Lokesh Padayatra : ఆంక్షలు అధిగమిస్తూ.. లోకేశ్ పాదయాత్ర 1000 కి.మీ. పూర్తి
ABN , First Publish Date - 2023-04-22T03:42:08+05:30 IST
తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేశ్ చేపట్టిన పాదయాత్ర 1000 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. శుక్రవారం కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఈ మైలురాయిని చేరుకుంది. ఈ సందర్భంగా లోకేశ్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.

(అమరావతి-ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేశ్ చేపట్టిన పాదయాత్ర 1000 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. శుక్రవారం కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో ఈ మైలురాయిని చేరుకుంది. ఈ సందర్భంగా లోకేశ్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. యువగళం పేరుతో జనవరి 27వ తేదీన కుప్పంలో ప్రారంభమైన పాదయాత్ర.. ఇప్పటి వరకు ఉమ్మడి చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో సాగింది. ప్రస్తుతం కర్నూలు జిల్లాలో కొనసాగుతోంది. రాజకీయాల్లోకి అడుగు పెట్టిన తర్వాత లోకేశ్ ఇంత సుదీర్ఘ రాజకీయ యాత్రను చేపట్టడం ఇదే మొదటిసారి. పార్టీ ప్రధాన కార్యదర్శిగా పదేళ్ల క్రితం రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆయన గతంలో మంత్రిగా పనిచేశారు. ప్రతిపక్ష పాత్రలో మరింత క్రియాశీలక పాత్ర పోషించేందుకు పాదయాత్రను ఎంచుకొన్నారు. పాదయాత్రలో... మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేల అవినీతిని వారి నియోజకవర్గాల్లోనే ఎండగడుతూ టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు. మంత్రి పెద్దిరెడ్డి నియోజకవర్గం పుంగనూరులోనూ లోకేశ్ విమర్శల దాడి ఆపలేదు. మంత్రి, ఆయన అనుచరులపై వస్తున్న అవినీతి ఆరోపణల గురించి ప్రస్తావించారు. ధర్మవరంలో అధికార పార్టీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి భూ ఆక్రమణలకు పాల్పడ్డారంటూ డ్రోన్‌తో తీసిన చిత్రాలను లోకేశ్ విడుదల చేయడం సంచలనం కలిగించింది.
కర్నూలు జిల్లాలో మంత్రి గుమ్మనూరు జయరాం, ఎమ్మెల్యే శ్రీదేవికి సంబంధించి భూ ఆక్రమణలపై ఆయన లేవనెత్తిన అంశాలు చర్చనీయాంశమయ్యాయి. లోకేశ్ పాదయాత్రకు ఆటంకాలు కలిగించేందుకు అధికారులు ఎన్నో ఆంక్షలు విధించారు. జీవో 1 పేరుతో చిత్తూరు జిల్లాలో పోలీసులు పాదయాత్రపై ఉక్కుపాదం మోపారు. లోకేశ్‌పై మూడుచోట్ల కేసులు పెట్టారు. ఆయన చుట్టూ ఉన్నవారిపై కనీసం 25కేసులు నమోదయ్యాయి. పాదయాత్రలో రైతులు, కార్మికులు, మహిళలు, ఎస్సీలు, బీసీలు, వివిధ వర్గాల ప్రజలతో లోకేశ్ సమావేశమై వారి సమస్యలు తెలుసుకొంటున్నారు. ఇప్పటి వరకు 27 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 14, ఉమ్మడి అనంతపురం జిల్లాలో 9, ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఇప్పటికి 4 నియోజకవర్గాల్లో పాదయాత్ర సాగింది. ఇప్పటి వరకు రోజుకు సగటున 13కిలోమీటర్లు నడిచారు.
ఆదివారం కూడా యాత్ర
ఇప్పటి వరకు లోకేశ్ పాదయాత్రకు రెండుసార్లు మాత్రమే విరామం ఇచ్చారు. సినీ నటుడు, బంధువు తారకరత్న మరణించినప్పుడు అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఒకసారి, పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సమయంలో పోలీసులు నోటీసు ఇవ్వడంతో మరోసారి విరామం ఇవ్వాల్సి వచ్చింది. ఈ రెండు సందర్భాలు మినహా ఆదివారం సహా అన్ని రోజులూ యాత్ర కొనసాగుతోంది.
లోకేశ్ సెల్ఫీ చాలెంజ్
పాదయాత్రలో లోకేశ్ సెల్ఫీ చాలెంజ్ పేరుతో ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన పరిశ్రమలు, అభివృద్ధి కార్యక్రమాల వద్ద సెల్ఫీ దిగి.. ఇలాంటిది ఏదైనా వైసీపీ ప్రభుత్వం చేసుంటే చెప్పాలని చాలెంజ్ చేస్తున్నారు. అలాగే వైసీపీ హయాంలో మూసివేసిన అన్న క్యాంటీన్ భవనాలు, అమల్లోకి రాని దిశ చట్టం కింద ఏర్పాటైన పోలీస్ స్టేషన్లు, ఫిష్ ఆంధ్రా పాయింట్ల వద్ద కూడా సెల్ఫీలు దిగి పోస్టు చేస్తున్నారు.
సెల్ఫీ విత్ లోకేశ్
పాదయాత్రలో ‘సెల్ఫీ విత్ లోకేశ్’ కార్యకర్తలను ఆకట్టుకుంటోంది. రాత్రి బస చేసిన చోట ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. లోకేశ్‌తో సెల్ఫీ దిగాలని కోరుకునే కార్యకర్తలు, ప్రజలకు గంటపాటు సమయం కేటాయిస్తున్నారు. ఇందుకోసం కొత్త టెక్నాలజీని వాడుతున్నారు. లోకేశ్‌తో సెల్ఫీ దిగాక ఫేస్ రికగ్నేషన్ టెక్నాలజీ ద్వారా ఆ వ్యక్తి వాట్సప్ నెంబర్‌కు దానంతట అదే వెళ్లిపోతోంది. సగటున రోజుకు 1000-1500 మంది సెల్ఫీలు దిగుతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.