శక్తి స్వరూపిణి జిల్లెళ్లమూడి అమ్మ
ABN , First Publish Date - 2023-03-29T00:26:51+05:30 IST
ప్రేమభావనతో నూతన సమాజాన్ని నిర్మించిన మహిమాన్విత శక్తి స్వరూపిణి జిల్లెళమూడి అమ్మ అని కుర్తాళం శ్రీ సిద్ధేశ్వరపీఠం పీఠాధిపతి సిద్ధేశ్వరానంద భారతిస్వామి తెలిపారు.
శతజయంత్యోత్సవాల ప్రారంభ సభలో సిద్ధేశ్వరానందభారతిస్వామి
బాపట్లరూరల్, మార్చి 28: ప్రేమభావనతో నూతన సమాజాన్ని నిర్మించిన మహిమాన్విత శక్తి స్వరూపిణి జిల్లెళమూడి అమ్మ అని కుర్తాళం శ్రీ సిద్ధేశ్వరపీఠం పీఠాధిపతి సిద్ధేశ్వరానంద భారతిస్వామి తెలిపారు. విశ్వజననీ జిల్లెళ్లమూడి అమ్మ శతజయంత్యోత్సవాలు మంగళవారం శ్రీవిశ్వజననీ పరిషత్ ట్రస్ట్ నిర్వాహణలో మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల ప్రాంగణంలో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ అమ్మ వల్లే జిల్లెళ్లమూడికి పేరు వచ్చిందన్నారు. తిరుపతి శ్రీశక్తిపీఠం పీఠాధిపతి రమ్యానంద భారతిస్వామి మాట్లాడుతూ అమ్మతత్వంలో వసుదైక కుటుంబం అనే భావన ఉన్నదని అనుసూయ తల్లిగా అమృతస్వరూపిణిగా అమ్మ దర్శనమిచ్చిందన్నారు. విశ్రాంత సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ జిల్లెళ్లమూడి అమ్మ అందరికీ మార్గనిర్దేశం చేస్తూ సంకల్పాన్ని, ధైర్యాన్ని ప్రసాదించారన్నారు. నరసింహానందభారతిస్వామి మాట్లాడుతూ బిడ్డల సమస్యలను మౌనంగా పరిష్కరించటంలో అమ్మ దక్షిణామూర్తి అవతారమన్నారు. అనంతరం కళాశాల పూర్వ, ప్రస్తుత విద్యార్థులు అమ్మ వైభవాన్ని కీర్తించారు. తిరుపతి అన్నమాచార్య ప్రాజెక్ట్ విద్వాంసులు గర్మెల్ల బాలకృష్ణప్రసాద్ బృందం స్వర సుమాంజలి కార్యక్రమం నిర్వహించింది. ఆధ్యాత్మిక శాస్త్రవేత్త వి.ఎస్.ఆర్.మూర్తి సంపాదకత్వంలో వెలువడిన శారదా వైజయంతి విశిష్ఠ సంచికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో గెంటేల వెంకటరమణ, కాకతీయ సిమెంట్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ పి.అనురాధ, విశ్వజననీ పరిషత్ సభ్యులు డీవీఎన్ రామరాజు, గిరిధర్‌కుమార్, ఎం.వి.ఆర్‌శర్మ, తదితరులు పాల్గొన్నారు.