.. వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు, ప్రముఖ జర్నలిస్ట్ కందుల రమేశ్, టీడీపీ నేత మహాసేన రాజేశ్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తెలుగు ప్రొఫెషనల్స్ వింగ్ ప్రతినిధులు ఫణిశ్రీ, చల సాని సుధీర్, కంకణంపాటి సుధాకర్, సుమన్, సుధీర్ దొడ్డ, బండి రాజా, చదలవాడ కిరణ్, పాతూరి సుమిత తదితరుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 1200మంది వాలంటీర్లు సేవలందించారు.
వీడియో ప్రదర్శన..
చంద్రబాబు 25 ఏళ్లక్రితం ముందుచూపుతో ఏర్పా టు చేసిన సైబర్ టవర్స్ నేడు ఐటీరంగ అభివృద్ధికి ఐకాన్‌గా మారిందని.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఐటీ నిపుణులు అన్నారు. ఐటీ రంగం అభివృద్ధికి, తెలుగు రాష్ట్రాల్లో విద్యా వనరులు, ఉద్యోగావకాశాలు కల్పించేందుకు సీఎంగా చంద్రబాబు చేపట్టిన కార్యక్రమాలు, తీసుకున్న నిర్ణయాలు, ఆయన సాధించిన విజయాలను వీడియోల రూపంలో ప్రదర్శించారు.
ఎనభై దేశాల్లో..
చంద్రబాబు ప్రతిష్ఠను దిగజార్చాలనే ఉద్దేశంతోనే ఆయన్ను కారాగారంలో పెట్టారని.. అయినా ఆయన కీర్తి విశ్వవ్యాప్తమైందని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు అన్నారు. ప్రపంచంలోని 80 దేశాల్లో చంద్రబాబుకు మద్దతుగా అభిమానులు ప్రదర్శనలు చేస్తున్నారని ఆయన గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో న్యాయానికి అన్యాయం జరిగిందని.. సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘7వ తేదీలోపు బాబు బయటకు వస్తారు. రాబోయేరోజుల్లో కట్టించేవాణ్ని తెచ్చుకుందాం.. కూల్చేవాణ్ని కూల్చేద్దాం’’ అని ఏపీ ప్రజలను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబును అక్రమంగా, అన్యాయంగా జైల్లో పెట్టారని ప్రముఖ సినీ నటుడు మురళీమోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ఆయన రేపోమాపో కడిగిన ముత్యంలా బయటకు వస్తారు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యుణ్ని ఆపలేరు. ఐటీ ఉద్యోగులందరూ ఇలాంటి కార్యక్రమాలు చేయడం అభినందనీయం’’ అని మురళీ మోహన్ ప్రశంసించారు. ఇక.. టీడీపీ అధినేత అక్రమ అరె్‌స్టపై మాట్లాడే అవకాశం ఆంధ్రప్రదేశ్‌లో లేకుండా పోయిందని ఆ పార్టీ నేత రాజేష్ మహాసేన అన్నారు. ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను.. కార్యక్రమాన్ని నిర్వహించిన ఐటీఉద్యోగులకు అభినందనల తెలిపారు.
అరికెపూడి గాంధీకి నిరసన సెగ
ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు గచ్చిబౌలి స్టేడియానికి వచ్చిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి అభిమానుల సెగ తగిలింది. కొంతమంది ‘గోబ్యాక్’ అంటూ నినాదాలు చేశారు. ‘‘చంద్రబాబు వల్ల ఎమ్మెల్యే అయిన గాంధీ.. ఆయన అరెస్టుపై స్పందించకపోవడం, ఈ విషయంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వ తీరును నిరసించకపోవడం దారుణం’’ అంటూ మండిపడ్డారు.
కడుపు మండిపోతోంది..
చంద్రబాబు అంటేనే ఓ బ్రాండ్ అని ఈ కార్యక్రమంలో పాల్గొన్న సినీ నిర్మాత బండ్ల గణేష్ అన్నారు. అలాంటి వ్యక్తి రాజమండ్రి జైల్లో ఉన్నారంటే కడుపు మండిపోతోందంటూ కంట తడిపెట్టారు. బిల్‌గేట్స్‌ను, పలు అంతర్జాతీయ సంస్థలను హైదరాబాద్‌కు తీసుకురావడంలో బాబుదే కీలకపాత్ర అని ప్రముఖ జర్నలిస్ట్ మూర్తి అన్నారు. చంద్రబాబుకు మద్దతుగా గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన కాన్సర్ట్‌కు లక్షలాదిమంది తరలిరావడంపై దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కూడా ట్విటర్ ద్వారా స్పందించారు. ‘‘హైటెక్ సిటీ సృష్టికర్తా.. ఈ విశ్వనగరాన్ని నిర్మించిన మీ కోసం లక్షలాదిమంది తరలిరావడాన్ని చూస్తుంటే చాలా ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నాను’’ అని పేర్కొన్నారు.