ఎన్టీ రామారావు పేరే ఓ అద్భుతం..

ABN , First Publish Date - 2023-02-13T00:32:08+05:30 IST

సినీ, రాజకీయ రంగాల్లో పట్టుదల, క్రమశిక్షణతో పనిచేసిన ఎన్టీఆర్‌ పేరే ఓ అద్భుతమని సినీ దర్శకుడు బీ.గోపాల్‌ అన్నారు.

ఎన్టీ రామారావు పేరే ఓ అద్భుతం..
అలనాటి సినీనటి రాజశ్రీకి ఎన్టీఆర్‌ శతాబ్ధిపురస్కారం

సినీ దర్శకుడు బీ. గోపాల్‌

అలనాటి సినీనటి రాజశ్రీకి ఎన్టీఆర్‌ శత జయంతి పురస్కారం

తెనాలి అర్బన్‌, ఫిబ్రవరి 12 : సినీ, రాజకీయ రంగాల్లో పట్టుదల, క్రమశిక్షణతో పనిచేసిన ఎన్టీఆర్‌ పేరే ఓ అద్భుతమని సినీ దర్శకుడు బీ.గోపాల్‌ అన్నారు. తెనాలిలో జరుగుతున్న ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం అలనాటి సినీనటి రాజశ్రీని ఎన్టీఆర్‌ శతాబ్ధిపురస్కారంతో ఘనంగా సత్కరించారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్‌ అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న బీ.గోపాల్‌ మాట్లాడుతూ.. ఒంగోలు వెళ్లి నేల టిక్కెట్‌ కొని మూడు ఎన్టీఆర్‌ సినిమాలు చూసి ఇంటికి వెళ్లేవాళ్లమని, సినిమాలపై అభిమానంతో మద్రాసు వెళ్లిన తనకు అడవి రాముడు సినిమా చిత్రీకరణలో ఆయనపై క్లాప్‌ కొట్టే భాగ్యం దక్కిందన్నారు. ఆయన నటన అనితర సాధ్యమని, ఎన్నో దేవుళ్ల పాత్రలలో లీనమై నటించి ప్రజలకు ఆరాధ్య దైవమయ్యారన్నారు. ఎన్టీఆర్‌ మనువడు చైతన్యకృష్ణ మాట్లాడుతూ, తెలుగు తల్లి వరాల బిడ్డ ఎన్టీఆర్‌కు ఏడాది పాటు తెనాలిలో శత జయంతి నిర్వహించడం గర్వంగా ఉందన్నారు. ఎన్టీఆర్‌ అనే గొప్ప వ్యక్తి కుటుంబంలో పుట్టడం తమ పూర్వజన్మ సుకృతమన్నారు. మాజీ ఎమ్మెల్యే గోగినేని ఉమ మాట్లాడుతూ, పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రధాని సైతం ఎన్టీఆర్‌ పేరు ప్రస్తావించారని, ఆయన పేరును రాజకీయాలకు వాడుకోకుండా భారతరత్న ఇవ్వాలని కోరారు. సన్మాన గ్రహీత రాజశ్రీ మాట్లాడుతూ, క్రమశిక్షణకు ఎన్టీఆర్‌ మారుపేరు అని సెట్‌లో ఆయన ఉంటే ప్రతి ఒక్కరి శ్రద్ధ చిత్రీకరణపైనే ఉండేదన్నారు. ఆయనతో నటించడం జన్మధన్యమని, సినిమాలలో నటులను అభిమానులు ఆరాధించే స్థాయికి చేరడానికి కారణమైన వారిలో ఎన్టీఆర్‌ ఎంతో ముఖ్యుడన్నారు. ఆయన గురించి చెప్పాలంటే తమ జీవితకాలం చాలదన్నారు. ఎన్టీఆర్‌ పురస్కారం అందుకోవడంతో తమ జీవితం ధన్యమైందన్నారు. మహిళా కమిషన్‌ మాజీ చైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకుమారి, సినీ రచయిత బుర్రా సాయిమాధవ్‌, ఎన్టీఆర్‌ అభిమాని అష్రఫ్‌ ఆలీ తదితరులు ప్రసంగించారు.

Updated Date - 2023-02-13T00:32:12+05:30 IST