పాఠాలు వినకుండానే పరీక్షలు!
ABN , First Publish Date - 2023-05-23T02:25:06+05:30 IST
ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం విద్యార్థులకు శాపంగా మారింది.
● డిప్లొమా విద్యార్థులకు బీటెక్ ప్రవేశాల్లో జాప్యం
● తొలుత మే 5న ఈసెట్ నిర్వహణకు షెడ్యూల్
● ఫైనల్ పరీక్షలు పూర్తికాలేదని జూన్ 20కి వాయిదా
● నెల ఆలస్యంగా పాలిటెక్నిక్ విద్యార్థులకు సీట్లు
● ఇంజనీరింగ్ రెగ్యులర్
విద్యార్థులకు ముందే తరగతులు
● ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం
● దాదాపు 20వేల మంది విద్యార్థులకు శాపం
(అమరావతి–ఆంధ్రజ్యోతి)
ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం విద్యార్థులకు శాపంగా మారింది. ఉన్నత విద్యా మండలి, సాంకేతిక విద్యాశాఖ మధ్య ఏర్పడిన గ్యాప్ కారణంగా పాలిటెక్నిక్ నుంచి ఇంజనీరింగ్‌లో చేరే విద్యార్థులు నెల రోజులకు పైగా తరగతులు నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. జూన్ నెలాఖరు నుంచి లేదా జూలై మొదటి వారం నుంచి ఇంజినీరింగ్ రెండో సంవత్సరం తరగతులు ప్రారంభమవుతాయి. కానీ ఈసెట్ రాసి బీటెక్ రెండో సంవత్సరంలో చేరే విద్యార్థులకు జూలై నెలాఖరుకు గానీ సీట్లు కేటాయించే పరిస్థితి లేదు. దీంతో దాదాపు నెల నుంచి నెలన్నర వరకు ఈసెట్ రాసి వచ్చిన విద్యార్థులు తరగతులు కోల్పోనున్నారు. మొదటి షెడ్యూలులోనే అందరూ ఇంజనీరింగ్ కోర్సు ల్లో చేరే పరిస్థితి ఉండదు. అలా ఇంకొంత ఆలస్యం జరిగితే సగం పాఠాలు కూడా వినకుండానే మొదటి సెమిస్టర్ పరీక్షలు రాయాల్సి వస్తుంది. దానివల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి కనిపిస్తోంది. ఏటా ఈసెట్ రాసి దాదాపు 20వేల మంది విద్యార్థులు బీటెక్‌లో అడ్మిషన్లు తీసుకుంటారు. అంతమంది విద్యార్థుల విషయంలో ప్రభుత్వ శాఖలు నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ముందే తెలిసినా...
మూడేళ్ల నుంచి కొవిడ్ కారణంగా అన్ని కోర్సుల్లోనూ అడ్మిషన్లు ఆలస్యం అవుతున్నాయి. ప్రస్తుతం డిప్లొమా చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు కూడా విద్యా సంవత్సరం ఆలస్యమైంది. దీంతో ఈ నెల 29 నుంచి జూన్ 12 వరకు వారికి యాన్యువల్ పరీక్షలు నిర్వహిస్తారు. అయితే సెట్ల పరీక్షల నిర్వహణపై ఉన్నత విద్యామండలి కొద్ది నెలల కిందట ఉమ్మడి సమావేశం నిర్వహించింది. విద్యార్థులకు పరీక్షలు లేని సమయంలో ప్రవేశ పరీక్షలు నిర్వహించేందుకు తేదీలు ఖరారు చేసింది. ఇందులో సాంకేతిక విద్యాశాఖ అధికారులు కూడా పాల్గొన్నారు. ఆ సమావేశంలోనే మే 5న ఈసెట్ నిర్వహించాలని నిర్ణయించారు. అందుకు అనుగుణంగా షెడ్యూలు కూడా ఇచ్చారు. అంతా అయిపోయిన తర్వాత డిప్లొమా పరీక్షలు పూర్తికాలేదన్న విషయం అధికారులకు గుర్తొచ్చింది. దీంతో ఇప్పుడు ఈసెట్ కుదరదని తేల్చేశారు. ముందుగా ఖరారు చేసిన తేదీన కాకుండా 45రోజుల ఆలస్యంగా జూన్ 20కి పరీక్షను వాయిదా వేశారు. డిప్లొమా పరీక్షలు పూర్తికావనే విషయం అధికారులకు ముందే తెలిసినా ఉన్నత విద్యామండలి, సాంకేతిక విద్యాశాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో ముందు ఈసెట్ తేదీ ఖరారు చేసి, తర్వాత మార్చాల్సి వచ్చింది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో విద్యార్థులు నష్టపోతున్నారు. జూన్ 20న ఈసెట్ జరిగితే ఫలితాల విడుదలకు కనీసం పది రోజులు పడుతుంది. అనంతరం జూలైలో అడ్మిషన్లకు షెడ్యూలు విడుదల చేస్తారు. ఈ ప్రక్రియ దాదాపు నెలాఖరు వరకూ సాగే అవకాశం ఉంది. ఈలోగా రెగ్యులర్ బీటెక్ విద్యార్థులకు రెండో సంవత్సరం(మూడో సెమిస్టర్)లో నెలకు పైగా బోధన పూర్తవుతుంది.
ప్రత్యేక తరగతులు ఒట్టిమాటే
ఈసెట్‌లో చేరే విద్యార్థులకు ప్రవేశాలు ఆలస్యమైతే ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఉన్నత విద్యామండలి కాలేజీలకు సూచిస్తోంది. దీనికి అంగీకారం తెలిపినా కాలేజీలు మాత్రం ఆ తర్వాత పట్టించుకోవడం లేదు. అందరికీ ఒకే సిలబస్ కావడంతో మళ్లీ ప్రత్యేకంగా తరగతులు చెప్పాలంటే కష్టమని యాజమాన్యాలు నిర్లక్ష్యం చేస్తున్నాయి. అదే మే 5న ఈసెట్ జరిగి ఉంటే రెగ్యులర్ విద్యార్థులతో పాటు ఈసెట్ ప్రవేశాలు జరిగేవి. అప్పుడు అందరికీ ఒకేసారి తరగతులు ప్రారంభమయ్యేవి. ప్రస్తుత పరిస్థితిని గమనించిన సాంకేతిక విద్యాశాఖ అంతా అయిపోయాక నష్ట నివారణ చర్యలకు దిగింది. వచ్చే ఏడాది ఈ పరిస్థితి తలెత్తకుండా మే 6లోపు ఫైనలియర్ డిప్లొమా విద్యార్థులకు పరీక్షలు పూర్తిచేసేలా షెడ్యూలు రూపొందించింది. కానీ ఈ ఏడాది విద్యార్థులకు జరిగే నష్టం గురించి మాత్రం పట్టించుకోవట్లేదు.