శంభో శంకరా

ABN , First Publish Date - 2023-02-18T23:43:04+05:30 IST

మహాశివరాత్రి సందర్భంగా శనివారం కోటప్పకొండ శ్రీత్రికోటేశ్వరస్వామి సన్నిధి భక్తులతో పోటెత్తింది. హర హరా.. చేదుకో కోటయ్య.. చేదుకోవయ్యా.. అంటూ భక్తుల నినాదాలతో త్రికూటాద్రి మారుమోగింది. కోటయ్య తిరునాళ్ల కన్నుల పండువగా జరిగింది. తెలుగు రాష్ట్రాల నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా లక్షలాదిగా తరలివచ్చారు.

శంభో శంకరా
విద్యుత్‌ వెలుగుల్లో కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామి ఆలయం

శంభో శంకరా.. హరోం హర.. హర హర మహాదేవ.. చేదుకో కోటయ్య చేదుకో.. ఓం నమశ్శివాయా.. అంటూ భక్త జన హోరుతో కోటప్పకొండతో పాటు శైవక్షేత్రాలు మారుమోగాయి. మహాశివరాత్రి పర్వదినాన్ని శనివారం భక్తులు భక్తిశ్రద్ధల మధ్య జరుపుకున్నారు. విద్యుత్‌ ప్రభల వెలుగులతో, విద్యుత్‌ అలంకరణలతో కోటప్పకొండ ప్రాంతం దేదీప్యమానంగా వెలుగొందింది. విద్యుత్‌ దీపాలంకరణలతో శివాలయాలు శోభాయమానంగా మారాయి. కోటయ్య తిరునాళ్లకు లక్షలాది భక్తులు తరలిరాగా కోటప్పకొండ కిటకిటలాడింది. కోటయ్య స్వామిని దర్శించుకున్న భక్తులు విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. కోటయ్య క్షేత్రానికి 22 భారీ విద్యుత్‌ ప్రభలు తరలివచ్చాయి. ఇక ఉమ్మడి గుంటూరు జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రాలు అమరావతిలోని అమరేశ్వరాలయం, పెదకాకానిలోని మల్లేశ్వరస్వామి ఆలయం, వడ్లమూడిలోని క్వారీ బాలకోటేశ్వరాస్వామి ఆలయం, గోవాడలోని శ్రీబాలకోటేశ్వరస్వామి ఆలయంతో పాటు వివిధ ప్రాంతాల్లోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి.

కోటప్పకొండ(నరసరావుపేట), ఫిబ్రవరి 18: మహాశివరాత్రి సందర్భంగా శనివారం కోటప్పకొండ శ్రీత్రికోటేశ్వరస్వామి సన్నిధి భక్తులతో పోటెత్తింది. హర హరా.. చేదుకో కోటయ్య.. చేదుకోవయ్యా.. అంటూ భక్తుల నినాదాలతో త్రికూటాద్రి మారుమోగింది. కోటయ్య తిరునాళ్ల కన్నుల పండువగా జరిగింది. తెలుగు రాష్ట్రాల నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా లక్షలాదిగా తరలివచ్చారు. భక్తులు స్వామిని దర్శించుకుని విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అర్ధరాత్రి త్రికోటేశ్వరస్వామికి లింగోద్భవ అభిషేకాలు వైభవంగా జరిగాయి. తిరునాళ్లకు రాష్ట్ర పండుగ హోదా కల్పించడంతో ప్రభుత్వం తరపున ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి స్వామికి పట్టువస్త్రాలు, వెండి ప్రభ సమర్పించారు. తెల్లవారుజామున అర్చకులు బిందె తీర్థంతో స్వామికి అభిషేకాలు నిర్వహించారు. పంచామృతాలతో ఘనంగా అభిషేకాలు జరిపి స్వామికి విశేష అలంకారం చేశారు. అనంతరం స్వామిదర్శనానికి భక్తులను అనుమతించారు. కొండ దిగువన బొచ్చు కోటయ్యస్వామి వద్ద భక్తులు తలనీలాలు సమర్పించారు. ఎగువున కొండపైన పాతకోటేశ్వరస్వామి, పాపవినాశేశ్వరస్వామి, దిగువున విఘ్నేశ్వరస్వామి, సోపానమార్గంలోని ఆనందవల్లి ఆలయాల్లో భక్తులు పూజలు చేశారు. ధ్యాన శివుడు, విఘ్నేశ్వరుడు, నంది, నాగేంద్రస్వామి పుట్ట వద్ద భక్తులు పూజలు చేశారు. రెండు అభిషేక మండపాల్లో భక్తులు ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఆలయం వద్ద ఏర్పాట్లను ఈవో వేమూరి గోపి, ట్రస్టీ రామకృష్ణ కొండలరావు పర్యవేక్షించారు. ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కలెక్టర్‌ శివశంకర్‌, ఎస్పీ రవిశంకర్‌రెడ్డి, ఆర్డీవో శేషిరెడ్డి, డీఎస్పీ విజయభాస్కరరావుతో పాటు వివిధ శాఖల అధికారులు ఏర్పాట్లను పరిశీలించి భక్తులకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నారు.

కనువిందు చేసిన విద్యుత్‌ ప్రభలు

వివిధ గ్రామాల నుంచి తరలివచ్చిన 22 భారీ విద్యుత్‌ ప్రభలు కోటప్పకొండలో కొలువుదీరాయి. ప్రభల విద్యుత్‌ కాంతులు యాత్రికులకు కనువిందు చేశాయి. ఉదయం 11 గంటలకే కొండకు ప్రభలు చేరుకున్నాయి. వివిధ రాష్ట్రాలకు సంబందించిన ప్రధాన విద్యుత్‌ లైన్‌కు రెండు గంటల పాటు ప్రభల రాక కోసం విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు. చిలకలూరిపేట రహదారిలో ప్రభల రాక శోభాయమానంగా సాగింది. నరసరావుపేట రహదారిలో సాధారణ ప్రభల రాకతో కోలాహలం నెలకుంది. పురుషోత్తపట్నం గ్రామానికి సంబంధించి ఐదు భారీ విద్యుత్‌ ప్రభలు, గురవాయపాలెం నుంచి రెండు, కమ్మవారిపాలెం, అవిశాయపాలెం, కావూరు, మద్దిరాల, అప్పాపురం, యడవల్లి, బొప్పూడి, గోవిందాపురం, కోమటినేనివారిపాలెం, నరసరావుపేట మండలంలోని కాకాని, ఉప్పలపాడు గ్రామాల నుంచి భారీ విద్యుత్‌ ప్రభలు కొండకు వచ్చాయి. ప్రభలపై తెల్లవార్లు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. వేలాది మంది భక్తులు సాంస్కృతిక ప్రదర్శనలు తిలకించారు.

అధికార పార్టీ నేతల ఇష్టారాజ్యం

కోటప్పకొండ తిరునాళ్లలో వీఐపీల తాకిడి అత్యధికంగా ఉంది. ఇష్టారాజ్యంగా వీఐపీ పాసులను అధికార పార్టీ నేతలు జారీ చేశారు. వీఐపీల పేరుతో వేలాది మంది స్వామి దర్శనం చేసుకున్నారు. ఒక్కో వీఐపీ వెంట అధిక సంఖ్యలో వారి అనుచరులు తరలివచ్చారు. వీఐపీ క్యూలైన్‌ నిర్వహణ కూడా అధికార పార్టీ నేతల చేతుల్లోకి వెళ్లింది. ఎమ్యెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి దగ్గర ఉండి వీఐపీలను దర్శనానికి పంపించారు. దాదాపు నాలుగు గంటలపాటు ఆయన వీఐపీ క్యూలైన్‌ వద్దే ఉన్నారు. వీఐపీల వాహనాలను కొండపైకి అనుమతించారు. దీంతో క్యూలైన్లలో, కొండ ప్రాంతంలో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వీఐపీల సేవలో కొందరు అఽధికారులు తరించారు. మంత్రులు కోట్టు సత్యనారాయణ, అంబటి రాంబాబు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్సీలు డొక్కా మాణిక్యవరప్రసాద్‌, జంగా కృష్ణమూర్తి, మురుగుడు హనుమంతరావు, ఎమ్మెల్యేలు బొల్లా బ్రహ్మనాయుడు, పిన్నెల్లి రామక్రిష్ణారెడ్డి, నంబూరు శంకరరావు, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, మాజీ ఎమ్మెల్యేలు మర్రి రాజశేఖర్‌, వెంకటేశ్వరరెడ్డి, ఐజీ త్రివిక్రమవర్మ, జేసీ శ్యాంప్రసాద్‌, ఏఎస్పీ బిందుమాధవ్‌ తదితరులు స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

Updated Date - 2023-02-18T23:43:08+05:30 IST