జాబు.. జాడేది?

ABN , First Publish Date - 2023-03-08T00:15:23+05:30 IST

జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టాక ఇప్పటివరకు నాలుగు క్యాలెండర్లు మారాయి. కానీ వాటిలో ఒక్కటి కూడా జాబ్‌ క్యాలెండరుగా మారలేదు. నాడు ప్రతిపక్షనేతగా ఉన్న ఆయన రాష్ట్రంలో 2 లక్షల 43వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, తాను అధికారంలోకి వచ్చిన వెంటనే వాటన్నింటినీ భర్తీ చేస్తానని పాదయాత్రలో పెద్దఎత్తున ప్రచారం చేసుకున్నారు.

జాబు.. జాడేది?

‘ఎండమావిలో నీరు ఎంత నిజమో ఈ ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ ఉద్యోగం రావడమన్నది కూడా అంతే నిజం. నాలుగేళ్లుగా మేం ఎండమావిలో నీళ్లు వెతికినట్లు ప్రభుత్వ ఉద్యోగం కోసం వెతుకుతున్నాం. అక్కడ నీరూ దొరకదు.. ఇక్కడ ఉద్యోగమూ రాదు’ - ఇది ఒక నిరుద్యోగి ఆవేదన. వారిని ఆవరించిన నిరాశా, నిస్పృహలకు ఈ మాటలు నిదర్శనం.

ఉద్యోగమన్నది సగటు యువకుడి కల! ఆ కల సాకారం చేస్తానన్న నేటి ముఖ్యమంత్రి, నాటి ప్రతిపక్షనేత ఇచ్చిన హామీని నమ్మి ఓట్లు గుద్దిన యువత నయవంచనకు గురై నేడు ఆవేదన చెందుతోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక తుంగలో తొక్కేయడంతో జాబు జాడ లేక నిరుద్యోగ యువత తీవ్రమైన నిరాశకు లోనవుతోంది.. నాలుగేళ్లుగా కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసినా ప్రభుత్వం చెప్పిన జాబ్‌ క్యాలెండర్‌ ఊసు లేకపోవడంతో నిర్వేదంలో కూరుకుపోతోంది.

గుంటూరు, మార్చి7(ఆంధ్రజ్యోతి): జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టాక ఇప్పటివరకు నాలుగు క్యాలెండర్లు మారాయి. కానీ వాటిలో ఒక్కటి కూడా జాబ్‌ క్యాలెండరుగా మారలేదు. నాడు ప్రతిపక్షనేతగా ఉన్న ఆయన రాష్ట్రంలో 2 లక్షల 43వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, తాను అధికారంలోకి వచ్చిన వెంటనే వాటన్నింటినీ భర్తీ చేస్తానని పాదయాత్రలో పెద్దఎత్తున ప్రచారం చేసుకున్నారు. ప్రతి ఏటా జనవరి ఒకటో తేదీన జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తానని నమ్మబలికారు. ఆ తర్వాత జాబ్‌ క్యాలెండర్‌ హామీ అటకెక్కింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకూ నిరుద్యోగులు జాబ్‌ క్యాలెండర్‌ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. కానీ జాబ్‌ క్యాలెండర్‌ రాలేదు. సమీప భవిష్యత్తులో వస్తుందన్న ఆశ కూడా వారిలో ఇప్పుడు లేదు. దీంతో వారు తీవ్రమైన నిరాశా, నిస్పృహలకు లోనవుతున్నారు.

నాడు వేలల్లో.. నేడు పదుల్లో ఉద్యోగాలు

జాబ్‌ క్యాలెండర్‌ మాటేమోగాని, కనీసం జాబ్‌ నోటిఫికేషన్లు కూడా సక్రమంగా విడుదల చేయకపోవడంతో నిరుద్యోగులు ఘోరంగా నష్టపోయారు. కిందటేడాది విడుదల చేసిన నోటిఫికేషన్లలో పదుల సంఖ్యలో మాత్రమే పోస్టులు ఉండగా, కానిస్టేబుల్‌ పోస్టులు మాత్రమే ఫరవాలేదనిపించాయి. కానీ అవి కూడా ప్రభుత్వం హామీ ఇచ్చిన వాటిలో నాలుగోవంతు పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్‌ విడుదలైంది. గ్రూప్స్‌ నోటిఫికేషన్ల ఊసే లేకుండా పోయింది. గత ప్రభుత్వ పాలనలో గ్రూప్స్‌, సహా వివిఽధ శాఖలు, ఇంజనీరింగ్‌ విభాగాలకు సంబంధించి 100కు పైగా నోటిఫికేషన్లు రాగా, 60వేల మందికిపైగా ఉద్యోగాలు పొందారు. గత ప్రభుత్వ పాలనలో గ్రూప్‌-1, గ్రూప్‌-2, గ్రూప్‌-3, డీఎస్సీ నోటిఫికేషన్లు రెండుసార్లకు మించి వచ్చాయి. వీటి ద్వారా దాదాపు 20 వేల మంది ఉన్నత ఉద్యోగాలు పొందారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చాక సచివాలయ సిబ్బంది, వలంటీరు ఉద్యోగాలు మినహా వచ్చిన ఉద్యోగాలు లేవు. దీంతో లక్షలాదిమంది ఆశలు ఆవిరయ్యాయి.

జిల్లాలో తారాస్థాయికి చేరిన నిరుద్యోగం

రాష్ట్రంలో నిరుద్యోగం తారాస్థాయికి చేరింది. మూడున్నరేళ్ల క్రితం జరిగిన సచివాలయ పరీక్షలకు రాష్ట్రంలో 22 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరంతా గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసుకుని డిగ్రీ పట్టాలు అందుకున్నవారే. ఈ మూడేళ్లలో మరో 5 లక్షల మంది డిగ్రీలు పూర్తి చేసుకుని వీరికి తోడయ్యారు. వీరేకాకుండా ఇంటర్మీడియట్‌ పూర్తి చేసుకుని ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారు మరో 5 లక్షలమంది ఉంటారు. ఈ లెక్కన గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో మూడున్నర లక్షలమందికి పైగా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. నాలుగేళ్లుగా నోటిఫికేషన్లు రాకపోవడంతో వయసు పెరిగిపోయి ఏటా ఐదువేలమంది అనర్హతకు గురవుతున్నారు. కోచింగ్‌ సెంటర్లకు ఫీజులు చెల్లించలేక, ఆర్థికభారం మోయలేక మరికొంతమంది మధ్యలోనే ప్రయత్నాన్ని విరమించుకుంటున్నారు.

విద్యాకేంద్రమైన గుంటూరుపై తీవ్ర ప్రభావం

రాష్ట్ర విభజన అనంతరం పోటీ పరీక్షల కేంద్రంగా గుంటూరు ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, కృష్ణా జిల్లాల యువత గుంటూరులో ఉండే కోచింగ్‌ సెంటర్లలో చేరుతుంటారు. వీరంతా స్టూడెంట్‌ హాస్టళ్లలో బస చేస్తుంటారు. సగటున 15వేల మంది యువకులు పోటీ పరీక్షల నిమిత్తం గుంటూరులో ఉంటున్నారు. వీరు కోచింగ్‌ ఫీజు రూపేణా 10 నుంచి 15 వేలు, హాస్టల్‌ మెస్‌ బిల్లు కింద నెలకు రూ.5 నుంచి 6 వేలు, స్టడీ రూము కింద నెలకు రూ.2 వేలు చొప్పున చెల్లిస్తున్నారు. ఇలా ఏటా లక్ష రూపాయల మేర ఒక్కో అభ్యర్థి ఖర్చు చేయాల్సి వస్తోంది. నాలుగేళ్లుగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న ఒక్కో అభ్యర్థి ఇప్పటి వరకూ సగటున రూ.4 లక్షలు ఖర్చు చేసినట్లు తేలుతోంది. ఈ ఆర్థిక భారం మోయలేక అనేకమంది ఇప్పటికే చేతులెత్తేసినట్లు తెలుస్తోంది.

తక్షణం జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయాలి..

జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తానని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి ఇప్పటికి నాలుగేళ్లయినా విడుదల చేయలేదు. దీంతో నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారు. చాలామందికి వయోపరిమితి దాటిపోతోంది. ఆర్థికంగా చితికిపోతున్నారు. ప్రభుత్వం తక్షణం జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయాలి.

- కిరణ్‌, ఎస్‌ఎఫ్‌ఐ

జాబ్‌ క్యాలెండర్‌ పేరిట నయవంచన

జాబ్‌ క్యాలెండర్‌ పేరిట ప్రభుత్వం నిరుద్యోగులను ఘోరంగా వంచించింది. నాలుగేళ్లుగా జాబ్‌ క్యాలెండర్‌, నోటిఫికేషన్లు లేకపోవడంతో నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోయారు. ఉద్యోగాల కోసం వాల్‌మార్టు వంటి కంపెనీల్లో కూలీకి పోతున్నారు. బెంగళూరు, హైదరాబాదు, చెన్నైలకు వెళ్లిపోతున్నారు. తక్షణం జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయాలి.

- మన్నవ వంశీ కృష్ణ, టీఎన్‌ఎస్‌ఎఫ్‌

Updated Date - 2023-03-08T00:15:23+05:30 IST