Vasireddy Padma: లేని పదవితో హల్‌చల్‌

ABN , First Publish Date - 2023-07-19T02:48:25+05:30 IST

రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ ఎవరు? ‘ఇంకెవరూ... వాసిరెడ్డి పద్మే కదా! మొన్నటికి మొన్న పవన్‌ కల్యాణ్‌కు నోటీసులు కూడా పంపించారు కదా!’ అనేదే మీ సమాధానమా? అయితే మీరు తప్పులో కాలేసినట్లే! మహిళా కమిషన్‌ అధ్యక్షురాలిగా ఆమె పదవీ కాలం ఎప్పుడో ముగిసిపోయింది.

 Vasireddy Padma: లేని పదవితో   హల్‌చల్‌

ఎప్పుడో ముగిసిన

వాసిరెడ్డి పద్మ పదవీకాలం

ఐదేళ్ల నుంచి రెండేళ్లకు కుదింపు

మే 15 నుంచే ఆమె మాజీ

అయినా సరే.. అదే హడావుడి

(అమరావతి - ఆంధ్రజ్యోతి): రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ ఎవరు? ‘ఇంకెవరూ... వాసిరెడ్డి పద్మే కదా! మొన్నటికి మొన్న పవన్‌ కల్యాణ్‌కు నోటీసులు కూడా పంపించారు కదా!’ అనేదే మీ సమాధానమా? అయితే మీరు తప్పులో కాలేసినట్లే! మహిళా కమిషన్‌ అధ్యక్షురాలిగా ఆమె పదవీ కాలం ఎప్పుడో ముగిసిపోయింది. కానీ... జగన్‌ సర్కారు అన్ని జీవోల్లాగే, దీనికి సంబంధించిన జీవోనూ దాచేసింది. దీంతో... వాసిరెడ్డి పద్మ ‘మాజీ’ అయినప్పటికీ అదే హల్‌చల్‌ సృష్టిస్తున్నారు. సమీక్షలు, రౌండ్‌ టేబుల్‌ కాన్ఫరెన్స్‌లు, నోటీసులు అంటూ హడావుడి చేస్తున్నారు. వాసిరెడ్డి పద్మ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా నియమితులైనప్పుడు... పదవీ కాలం ఐదేళ్లు. ఆమె 2019 ఆగస్టులో మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ అయ్యారు. లెక్కప్రకారం 2024 వరకు ఆమె ఈ పదవిలోనే ఉండాలి. కానీ... జగన్‌ సర్కారు ఈ చట్టాన్ని సవరించింది. మహిళా కమిషన్‌ అధ్యక్షురాలి పదవీకాలాన్ని రెండేళ్లకు కుదిస్తూ ఈ ఏడాది ఏప్రిల్‌ 24 తేదీన గెజిట్‌ను ప్రచురించింది. దీని ప్రకారం రాష్ట్ర మహిళా శిశు సంక్షేమశాఖ ఆంధ్రప్రదేశ్‌ మహిళా కమిషన్‌(ఎమెండ్‌మెంట్‌) యాక్ట్‌ 2023 (యాక్ట్‌ నంబర్‌ -9 ఆఫ్‌ 2023) మే 2023 నుంచి అమల్లోకి వచ్చినట్లుగా జీవోఎంఎస్‌ నంబర్‌ 23 జారీ చేసింది.

ఈ ఏడాది మే 9వ తేదీన ఈ జీవో విడుదలైంది. మే 15వ తేదీ నుంచి కొత్త చట్టం అమలులోకి వస్తుందని తెలిపింది. అంటే.. ఆ రోజుతో వాసిరెడ్డి పద్మ పదవీకాలం ముగిసినట్లే. ‘మాజీ’ అయినట్లే. అయితే... జీవోలను గోప్యంగా ఉంచుతున్న జగన్‌ సర్కారు, మహిళా కమిషన్‌కు సంబంధించిన జీవోనూ బయటపెట్టలేదు. అంతా గప్‌చుప్‌! దీంతో... వాసిరెడ్డి పద్మ పదవీకాలం ముగిసిందనే విషయం ఎవ్వరికీ తెలియదు. ఉత్తర్వులు ఇచ్చిన మహిళా శిశు సంక్షేమ శాఖ కూడా పట్టించుకోలేదు. ‘తెలిసో... తెలియకో’ వాసిరెడ్డి పద్మ అదే అధికారిక హోదాలో హల్‌చల్‌ చేస్తూనే ఉన్నారు. నోటీసులు ఇవ్వడం, విలేకరుల సమావేశాలు నిర్వహించడం, సమావేశాల్లో పాల్గొనడం, సీఎం కుటుంబ సభ్యులనే విమర్శిస్తారా అంటూ మండిపడడం వంటివి ఎప్పట్లాగే చేస్తున్నారు. పోయిన పదవితో ఇవన్నీ ఎలా చేశారు? ఎవరికీ తెలియదని చేశారా? లేక ప్రభుత్వం ఆమె పదవీ కాలాన్ని మరో రెండేళ్లు పొడిగించిందా? అదే జరిగితే... దానికి సంబంధించిన ఆదేశాలు ఎక్కడ ఉన్నాయి? ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాల్లేవ్‌!

Updated Date - 2023-07-19T04:06:31+05:30 IST