దేశంలో మిగిలిన రాష్ట్రాలతో పోల్చితే ఏపీలో పరిస్థితి దారుణం

ABN , First Publish Date - 2023-01-21T02:24:44+05:30 IST

ఆహారపు అలవాట్లలో మార్పులు, నిద్రలేమి, అధిక ఒత్తిడి వంటి కారణాలతో 30 ఏళ్లకే బీపీ, షుగర్‌ వచ్చేస్తున్నాయి.

దేశంలో మిగిలిన రాష్ట్రాలతో పోల్చితే ఏపీలో పరిస్థితి దారుణం

రాష్ట్రంలో పెరిగిపోతున్న బాధితులు.. షుగర్‌ కేసులు కూడా

30 ఏళ్ల వయసుకే వాటి బారిన.. జాతీయ సగటు కంటే ఎక్కువ

దేశంలో 25% మందికి బీపీ.. రాష్ట్రంలో 36.49%

దేశంలో 27% మందికి షుగర్‌.. ఏపీలో 34.11%

రాష్ట్రంలో కోటిన్నర మందికి పరీక్షలు.. 55.41 లక్షల మందికి బీపీ

53.92 లక్షల మందికి షుగర్‌.. ఆరోగ్య శాఖ సర్వేలో వెలుగులోకి

అనధికారికంగా ఇంకా ఎక్కువే.. కోనసీమలో అత్యధిక బాధితులు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ఆహారపు అలవాట్లలో మార్పులు, నిద్రలేమి, అధిక ఒత్తిడి వంటి కారణాలతో 30 ఏళ్లకే బీపీ, షుగర్‌ వచ్చేస్తున్నాయి. దేశంలో మిగిలిన రాష్ట్రాలతో పోల్చితే మన రాష్ట్రంలో పరిస్థితి మరీ దారుణంగా మారింది. రాష్ట్రంలో బీపీ, షుగర్‌ బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. వయసుతో సంబంధం లేకుండా వాటి బారినపడుతున్నారు. ఎన్‌ఎ్‌ఫహెచ్‌ఎస్‌ సర్వే ప్రకారం ఇప్పటికే దీర్ఘకాలిక వ్యాధుల్లో ఏపీ టాప్‌లో ఉంది. అయితే ప్రజలను అప్రమత్తం చేసే కార్యక్రమాలపై ప్రభుత్వం దృష్టిసారించడం లేదు. దీంతో బాధితుల సంఖ్య రెట్టింపు అవుతోంది. ఎన్‌ఎ్‌ఫహెచ్‌ఎస్‌ సర్వే ప్రకారం దేశంలో సగటున 27శాతం మంది షుగర్‌, 25శాతం మంది బీపీ బారినపడుతున్నారు. రాష్ట్రంలో జాతీయ సగటు కంటే అధికంగా కేసులు నమోదు అవుతున్నాయి. అధికార లెక్కల ప్రకారమే 34.11 శాతం మంది షుగర్‌, 36.49 శాతం మంది బీపీ బారినపడినట్లు వెల్లడవుతోంది. ఇక షుగర్‌ ఉన్నవారు 50శాతం, బీపీ ఉన్న వారు 40నుంచి 45శాతం మధ్యలో ఉంటారని వైద్య నిపుణులు చెబుతున్నారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ ఇటీవల బీపీ, షుగర్‌పై ప్రత్యేక సర్వే నిర్వహించింది. రాష్ట్రంలో 30ఏళ్లు పైబడినవారు 2.78కోట్ల మంది ఉన్నారు. వారిలో దాదాపు 1.50కోట్ల మందికి ఏఎన్‌ఎంలు షుగర్‌, బీపీ టెస్టులు చేశారు. వీరిలో 55.41లక్షల మంది బీపీ అనుమానితులు, 53.92లక్షల మంది షుగర్‌ అనుమానితులను గుర్తించారు. ఇప్పటికే ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 15.25 లక్షల మందికి బీపీ, 11.49 లక్షల మందికి షుగర్‌ ఉంది. వీరిలో కొంతమంది మందులు వాడుతున్నారు. మరికొందరు వాడడం లేదు.

కోనసీమ టాప్‌

బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. అక్కడ ప్రజల్లో అత్యధిక మంది బీపీ, షుగర్‌తో బాధపడుతున్నారు. కోనసీమ జిల్లాలో ఇప్పటికే 1.22 లక్షల మంది బీపీ బాధితులు, 78 వేల మంది షుగర్‌ బాధితులు చికిత్స పొందుతున్నారు. వీరు కాకుండా మరో 3.02 లక్షల మంది బీపీ అనుమానితులు, 2.98 లక్షల మంది షుగర్‌ అనుమానితులు ఉన్నారు. ఆ జిల్లాలో 30 ఏళ్లు పైబడినవారు 13.13 లక్షల మంది ఉండగా... వారిలో సగం మందికి పైగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. తూర్పుగోదావరి జిల్లాలో కూడా దాదాపు ఇదే పరిస్థితి. ప్రస్తుతం ఆ జిల్లాలో 82 వేల మంది బీపీ బాధితులు, 65 వేల మంది షుగర్‌ బాధితులున్నారు. మరో 2.96 లక్షల మంది బీపీ అనుమానితులు, 2.77 లక్షల మంది షుగర్‌ అనుమానితులు ఉన్నారు. ఇక గుంటూరు జిల్లాలో అత్యధిక మంది షుగర్‌ బాధితులు ఉన్నారు. 89,308 మంది చికిత్స పొందుతున్నారు. అనుమానితుల సంఖ్య కూడా భారీగానే ఉంది. 2.62 లక్షల మంది బీపీ అనుమానితులు, 2.56 లక్షల మంది షుగర్‌ అనుమానితులు ఉన్నట్లు సర్వే ద్వారా తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది బీపీ, షుగర్‌ బారినపడుతున్నారు. ప్రభుత్వం దీనిపై దృష్టిసారించి తగిన చర్యలు చేపట్టాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Updated Date - 2023-01-21T08:33:37+05:30 IST