Sake Bharti : అక్షర ‘భారతి’కి అన్యాయం
ABN , First Publish Date - 2023-07-21T02:47:59+05:30 IST
‘కులం చూడం. మతం చూడం. రాజకీయాలు చూడం. అర్హులైతే చాలు... పథకాలు వర్తింపజేస్తాం’.. సీఎం జగన్ తరచూ చెప్పే మాట ఇది.
కూలీకి వెళుతూ పీహెచ్‌డీ
పేద గిరిజన మహిళ ఘనత
ఇల్లు కూడా కేటాయించని జగన్ సర్కారు
కుటుంబంతో రేకుల షెడ్డులో కాపురం
ప్రాధేయపడినా పట్టించుకోని ఎమ్మెల్యే
ఉద్యోగం కోసం సిఫారసు లేఖ ఇవ్వాలని
కాళ్లు పట్టుకుంటే గెంటేశారు: భారతి
(అనంతపురం-ఆంధ్రజ్యోతి): ‘కులం చూడం. మతం చూడం. రాజకీయాలు చూడం. అర్హులైతే చాలు... పథకాలు వర్తింపజేస్తాం’.. సీఎం జగన్ తరచూ చెప్పే మాట ఇది. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఆయన పార్టీ ఎమ్మెల్యేలే ఈ మాటలను పెడచెవిన పెడుతున్నారు. అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం నాగులగుడ్డం గ్రామానికి చెందిన పీహెచ్‌డీ పట్టాదారు, గిరిజన కూలీ సాకే భారతి కుటుంబానికి జరిగిన అన్యాయమే ఇందుకు నిదర్శనం. ఇల్లు లేక రేకులు అడ్డుపెట్టుకొని జీవనం సాగిస్తున్న ఆ పేదకుటుంబానికి అన్ని అర్హతలున్నా ఇల్లు ఇవ్వలేదు. ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతిని కలిసి ఇల్లు మంజూరు చేయాలని ప్రాధేయపడితే గెంటేశారు. తాను ఉన్నత విద్య చదివానని, ఎస్కే యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేస్తున్నారని, ఓ సిఫార్సు లేఖ ఇవ్వాలని ఎమ్మెల్యే కాళ్లు పట్టుకున్నా కనికరించలేదు.
పీహెచ్‌డీతో వెలుగులోకి..
సాకే భారతి, శివప్రసాద్ దంపతులది నిరుపేద కుటుం బం. వారిద్దరూ కాయకష్టం చేసుకొని జీవనం సాగిస్తున్నారు. కష్టాలు, కన్నీటిని దిగమింగి పీజీ వరకూ భారతి చదివారు. వీరికి ఎనిమిదేళ్ల కూతురు ఉంది. భర్త సహకారంతో భారతి కెమిస్ర్టీలో పీహెచ్‌డీ పూర్తిచేశారు. శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ 21వ స్నాతకోత్సవాల్లో పట్టాను అందుకున్నారు. ఆ క్రమంలో ఆ దంపతులు పడ్డ కష్టాలు వర్ణణాతీతం. అవమానాలూ ఎదుర్కొన్నారు. పీహెచ్‌డీ ప్రవేశం కోసం నెలరోజులు పోరాటం చేయాల్సి వచ్చింది. ‘మీకెందుకు పీహెచ్‌డీ?’ అని కొందరు అధ్యాపకులు హేళన చేశారు. శివప్రసాద్ రోడ్డుపై నిరసనకు దిగాల్సి వచ్చింది. చివరికి వర్సిటీ యాజమాన్యం దిగొచ్చి పీహెచ్‌డీ ప్రవేశానికి అనుమతిచ్చింది. ఒక నిరుపేద ఇల్లాలు కూలి పనులకు వెళితేగాని పూట గడవని పరిస్థితుల్లో పీహెచ్‌డీ పట్టా పొందడంతో... భారతికి ప్రశంసలు వెల్లువెత్తాయి. అభినందించేందుకు వెళ్లిన పలువురు రాజకీయ, ప్రజా సంఘాల నాయకులు భారతి కుటుంబ పరిస్థితులు, రేకుల షెడ్డును చూసి నివ్వెరపోతున్నారు. ‘ప్రభుత్వం పక్కాఇళ్లు మంజూరు చేస్తోంది కదా..? మీకెందుకు ఇవ్వలేదు’ అని కొందరు అడిగారు.
ఎమ్మెల్యే పద్మావతి వద్ద తమకు ఎదురైన చేదు అనుభవాన్ని ఆమె వివరించారు. ‘మా కుటుంబంలో ఎవరూ చదువుకోలేదు. మా అమ్మకు మేము ముగ్గురు సంతానం. చిన్నప్పటి నుంచి నాకు చదువు అంటే ఇష్టం. చిన్నవయస్సులో పెళ్లి చేసినప్పటికీ.. భర్త శివప్రసాద్ ప్రోత్సహించాడు. పీజీ తరువాత పీహెచ్‌డీ చేసేందుకు సహకరించాడు. రాత్రింబవళ్లు కూలికెళ్లి సంసారాన్ని నెట్టుకొచ్చాడు. నాకోసం ఎంతో కష్టపడ్డాడు. నా పట్టుదల, ఆయన శ్రమతోనే పీహెచ్‌డీ పట్టా పొందాను. పీహెచ్‌డీ చేస్తున్న సమయంలో ఎస్కేయూలో బ్యాక్‌లాగ్ పోస్టులు పడ్డాయి. ఉద్యోగం వస్తే పేదరికం నుంచి గట్టెక్కచ్చనే ఉద్దేశంతో ఎమ్మెల్యే వద్దకు నేను, నా భర్త వెళ్లాం. ఒక లెటర్ ఇవ్వండమ్మా అని కాళ్లు పట్టుకున్నా ఎమ్మెల్యే నుంచి సమాధానం రాలేదు. నా మొర పట్టించుకోకుండా వెళ్లిపోయారు. పేదోళ్లమని పట్టించుకోకపోయినా పర్వాలేదు. గెంటేశారు. చాలా బాధపడ్డాను. తరువాత ఇల్లు మంజూరు చేయాలని ప్రాధేయపడినా పట్టించుకోలేదు. పేదోళ్ల బతుకులు ఇట్లాగే ఉంటాయేమోనని ఏడ్చుకున్నాం. మా బతుకులింతే’ అని భారతి ఆవేదన వ్యక్తం చేశారు.
స్పందించని ఎమ్మెల్యే కుటుంబం..
పీహెచ్‌డీ పట్టా అందుకున్న భారతి ఇంటికి పలువురు ప్రముఖులు వెళ్లి అభినందించి వస్తున్నారు. అయితే ఎమ్మెల్యే పద్మావతి, ఆమె భర్త, సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి మాత్రం ఆమెకు అభినందనలు తెలపలేదు. సాకే భారతి విజయగాథ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎట్టకేలకు తమ ఇంటికి రావాలని అనుచరుల ద్వారా భారతికి ఎమ్మెల్యే కబురు పంపించారని తెలిసింది.