Share News

తాడికొండ వైపుగా.. సుచరిత

ABN , First Publish Date - 2023-11-26T19:00:13+05:30 IST

మాజీ హోంమంత్రి, ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సుముఖంగా లేదని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. సొంత నియోజకవర్గంలో అడుగుపెట్టి ఆరు నెలలకు పైగానే దాటింది. అయితే ప్రత్తిపాడు నుంచి పోటీ చేసేందుకు ఇష్టం లేకే ఆ నియోజకవర్గంలో అడుగుపెట్టటం లేదని సమాచారం.

తాడికొండ వైపుగా.. సుచరిత

అధిష్ఠానం దృష్టికి ప్రతిపాదన

ప్రత్తిపాడు నుంచి పోటీకి విముఖత

తమ్ముళ్ల కారణంతో పార్టీలో వ్యతిరేకత

శ్రీదేవి పార్టీ వీడటంతో నియోజకవర్గం మారే అవకాశం

గుంటూరు, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): మాజీ హోంమంత్రి, ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సుముఖంగా లేదని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. సొంత నియోజకవర్గంలో అడుగుపెట్టి ఆరు నెలలకు పైగానే దాటింది. అయితే ప్రత్తిపాడు నుంచి పోటీ చేసేందుకు ఇష్టం లేకే ఆ నియోజకవర్గంలో అడుగుపెట్టటం లేదని సమాచారం. కొన్ని కారణాల మూలంగా ఆమె సొంత పార్టీ నుంచి కూడా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నది. స్వతహాగా మృదుస్వభావం అయినప్పటికీ తన పదవిని అడ్డంపెట్టుకుని సొంత తమ్ముళ్లు చేస్తున్న అరాచకాలకు అడ్డుకట్ట వేయలేక పోయారని వైసీపీకి చెందిన స్థానిక నేతల నుంచే విమర్శలకు గురవ్వాల్సి వచ్చింది. తాము నమ్ముకున్న పార్టీ అధికారంలోకి రావడంతో పది రూపాయలు వెనకేసుకుందామని ఆశపడిన మండల నాయకులకు నిరాశ ఎదురైంది. ఎమ్మెల్యే కుటుంబీకుల ఆధ్వర్యంలోనే మట్టి తవ్వకాలు ఈ నాలుగేళ్లుగా సాగటంతో స్థానిక నాయకుల నోట్లో మట్టికొట్టినట్లైంది. ముఖ్యంగా సీఎం సామాజికవర్గానికి చెందిన ప్రత్తిపాడు నేతలు దీనిపై బహిరంగంగానే మండిపడిన సందర్భాలున్నాయి. దీంతో ఒక దశలో ఆమె రాజకీయాలకే దూరమవుతారనే ప్రచారం జరిగింది. అయితే పార్టీని ఆది నుంచి నమ్ముకుని ఉండటం, సొంతంగా ఎంతో కొంత ఎన్నికల ఖర్చు పెట్టుకునే స్థాయి ఉండటంతో ఆమెను తిరిగి పోటీ చేయాలని అధిష్ఠానం ఒత్తిడి చేసినట్లు సమాచారం. ఆమెను పోటీకి ఒప్పించేందుకే వైసీపీపై అలకతో ఉన్న సుచరిత భర్త, విశ్రాంత ఆదాయపు పన్నుల శాఖ అధికారి దయాసాగర్‌కు ఇటీవల మచిలీపట్నం పోర్టు ఎండీ పదవిని సీఎం జగన కట్టబెట్టిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో తిరిగి పోటీ చేయడం భావ్యం కాదని భావించిన సుచరిత తాడికొండ నుంచి అయితే పోటీకి సిద్ధమని ఇటీవల ముఖ్యమంత్రి జగనను కలిసి తన కోరికను వెళ్లబుచ్చినట్లు తెలిసింది. పైగా అక్కడ నుంచి వైసీపీ తరపున పోటీ చేసి గెలుపొందిన డాక్టర్‌ ఉండవల్లి శ్రీదేవి ప్రస్తుతం ఆ పార్టీని వీడటంతో సుచరితకు ఆ నియోజకవర్గం కోరుకునే అవకాశం వచ్చింది. ప్రత్తిపాడులో సొంత పార్టీ నుంచి వ్యతిరేకతతో పాటు ఇతర అంశాలు కూడా అనుకూలంగా లేకపోవటంతో అదే నియోజకవర్గం నుంచి తిరిగి గెలిచే అవకాశల్లేవని గ్రహించే వేరే నియోజకవర్గం వైపు ఆమె చూస్తున్నట్లు నేతలు చెబుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత మూలంగా టీడీపీ ఇప్పటికే ఆ నియోజకవర్గంలో బలపడింది. దీనికితోడు జనసేన కూడా పొత్తు పెట్టుకోవడంతో వైసీపీ విజయావకాశాలు మరింత సన్నగిల్లాయి. ప్రత్తిపాడు నుంచి కాంగ్రెస్‌ తరపున ఒక సారి, వైసీపీ తరపున రెండు సార్లు విజయం సాధించినప్పటికీ సుచరిత నియోజకవర్గంపై పట్టు సాధించలేకపోయారు. కుటుంబీకుల విపరీత జోక్యం మూలంగానే ఆమె సొంత పార్టీ శ్రేణుల నుంచి కూడా వ్యతిరేకత మూటకట్టుకోవాల్సి వచ్చింది. ప్రస్తుత తరుణంలో మూడు సార్లు గెలిచిన నియోజకవర్గం నుంచి కూడా తిరిగి పోటీ చేయడానికి ఆమె సాహించలేకపోతున్నారు.

Updated Date - 2023-11-26T19:18:08+05:30 IST