Yuvagalam: లోకేష్‌కు భద్రత పెంపు

ABN , First Publish Date - 2023-06-17T21:24:04+05:30 IST

నెల్లూరు జిల్లాలో నక్సల్‌ ప్రభావిత ప్రాంతమైన కలువాయి మండలంలో నారా లోకేష్‌ యువగళం 129వ రోజు పాదయాత్ర శనివారం సందడిగా సాగింది.

Yuvagalam: లోకేష్‌కు భద్రత పెంపు

నెల్లూరు: నెల్లూరు జిల్లాలో నక్సల్‌ ప్రభావిత ప్రాంతమైన కలువాయి మండలంలో నారా లోకేష్‌ యువగళం 129వ రోజు పాదయాత్ర శనివారం సందడిగా సాగింది. దారిపొడవునా ఎదురైన ప్రతి పల్లెలో నారా లోకేష్‌కు ఘన స్వాగతం లభించింది. బ్యాండు మేళాలు, గజమాలలు, వేదపండితుల ఆశీర్వచనాలు నడుమ ఎదురైన ప్రతి ఒక్కరినీ పలకరిస్తూ, ప్రజల సాధకబాధకాలను ఆలకిస్తూ నారా లోకేష్‌ పాదయాత్ర సాగించారు. నక్సల్‌ ప్రభావిత ప్రాంతం కావడంతో నారా లోకే్‌షకు పోలీసుల భద్రతను పెంచారు. సాయంత్రం 4 గంటలకు ప్రారంభమైన పాదయాత్ర కుల్లూరు, మాదన్నగారిపల్లె, వెంకటరామరాజుపేట, ఊయాలపల్లి, కొత్తూరు ఎస్సీ కాలనీ, కోటూరుపల్లి, జగచర్ల గ్రామాల మీదుగా సాగింది. అన్ని గ్రామాల్లో ప్రజలు లోకేష్‌ కోసం గంటల తరబడి ఎదురుచూసి స్వాగతం పలికారు.

పెరిగిన భద్రత

కలువాయి మండలం నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతంగా పోలీస్‌ రికార్డుల్లో గుర్తించిన నేపథ్యంలో యువగళం పాదయాత్రకు పోలీసుల భద్రతను మూడింతలు పెంచారు. కలువాయి, రాపూరు మండలాల్లో గతంలో నక్సల్స్‌ ప్రభావం ఎక్కువగా ఉండేది. రాపూరు అడవులను కేంద్రంగా చేసుకొని పలు దళాలు పనిచేశాయి. ఎన్‌కౌంటర్లు, పోలీస్‌ స్టేషన్లపై దళాల దాడులు జరిగిన సందర్భాలూ ఉన్నాయి. అయితే ప్రస్తుతం నక్సల్‌ ప్రభావం తగ్గినా పోలీసు రికార్డుల్లో మాత్రం ఇవి నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాలుగానే ఉన్నాయి. ఆ కారణంగానే ఈ రెండు మండలాల పరిధిలో పోలీస్‌ స్టేషన్ల వద్ద ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు కనిపిస్తాయి. ఇలాంటి ప్రాంతాల్లో నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర మొదలు కావడంతో జిల్లా పోలీస్‌ యంత్రాంగం అప్రమత్తమయ్యింది. ఈ నెల 20వ తేదీ వరకు కలువాయి రాపూరు మండలాల్లో లోకేష్‌ పాదయాత్ర కొనసాగుతుంది. ఈ రోజుల్లో యువగళం పాదయాత్రకు ఎక్కువ మంది పోలీసు బలగాలను నియమించారు.

Updated Date - 2023-06-17T21:24:04+05:30 IST