TTD: మార్చిలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.120.29 కోట్లు

ABN , First Publish Date - 2023-04-07T21:21:31+05:30 IST

గడిచిన మార్చి నెలలో తిరుమల వేంకటేశ్వరస్వామిని 20.57 లక్షల మంది దర్శించుకోగా, హుండీ ద్వారా రూ.120.29 కోట్ల ఆదాయం లభించినట్టు టీటీడీ ఈవో ధర్మారెడ్డి

TTD: మార్చిలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.120.29 కోట్లు

తిరుమల: గడిచిన మార్చి నెలలో తిరుమల వేంకటేశ్వరస్వామిని 20.57 లక్షల మంది దర్శించుకోగా, హుండీ ద్వారా రూ.120.29 కోట్ల ఆదాయం లభించినట్టు టీటీడీ ఈవో ధర్మారెడ్డి (TTD EO Dharma Reddy) తెలిపారు. తిరుమల (Tirumala)లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.అన్నప్రసాదాల నాణ్యత మరింత పెంచేందుకు గత తరహాలోనే మిల్లర్ల నుంచి బియ్యం సేకరించాలని ఆలోచిస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం టెండర్ల ద్వారా బియ్యం సేకరిస్తున్నామన్నారు. వేసవి రద్దీని దృష్టిలో పెట్టుకుని ఏప్రిల్‌15 నుంచి జూలై15వ తేదీ వరకు వీఐపీ బ్రేక్‌ (VIP Break), శ్రీవాణి, టూరిజం కోటా, వర్చువల్‌ సేవలు, రూ.300 దర్శన టికెట్లను టీటీడీ బోర్డు (TTD Board) తగ్గించిందన్నారు. తద్వారా సామాన్య భక్తులకు దర్శన నిరీక్షణ సమయం తగ్గుతుందన్నారు. తిరుమలలో ప్రస్తుతం ఉన్న 7,400 గదుల్లో దాదాపు 85 శాతం గదులు సామాన్యులకే కేటాయిస్తున్నామన్నారు.గదుల కేటాయింపులో ఇటీవల ప్రవేశపెట్టిన ఫేస్‌ రికగ్నిషన్‌ టెక్నాలజీ వ్యవస్థ ద్వారా అక్రమంగా జరిగే రొటేషన్‌ తగ్గి గదులు త్వరగా ఖాళీ అవుతున్నాయన్నారు. నిరంతరాయంగా అన్నప్రసాదాలతో పాటు తాగునీరు అందిస్తున్నామని, కల్యాణకట్టలు కూడా 24 గంటలూ పనిచేస్తున్నాయన్నారు. తిరుమలలో భక్తులు పర్యటించేందుకు విరాళంగా వచ్చిన 10 విద్యుత్‌ బస్సులు 15వ తేదీ తర్వాత అందుబాటులోకి వస్తాయని ధర్మారెడ్డి తెలిపారు.

తిరుమలలో పెరిగిన రద్దీ

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వరుస సెలవులతో స్వామి దర్శనం కోసం భక్తులు భారీగా తిరుమలకు చేరుకుంటున్నారు. శుక్రవారం ఉదయం నుంచే శ్రీవారి ఆలయం మొదలుకొని, నాలుగు మాడవీధులు, లడ్డూ వితరణ కేంద్రం, అన్నప్రసాదభవనం, అఖిలాండం, క్యూకాంప్లెక్స్‌లు, నారాయణగిరి షెడ్లు, రోడ్లు, బస్టాండ్‌ ఇలా ప్రతి ప్రాంతంలో భక్తుల రద్దీ కనిపించింది. స్లాటెడ్‌ దర్శన టికెట్లు, టోకెన్లు ఉన్న భక్తులకు రెండు నుంచి మూడు గంటల దర్శన సమయం పడుతుంటే టోకెన్‌రహిత సర్వదర్శనానికి 48 గంటల సమయం పడుతోందని టీటీడీ ప్రకటించింది. వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లు, నారాయణగిరి ఉద్యానవనంలోని షెడ్లన్నీ సర్వదర్శనం భక్తులతో నిండిపోగా క్యూలైన్‌ నారాయణగిరి కాటేజీలు, శిలాతోరణం మీదుగా గోగర్భం డ్యాం వరకు దాదాపు రెండున్నర కిలోమీటర్ల దాకా వ్యాపించింది.

Updated Date - 2023-04-07T21:21:31+05:30 IST