Yuvagalam Padayatra: రైతుల కష్టాలు జగన్‌కు పట్టవు: నారా లోకేశ్‌

ABN , First Publish Date - 2023-04-14T19:28:48+05:30 IST

సీఎం జగన్‌ (CM Jagan)కు వ్యవసాయంపై కనీస అవగాహన లేదని, రైతులు పడే కష్టాల గురించి పట్టించుకోవడం మానేశారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh) దుయ్యబట్టారు.

Yuvagalam Padayatra: రైతుల కష్టాలు జగన్‌కు పట్టవు: నారా లోకేశ్‌

నంద్యాల: సీఎం జగన్‌ (CM Jagan)కు వ్యవసాయంపై కనీస అవగాహన లేదని, రైతులు పడే కష్టాల గురించి పట్టించుకోవడం మానేశారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ (Nara Lokesh) దుయ్యబట్టారు. నంద్యాల జిల్లా (Nandyala District) డోన్‌ నియోజకవర్గం ప్యాపిలి మండలం గుడిపాడు బస నుంచి శుక్రవారం ఉదయం 8 గంటలకు లోకేశ్ పాదయాత్ర ప్రారంభించారు. గుడిపాడు బస నుంచి లోకేశ్‌ బయటకు రాగానే స్థానికి మహిళలు హారతి ఇచ్చి స్వాగతం పలికారు. అక్కడి నుంచి పోతుదొడ్డి, మానుదొడ్డి, హనుమంతరాయనిపల్లె మీదు ప్యాపిలి శివారుకు చేరుకున్నారు. ఇక్కడ విశ్రాంతి తీసుకుని సాయంత్రం నాలుగు గంటలకు మళ్లీ పాదయాత్ర మొదలుపెట్టి ప్యాపిలికి చేరుకున్నారు. లోకేశ్‌తో కలిసి బనగానపల్లె నియోజకవర్గ ఇన్‌చార్జి బీసీ జనార్దన్‌రెడ్డి, మాజీ మంత్రి అఖిలప్రియ (Akhilapriya), డోన్‌ నియోజకవర్గ అభ్యర్థి ధర్మవరం సుబ్బారెడ్డి, టీడీపీ యువనేత భూమా జగత్‌ విఖ్యాత్‌రెడ్డి నడక సాగించారు.

రైతులకు అండగా ఉంటాం

వైసీపీ ప్రభుత్వం అధికారంలోనికి వచ్చాక మామిడి రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని, పంట నష్టపోయిన వారిని కూడా పట్టించుకోవడం లేదంటూ మండిపడ్డారు. వైసీపీ నేతలు సిండికేట్లుగా మారి మామిడి రైతులను దగా చేస్తున్నారని లోకేశ్ ఆరోపించారు. రైతులకు గిట్టుబాటు ధర లేకపోయినా, వైసీపీ నేతలు మాత్రం కమీషన్ల పేరుతో దండుకుంటున్నారన్నారు. ధరల స్థిరీకరణ కోసం రూ.3 వేల కోట్లు కేటాయిస్తానని హామీ ఇచ్చిన జగన్‌ పట్టించుకోవడం మానేశారన్నారు. టీడీపీ అధికారంలోనికి వచ్చాక మామిడి బోర్డు, స్టోరేజి గోడౌన్‌ ఏర్పాటు గురించి ఆలోచిస్తామని చెప్పారు. ఇక సబ్సిడీపైన ఇచ్చే డ్రిప్‌ పరికరాల గురించి వైసీపీ ప్రభుత్వం పూర్తిగా మరిచిపోయిందని, కరువు పరిస్థితులను అంచనా వేయడంలోనూ విఫలం అవడమే కాకుండా, ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వాలన్న ఆలోచన కూడా వైసీపీకి రావడం లేదన్నారు.

రైతులు ఎదుర్కొనే సమస్యలపైన చంద్రబాబుకు పూర్తి అవగాహన ఉందని, కేంద్రం అందించే పథకాలకు రాష్ట్ర నిధులను జత చేసి రైతులను ఆదుకునేందుకు గతంలో అనేక కార్యక్రమాలను చేశారని గుర్తు చేశారు. రైతుల ముఖంలో నవ్వు చూడటమే టీడీపీ లక్ష్యమని, అధికారంలోనికి రాగానే రైతుల కోసం గతంలో అమలులో ఉన్న పథకాలను మళ్లీ పునరుద్ధరించడమే కాకుండా, రైతులను ఆదుకుని వ్యవసాయం లాభసాటిగా ఉండేలా చర్యలు తీసుకుంటామని లోకేశ్ ప్రకటించారు.

Updated Date - 2023-04-14T19:28:48+05:30 IST