స్టేడియాలలో ఫీజుల పేరుతో దోచుకోవడం తగదు

ABN , First Publish Date - 2023-03-09T00:38:57+05:30 IST

ప్రభుత్వం క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహించాలే తప్ప స్టేడియాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించి ఫీజుల పేరుతో దోపిడీకి తెరలేపకూడదని గణేష్‌యూత్‌ కన్వీనర్‌ వీరవల్లి మురళి విమర్శించారు.

స్టేడియాలలో ఫీజుల పేరుతో దోచుకోవడం తగదు

స్టేడియం అధికారికి వినతిపత్రం అందిస్తున్న వీరవల్లి మురళి తదితరులు

తెనాలి రూరల్‌, మార్చి 8 : ప్రభుత్వం క్రీడలను, క్రీడాకారులను ప్రోత్సహించాలే తప్ప స్టేడియాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించి ఫీజుల పేరుతో దోపిడీకి తెరలేపకూడదని గణేష్‌యూత్‌ కన్వీనర్‌ వీరవల్లి మురళి విమర్శించారు. పట్టణంలోని ఇండోర్‌ స్టేడియంలో పెంచిన క్రీడారుసుం ఛార్జీలను తగ్గించాలని కోరుతూ క్రీడాకారులతో కలిసి స్టేడియం అధికారులకు బుధవారం వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ తెనాలి ఇండోర్‌ స్టేడియంలో గతంలో స్టేడియం మెయింటినెన్స్‌కి కొద్దిపాటి రుసుం వసూలు చేసేవారని ఇప్పుడు దానిని ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పగించడంతో వారు నియంత్రణలేని విధంగా రుసుం పెంచి క్రీడాకారులకు క్రీడలు దూరమయ్యేపరిస్థితికి దిగజారుస్తున్నారని ఆరోపించారు. క్రీడలు ఆడటం మంచిదని ఉపన్యాసాలు ఇచ్చే ప్రభుత్వానికి అందుకు అనుగుణంగా క్రీడాప్రాంగణాలను తీర్చిదిద్ధడంలో చిత్తశుద్ధికనబరచడంలేదని మండిపడ్డారు. గతంలో ఉన్న ధరలకు, కాంట్రాక్ట్‌ పరిధిలోకి వచ్చిన ధరలకు పొంతన కుదరడం లేదని, రాష్ట్రంలోని యువత మంచి క్రీడాకారులగా తీర్చిదిద్దేలా ప్రోత్సహిస్తున్నామని ప్రభుత్వం చెబుతూనే క్రీడాప్రాంగణాలను కాంట్రాక్టర్ల పరం చేసి ముక్కుపిండి రుసుం వసూలు చేస్తుందన్నారు. దీనివల్ల పేదరికంలో ఉన్న కుటుంబాల పిల్లలు క్రీడలపై మక్కువ ఉన్నా వారికి ఆర్థిక భారంతో క్రీడల్లో ప్రతిభ కనబరిచే అవకాశం లేకుండా పోనున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం పెద్దరికంగా ఆలోచించి ప్రైవేట్‌ వ్యక్తులకు అప్పగించిన స్టేడియాన్ని ప్రభుత్వమే కొనసాగించి పేద పిల్లలను సైతం మంచి క్రీడాకారులుగా తీర్చిదిద్దేలా ముందుకు రావాలని వీరవల్లి మురళి విజ్ఞప్తి చేశారు. పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు.

Updated Date - 2023-03-09T00:38:57+05:30 IST