హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ గంగారావు పదవీ విరమణ

ABN , First Publish Date - 2023-04-05T03:14:06+05:30 IST

న్యాయమూర్తి జస్టిస్‌ ఎం. గంగారావు పదవీ విరమణ సందర్భంగా హైకోర్టు ఘనంగా వీడ్కోలు పలికింది.

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ గంగారావు పదవీ విరమణ

న్యాయ సేవలను కొనియాడిన సీజే

అమరావతి, ఏప్రిల్‌ 4(ఆంధ్రజ్యోతి): న్యాయమూర్తి జస్టిస్‌ ఎం. గంగారావు పదవీ విరమణ సందర్భంగా హైకోర్టు ఘనంగా వీడ్కోలు పలికింది. వరుసగా కోర్టుకు సెలవులు రావడం, ఆయన పదవీకాలం ఈ నెల 7తో ముగియనుండడంతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా నేతృత్వం లో మొదటి హాలులో మంగళవారం వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జస్టిస్‌ గంగారావు అందించిన న్యాయసేవలను ప్రధాన న్యాయమూర్తి కొనియాడారు. న్యాయమూర్తిగా ఆయన కొన్ని కీలక తీర్పులు ఇచ్చారని తెలిపారు. మొత్తం 8,100 కేసులను పరిష్కరించారని, ఆయన పదవీ విరమణతో న్యాయవ్యవస్థ ఓ మంచి జడ్జి సేవలను కోల్పోతోందని తెలిపారు. పదవీ విరమణ తరువాత జస్టిస్‌ గంగారా వు శేషజీవితం ఆయురారోగ్యాలతో ప్రశాంతంగా సాగాలని కోరుకుంటున్నానన్నారు. జస్టిస్‌ గంగారావు మాట్లాడుతూ.. వ్యక్తులు వస్తుంటారు, పోతుంటారు కానీ వ్యవస్థ శాశ్వతం అన్నారు. న్యాయవాద వృత్తిలోకి అడుగుపెట్టేవారు వ్యవస్థ గౌరవాన్ని పెంచే విధంగా పనిచేయాలని సూచించారు. ప్రజలకు సత్వర న్యాయం అందించేందుకు కృషి చేయాలని కోరారు. న్యాయవాది గా, న్యాయమూర్తిగా వృత్తి జీవితం సంతృప్తినిచ్చిందన్నారు. కెరీర్‌ ఉన్నతి కి సహకరించిన న్యాయమూర్తులు, న్యాయవాదులకు కృతజ్ఞతలు తెలిపారు. అడ్వకేట్‌ జనరల్‌(ఏజీ) ఎస్‌. శ్రీరామ్‌, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు జానకీరామిరెడ్డి, బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ గంటా రామారావు, డిప్యూటీ సొలిసిటర్‌ జనరల్‌ ఎన్‌. హరినాథ్‌, హైకోర్టు న్యాయమూర్తులు, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వై. నాగిరెడ్డి, రిజిస్ట్రార్‌లు, న్యాయవాదులు పాల్గొన్నారు. కాగా, జస్టిస్‌ గంగారావు దంపతులను ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సీజే పాల్గొన్నారు.

Updated Date - 2023-04-05T03:14:06+05:30 IST