యూరియా.. ధరాభారం!

ABN , First Publish Date - 2023-01-25T00:21:35+05:30 IST

ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం రబీ సీజన్‌ నడుస్తోంది. ఈ ఏడాది జొన్న, మొక్కజొన్న సాగు గణనీయంగా పెరిగింది. ఖరీఫ్‌లోవేసిన పత్తి, మిర్చి చీడపీడలతో గిట్టుబాటుకాదని కొంతమంది రైతులు వాటిని తొలగించి, ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న, జొన్న సాగుచేశారు.

యూరియా.. ధరాభారం!
ఎరువుల బస్తాలు

గుంటూరు, జనవరి 24(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం రబీ సీజన్‌ నడుస్తోంది. ఈ ఏడాది జొన్న, మొక్కజొన్న సాగు గణనీయంగా పెరిగింది. ఖరీఫ్‌లోవేసిన పత్తి, మిర్చి చీడపీడలతో గిట్టుబాటుకాదని కొంతమంది రైతులు వాటిని తొలగించి, ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న, జొన్న సాగుచేశారు. రబీలో గుంటూరు జిల్లాలో జొన్న, మొక్కజొన్న కలిపి 42,591 హెక్టార్లు సాగు అంచనాగా ఉంది. అదేవిధంగా పల్నాడు జిల్లాలో 7,924, బాపట్ల జిల్లాలో 43,202 హెక్టార్లలో సాగు అంచనా వేశారు. దేశవ్యాప్తంగా యూరియా బస్తా ధర రూ.266.50గా ప్రభుత్వం నిర్ణయించింది. ఏరాష్ట్రంలోనైనా, ఏ కంపెనీ యూరియా అయినా ఒకే ధరను ప్రభుత్వం ఖరారు చేసింది. ప్రస్తుతం రబీలో మొక్కజొన్నకు రైతులు యూరియాను విచ్చలవిడిగా ఉపయోగిస్తున్నారు. ఎకరానికి 10 - 14 బస్తాల చొప్పున చల్లుతున్నారు. కాంప్లెక్స్‌, డీఏపీ ఎరువుల ధరలు ఎక్కువగా ఉండటంతో, తక్కువ ధరకు వచ్చే యూరియా వైపు రైతులు మొగ్గుతున్నారు. నిబంధనలకు అనుగుణంగా ఉమ్మడిజిల్లాకు వచ్చే యూరియాలో 50 శాతం డీలర్లకు, 50 శాతం ప్రభుత్వ సంస్థలైన సొసైటీలు, ఆర్‌బీకేలకు ఇస్తున్నారు. సొసైటీలు, ఆర్‌బీకేలలో అధికారపార్టీ రైతులకు మాత్రమే యూరియా ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో యూరియా అందని రైతులు బ్లాక్‌లో ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. పల్నాడులో రైతులు బస్తా యూరియా రూ.350 చొప్పున కొంటున్నారు.

పట్టించుకోని అధికారులు..

ఉమ్మడిజిల్లాలో యూరియా ఎక్కువ ధరకు అమ్ముతున్నా వ్యవసాయ, మార్క్‌ఫెడ్‌, విజిలెన్స్‌, ఇతర నిఘా వర్గాలు పట్టించుకోవటంలేదు. అధికధరపై ప్రశ్నిస్తే ఎకరానికి నాలుగు బస్తాలు వేయాల్సి వుంటే 10-14 బస్తాలు ఎందుకు వేస్తున్నారని రైతులపై వ్యవసాయ శాఖ అధికారులు ఎదురుదాడి చేస్తున్నారు. దీంతో చేసేది ఏమీలేక రైతులు ఎక్కువ ధరకు యూరియాను కొనుగోలు చేస్తున్నారు. రైతులు పంటకు సకాలంలో ఎరువులు వేయాలని ఎక్కువ ధర చెల్లిస్తున్నారు. అధికారులు పట్టించుకోవటం లేదని జాతీయ ఉత్తమ రైతు అవార్డు గ్రహీత బండారు శ్రీనివాసరావు అన్నారు. యూరియా ఎక్కువ వాడకం వలన భూమి దెబ్బతింటుంది. దీనిపై లాం, ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు ఎక్కడా అవగాహన సదస్సులు పెట్టలేదని రైతు సలహా కమిటీ చైర్మన్‌ నల్లమోతు శివరామకృష్ణ తెలిపారు. యూరియా ఎక్కువ ధరకు అమ్మే వ్యాపారులపై కఠినచర్యలు తీసుకొంటాం అని పల్నాడు జిల్లా వ్యవసాయ శాఖ జేడీ మురళి అన్నారు.

రూ.330కి కొనుగోలు చేశా....

నాలుగు ఎకరాలు పత్తిపంట వేశాను. చీడపీడలతో పత్తి పీకేసి మొక్కజొన్న వేశాను. యూరియా బస్తా రూ.330 చొప్పున కొనుగోలు చేశాను. మొక్కజొన్నకు ఖర్చులు పెరగటంతో భారంగా మారింది.

- కోవూరి రామచంద్రయ్య, దుర్గి, పల్నాడు జిల్లా

======================================================================

Updated Date - 2023-01-25T00:21:39+05:30 IST