Fish Andhra Fail: ఫిష్‌ ఆంధ్రా తుస్‌

ABN , First Publish Date - 2023-04-12T02:14:59+05:30 IST

ఫిష్‌ ఆంధ్రా అవుట్‌ లెట్లు ప్రారంభిస్తున్నట్టు అధికారులు చాలా జిల్లాల్లో హడావుడి చేస్తున్నా ఆచరణకు నోచుకోవడం లేదు. కొన్ని జిల్లాల్లో కనీసం ఒకటి కూడా నడవడం లేదు.

Fish Andhra Fail: ఫిష్‌ ఆంధ్రా తుస్‌

ఆరంభ శూరత్వంగా మిగిలిన ప్రాజెక్ట్‌

70 ఆక్వా హబ్‌లు, 14 వేల రిటైల్‌

షాపులు ప్రారంభిస్తున్నట్టు జగన్‌ ప్రకటన

15 నెలలైనా లక్ష్యానికి ఆమడ దూరం

ప్రస్తుతం 19 హబ్‌లు, 300 యూనిట్లే

చాలా చోట్ల రాయితీలు, రుణాలు లేవు

పరికరాలు, చేపల సరఫరా లేదు

పరిమితంగా దుకాణాలు ప్రారంభం

నష్టాలతో నిర్వాహకులు సతమతం

అవి కూడా మూతపడుతున్న వైనం

కొన్నిచోట్ల వాటిలో ఇతర వ్యాపారాలు

చేపలు, రొయ్యల ఉత్పత్తి రైతులకు గిట్టుబాటు ధర అందించడమే ప్రధాన లక్ష్యం. ఇందులో భాగంగా రాష్ట్రంలో 70 ఆక్వా హబ్‌లు, 14 వేల చేపలు, రొయ్యల విక్రయ రిటైల్‌ షాపులు ప్రారంభిస్తున్నాం’..సొంతగడ్డ పులివెందులలో 2021 డిసెంబరు 24న ఆర్భాటంగా సీఎం జగన్‌ చేసిన ప్రకటన ఇది.

జగన్‌ ప్రకటన చేసి 15 నెలలు గడిచిపోయింది. ప్రస్తుతం 19 హబ్‌ల పరిధిలో సుమారు 300 రిటైల్‌ అవుట్‌ లెట్లు మాత్రమే ఏర్పాటయ్యాయి. అందులో కూడా సగానికి పైగా సక్రమంగా సాగటం లేదని చెబుతున్నారు. లబ్ధిదారులకు రాయితీలు, రుణాలు, పరికరాలు ఇవ్వకపోవడంతో ప్రభుత్వ లక్ష్యం ఆమడ దూరంలో నిలిచిపోయింది.

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌): ఫిష్‌ ఆంధ్రా అవుట్‌ లెట్లు ప్రారంభిస్తున్నట్టు అధికారులు చాలా జిల్లాల్లో హడావుడి చేస్తున్నా ఆచరణకు నోచుకోవడం లేదు. కొన్ని జిల్లాల్లో కనీసం ఒకటి కూడా నడవడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించిన అవుట్‌ లెట్లు కూడా కొన్ని నెలలకే చాలా మూతపడ్డాయి. మరికొన్ని ఇంకా ప్రారంభానికే నోచుకోలేదు. కొన్నిచోట్ల బోర్డులు తీసేసి ఫిష్‌ ఆంధ్రా అవుట్‌ లెట్ల స్థానంలో ఇతర వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. సీఎం జగన్‌ ఘనంగా చెప్పిన ఫిష్‌ ఆంధ్రా పరిస్థితి ఇది. ఇది ఆరంభ శూరత్వంగా మిగిలిపోవడానికి ఎన్నో కారణాలున్నాయి. మత్స్యశాఖ పర్యవేక్షణలో హబ్‌లు ఏర్పాటు చేయించి, అవుట్‌ లెట్లకు చేపలు, ఇతర ఉత్పత్తులు సరఫరా చేయడం దీని ఉద్దేశం. అంతేగాక అవుట్‌ లెట్ల ఏర్పాటుకు అవసరమైన రాయితీలు, రుణాలు ఇపిస్తామని చెప్పారు. షాపుల నిర్వహణకు అవసరమైన పరికరాలు సరఫరా చేస్తామని చెప్పారు. అయితే లక్ష్యానికి తగినట్టుగా లబ్ధిదారులకు రాయితీలు, రుణాలు ఇవ్వలేదు. చాలా చోట్ల పరికరాలూ సరఫరా చేయలేదు. దీంతో వారు సొంతంగా అవుట్‌ లెట్లు ఏర్పాటు చేసుకోలేని పరిస్థితి. దీంతో అవుట్‌ లెట్ల ఏర్పాటు చాలా వరకు ప్రారంభ దశలోనే ఆగిపోయింది. ప్రారంభించిన షాపులకు కూడా చాలా చోట్ల చేపలు సరఫరా చేయడం లేదు. బయట మార్కెట్లో కొనుగోలు చేసి తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. నిర్వాహకులకు లాభాలు రాకపోవడంతో ఉన్న వాటిని కూడా మూసేస్తున్నారు.

లాభం కన్నా నష్టమే ఎక్కువ

ఫిష్‌ ఆంధ్రా పేరుతో కొన్ని వర్గాల నిరుద్యోగులతో అవుట్‌ లెట్లు ఏర్పాటు చేయించి చేపలు, రొయ్యల వ్యాపారం చేయించాలని జగన్‌ సర్కార్‌ 2021 చివర్లో తలపెట్టింది. అయితే లక్ష్యంలో కనీసం కూడా ఆచరణలోకి రాలేదు. అవుట్‌ లెట్లు ప్రారంభించిన వారు కూడా నిర్వహణ భారమై, లాభాలు లేక కొందరు ఫిష్‌ మార్ట్‌లను ఎత్తేశారు. మరికొన్ని మూతపడే స్థితిలో ఉన్నాయి. లైవ్‌ ఫిష్‌ వ్యాపారం కోసం ఫిష్‌ ఆంధ్రా స్టాల్స్‌ను ఏర్పాటు చేయించిన ప్రభుత్వం.. మత్స్యశాఖ నిర్ణయించిన ధరలకే చేపలు, రొయ్యలు అమ్మాలని చెప్పింది. ఆక్వా హబ్‌ నుంచి కిలో చేపలు రూ.130కు తెచ్చి, రిటైల్‌ అవుట్‌ లెట్లలో కిలో రూ.160 చొప్పున అమ్మాలని చెప్పారంటున్నారు. దీనిపై వచ్చే లాభంలోనే రవాణా ఖర్చులను నిర్వాహకులు భరించాల్సి ఉంటుంది. ఏ రోజు సరుకు ఆరోజు అమ్ముడుపోకపోతే వాటిని కూలింగ్‌లో ఉంచాలి. లేకపోతే వాసన వచ్చి పాడైపోయే ప్రమాదం ఉంటుంది. విద్యుత్‌ చార్జీలు పెంచడంతో యూనిట్‌ రూ.8 దాకా ఉండటంతో నెలకు రూ.ఐదారు వేల బిల్లు వస్తోంది. అంత బిల్లులు చెల్లించడం భారంగా ఉంటోందని గోదావరి ప్రాంతవ్యాపారులు వాపోతున్నారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం పులివెందులలోని ఒక రిటైల్‌ అవుట్‌లెట్‌కు కరెంటు బిల్లు బకాయి పడటంతో గతేడాది మూతేసిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు అమ్మితే లాభం లేక, నిర్వహణ ఖర్చులు రాక, దుకాణాల అద్దెలు కట్టలేక.. అవుట్‌లెట్‌ నిర్వాహకులు సతమతమౌతున్నారు. ఈ పరిస్థితుల్లో రిటైల్‌ అవుట్‌ లెట్ల ఏర్పాటు కోసం మత్స్యశాఖ ఆన్‌లైన్‌-ఆ్‌ఫలైన్‌లో దరఖాస్తులను ఆహ్వానించినా తగిన స్పందనం రావడం లేదు. రిటైల్‌ అవుట్‌ లెట్ల సంఖ్యను 14 వేలకు బదులు 7 వేలకు తగ్గించాలని నిర్ణయించిందని సమాచారం.

1fish2.jpg

అవుట్‌ లెట్లతో పాటు రెస్టారెంట్లూ

ఫిష్‌ ఆంధ్రా బ్రాండ్‌తో చేపలు, రొయ్యల రిటైల్‌ అవుట్‌లెట్లతో పాటు వాటి వంటకాలతో రెస్టారెంట్లు కూడా పెట్టుకోవాలని జగన్‌ సర్కారు సూచించింది. నిరుద్యోగ యువత, డ్వాక్రా మహిళలకు వీటి బాధ్యతలు అప్పగించింది. రూ.లక్ష నుంచి రూ.50 లక్షల పెట్టుబడితో దుకాణాలు పెట్టుకోవచ్చని చెప్పింది. యూనిట్‌ విలువలో లబ్ధిదారుల వాటా 10-15ు, రాయితీ 40-60ు, మిగతాది బ్యాంక్‌ రుణంగా ఇస్తుందని అధికారులు చెబుతున్నారు. విజయవాడ నగరంలో ఆరు అవుట్‌లెట్లను మంజూరు చేశారు. వీటిలో రాఘవయ్య పార్కులోనిది మాత్రమే ప్రారంభమైంది. ఈ అవుట్‌లెట్‌ కూడా వినియోగదారులు లేక వెలవెలబోతోంది. మెనూలో మూడు రకాల ఫిష్‌ ఐటమ్సే కనిపిస్తున్నాయి. మెనూలో ఎక్కువగా చికెన్‌, ఐస్‌క్రీమ్‌, టీ, కాఫీ తదితరాలు ఉన్నాయి.

టిఫిన్‌, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు

ఉత్తరాంధ్రలో ఫిష్‌ ఆంధ్రా యూనిట్లు చాలా పరిమిత సంఖ్యలో ఉన్నాయి. విజయనగరం జిల్లాకు 110 యూనిట్లు మంజూరు కాగా 65 యూనిట్లు ప్రారంభించారు. ప్రభుత్వం నుంచి నిధులతో పాటు చేపలు సరఫరా కావడంలేదు. దీంతో అనేక చోట్ల బోర్డులకే పరిమితమయ్యాయి. గజపతినగరం మండలం కొనిశ గ్రామంలో ఫిష్‌ ఆంధ్ర యూనిట్‌ నిర్వాహకుడు చేపల విక్రయాలకు బదులు టిఫిన్‌ సెంటర్‌ నడుపుతున్నాడు. ఇక శ్రీకాకుళం జిల్లా టెక్కలి ఎన్టీఆర్‌ కాలనీలోని దుకాణం కూడా ఫాస్ట్‌ ఫుడ్‌ విక్రయాలకే పరిమితమైంది. సింహద్వారం వద్ద ఎప్పటి నుంచో చేపలను విక్రయిస్తున్న దుకాణాన్నే ఫిష్‌ ఆంధ్రగా మార్పు చేశారు. జిల్లాలో ఇవిగాక మరో మూడు యూనిట్లు ఉన్నాయి. ఇక విశాఖపట్నం జిల్లాలో ప్రస్తుతం మూడే షాపులు నడుస్తున్నాయి. అవి కూడా ఎప్పుడు ఉంటాయో, ఎప్పుడు మూసేస్తారో తెలియదు.

1fish7.jpg

జగన్‌ సొంతూరిలోనే ఫెయిల్‌

2021 డిసెంబరు 24న ముఖ్యమంత్రి జగన్‌ రాష్ట్రంలో మొదటిసారిగా సొంత నియోజకవర్గం పులివెందులలో ఫిష్‌ ఆంధ్రాను ప్రారంభించారు. రాష్ట్రమంతా ప్రజలకు సీ ఫుడ్‌ అందుబాటులోకి తెస్తున్నామంటూ గొప్పలు చెప్పారు. దాదాపు కోటి రూపాయల వ్యయంతో ముఖ్యమంత్రి ప్రారంభించిన ఫిష్‌ ఆంధ్రా నెలరోజులకే మూతపడింది. ఈ విషయాన్ని గతంలోనే ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించింది. సీఎం సొంత ఊరిలో మూతపడితే పరువుపోతుందని కొందరు స్థానిక నాయకులు మొక్కుబడిగా నడుపుతున్నారు. స్టాక్‌పాయింట్‌తో పాటు మరో నాలుగు మినీ అవుట్‌ లెట్లు ఉన్నాయి. ప్రస్తుతం స్టాక్‌పాయింట్‌ ఒక్కటే నడుస్తోంది. స్టాక్‌పాయింట్‌లో స్థానికంగా లభించే చేపలు మాత్రమే విక్రయిస్తున్నారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం అనే కారణంతోనే ఇది నడుస్తోంది. స్టాక్‌పాయింట్‌ కొంతకాలం మూతపడడంతో అక్కడ ఏర్పాటుచేసిన యంత్రాలు పాడైనట్లు సమాచారం.

సీమలో ఆరంభ శూరత్వమే

శ్రీసత్యసాయి జిల్లాలో 20 ఫిష్‌ ఆంధ్రా దుకాణాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినా ఇంకా తెరుచుకోలేదు. ఫ్రిజ్‌, కటింగ్‌ మిషన్లు తదితర పరికరాలు అందలేదు. అనంతపురం జిల్లాలో రెండేళ్ల క్రితం 16 దుకాణాలను ప్రారంభించగా... ప్రస్తుతం నాలుగే షాపులు ఉన్నాయి. తిరుపతి జిల్లాలో షాపుల సంఖ్య పాతిక కూడా దాటలేదు. అందులోనూ చేపలు సరఫరా కాక ఐదు యూనిట్లు మూతపడ్డాయి. పుత్తూరులో గతేడాది మార్చిలో మంత్రి రోజా ప్రారంభించిన ఫిష్‌ ఆంధ్రా అవుట్‌ లెట్‌ మూడు నెలలకే మూత పడింది.

కోస్తాంధ్రాలోనూ అంతంతే

నెల్లూరు జిల్లాలో 305 యూనిట్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. తొలివిడతలో 51 సెంటర్లలో సిద్ధమయ్యాయి. ఇప్పటి వరకు ఒక్కదానిలో కూడా అమ్మకాలు మొదలు కాలేదు.

పల్నాడు జిల్లాలో 80 షాపులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటికి ఒక్క షాపు మాత్రమే ఏర్పాటైంది. దీనికి చేపలు, రొయ్యలు సరఫరా కావడం లేదు.

బాపట్ల జిల్లాలో 276 దుకాణాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్దేశించుకోగా.. ప్రస్తుతం చీరాల పరిధిలో 6, బాపట్లలో 2 షాపులు నడుస్తున్నట్టు అధికారులు చెబుతున్నా వాటి షట్టర్లు తీసిన దాఖలాల్లేవు.

కాకినాడ జిల్లాలో సుమారు 76 కిలోమీటర్ల మేర సముద్ర తీరప్రాంతముంది. ఏటా 2.50 లక్షల టన్నుల చేపలు ఉత్పత్తి అవుతున్నాయి. జిల్లాలో 412 గ్రామాల పరిధిలో దుకాణాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినా ఆచరణకు నోచుకోలేదు. చాలా పరిమిత సంఖ్యలో ఏర్పాటు చేశారు.

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో 245 దుకాణాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా.. ఏర్పాటు చేసిన వంద యూనిట్లలో చాలా వరకు మూతపడే పరిస్థితి వచ్చింది. పి.గన్నవరం మండలం ఊడిమూడిలో కొన్ని రోజుల్లోనే షాపు మూతపడింది. ఆ షాపు యజమాని మరొకరికి అద్దెకు ఇవ్వడంతో అక్కడ రివైండింగ్‌ వర్క్‌ షాపు నిర్వహిస్తున్నారు.

Updated Date - 2023-04-12T02:15:01+05:30 IST