CM Jagan Delhi : ఏదో జరుగుతోంది!

ABN , First Publish Date - 2023-03-29T02:46:15+05:30 IST

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి మరోసారి ఢిల్లీకి బయలుదేరుతున్నారు. ఆయన హస్తినకు వెళ్లడం 14 రోజుల వ్యవధిలో ఇది రెండోసారి! ఈనెల 16వ తేదీన అసెంబ్లీ సమావేశాలను పక్కనపెట్టి మరీ ఢిల్లీకి వెళ్లారు.

CM Jagan Delhi : ఏదో జరుగుతోంది!

వివేకా కేసులో కదలిక.. వెంటనే ఢిల్లీకి జగన్‌

14 రోజుల్లో రెండోసారి నేడు హస్తినకు సీఎం

ఈనెల 16న అసెంబ్లీ సమావేశాలు పక్కన పెట్టి...

ఇప్పుడు జీ-20 సదస్సు జరుగుతున్నా పర్యటన

ఆగమేఘాలపై మోదీ, అమిత్‌షా అపాయింట్‌మెంట్లు

అవినాశ్‌, భాస్కర్‌ రెడ్డి అనుమానితులేనన్న సీబీఐ

అవినాశ్‌రెడ్డి అరెస్టు ఖాయమని 10న వెల్లడి

జగన్‌ ఢిల్లీ వెళ్లి రాగానే సీబీఐ దూకుడుకు బ్రేకులు

కనీసం విచారణకు నోటీసులూ వెళ్లని వైనం

విచారణాధికారి మార్పుపై నేడు తేల్చాల్సిన సీబీఐ

మరోవైపు ఎంపీ ‘ముందస్తు’ పిటిషన్‌.. ఢిల్లీకి జగన్‌

రేపు మధ్యాహ్నం ప్రధాని, హోంమంత్రితో భేటీ?

(అమరావతి - ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి మరోసారి ఢిల్లీకి బయలుదేరుతున్నారు. ఆయన హస్తినకు వెళ్లడం 14 రోజుల వ్యవధిలో ఇది రెండోసారి! ఈనెల 16వ తేదీన అసెంబ్లీ సమావేశాలను పక్కనపెట్టి మరీ ఢిల్లీకి వెళ్లారు. ఇప్పుడు... విశాఖలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న జీ-20 సదస్సుకువెళ్లినట్లే వెళ్లి... బుధవారం ఢిల్లీకి బయలుదేరుతున్నారు. గురువారం మధ్యాహ్నం ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలతో ఆయన సమావేశమవుతున్నారు. జగన్‌ ఢిల్లీకి వెళ్లాలనుకోవడం... ఆ వెంటనే ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రి అపాయింట్‌మెంట్లు ఖరారవుతుండటం విశేషం! బాబాయ్‌ వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలకమైన కదలిక వచ్చినప్పుడే జగన్‌ ఢిల్లీకి వెళుతుండటం చర్చనీయాంశంగా మారింది. ఈనెల 17వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను కలిసి వచ్చారు. యాదృచ్ఛికమో, కాదో తెలియదుకానీ... ఆ వెంటనే వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు మందగించింది. ‘వాళ్లిద్దరూ నిందితులే! ఏ క్షణమైనా అరెస్టు చేస్తా’మని తెలంగాణ హైకోర్టులోనే చెప్పిన సీబీఐ... తర్వాత విచారణకు కూడా పిలవలేదు. ‘కేసు దర్యాప్తు లో జోక్యం చేసుకోం’ అని హైకోర్టు స్పష్టంగా చెప్పినా.. పిలిచి ప్రశ్నించేందుకు ఆటంకాలు లేకున్నా సీబీఐ మౌనంగా ఉండిపోయింది. దీనికిముందుఅవినాశ్‌రెడ్డిని సీబీఐ 4 సార్లు ప్రశ్నించిన సంగతి తెలిసిందే! జగన్‌ ఢిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసి వచ్చాక ఆ ఊపు, దూకుడు మాయమయ్యాయి.

13.jpg

మరోసారి కీలక సమయంలో...

వివేకా కేసు విచారణ వేగవంతం చేయాలని సుప్రీం కోర్టు సోమవారం సీఐబీని ఆదేశించింది. మరొక విచారణాధికారిని నియమించి, ప్రస్తుత అధికారి రాంసింగ్‌నూ కొనసాగించడం పై బుధవారంలోపు నిర్ణయం తెలపాలని సీబీఐ డైరెక్టర్‌ను ఆదేశించింది. ఈ క్రమంలో సరిగ్గా బుధవారమే సీఎం ఢిల్లీకి వెళుతుండటం గమనార్హం. మరోవైపు... సోమవారం ఎంపీ అవినాశ్‌రెడ్డి తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్‌ పిటిష న్‌ దాఖలు చేశారు. మంగళవారం సీఎం ఢిల్లీ టూర్‌ ఖరారయింది. టీవీల్లో బ్రేకింగ్‌లు... ఢిల్లీకి వెళ్లబోతున్న సీఎం అం టూ ఒక్కటే హడావుడి! దీంతో రెండు కీలక ప్రశ్నలు తెరపైకి వచ్చాయి! ఒకటి.. అసలు వివేకా కేసులో ఏం జరుగుతోంది? 2.. ఈ కేసు దర్యాప్తునకూ, సీఎం ఢిల్లీ టూర్‌కి లింకు ఏమిటి?

3.jpg

అంతా అనుమానాస్పదం...

వివేకా హత్యకేసులో పరిణామాలు అంతుచిక్కని విధంగా సాగుతున్నట్లు విశ్లేషకులు అంటున్నారు. ఈనెల 17న పోలవరం కోసమే మోదీ, షాలను కలిసినట్లు జగన్‌ సీఎం అసెంబ్లీలో చెప్పారు. అందులో ఎంత నిజముందో ఎవ్వరికీ తెలియ దు. సీఎం కలిసి వచ్చాక పోలవరంపై కేంద్రం నుంచి ఎలాం టి సానుకూల ప్రకటనా రాలేదు. కానీ.. వివేకా కేసులో సీబీఐ దూకుడు తగ్గడం మాత్రం స్పష్టంగా కనిపించింది. ఈనెల 10న విచారణకు రావాల్సిందిగా సీబీఐ ముందుగానే అవినాశ్‌రెడ్డికి నోటీసు ఇచ్చింది. సరిగ్గా దీనికిముందు రోజే అవినాశ్‌రెడ్డి తెలంగాణ హైకోర్టులో లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దర్యాప్తు అధికారిపై తీవ్ర ఆరోపణలు చేస్తూ, విచార ణ దురుద్దేశంతో సాగుతోందని, తనను అరెస్ట్‌ చేయకుండా, కఠిన చర్యలు తీసుకోకుండా చూడాలని కోరారు. ఇక్కడే అస లు విషయం బయటకొచ్చింది. వివేకా కేసులో అవినాశ్‌ను సా క్షిగా పిలిచినా.. ఆయన, భాస్కర్‌రెడ్డి అనుమానితులని సీఐబీ న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వివేకా హత్యకేసు లో అవినాశ్‌దే కీలక పాత్రని సంచలన విషయం కోర్టుకు నివేదించారు.

ఫిబ్రవరి 24నే ఆ ఇద్దరిని అరెస్ట్‌ చేయాలనుకున్న ట్లు తెలిపారు. అదే సమయంలో అవినాశ్‌ రెడ్డిని సీబీఐ అధికారులు నాంపల్లి ఆఫీస్‌లో ప్రశ్నిస్తున్నారు. ఆ విచారణ పూర్తయ్యేలోగా ఏ క్షణమైనా అరెస్టు చేయవచ్చునని హైకోర్టులో సీబీఐ సూటిగా చెప్పింది. అయితే.. 13వ తేదీ వరకు అరెస్టు వద్దని కోర్టు స్పష్టం చేసింది. ఆ తర్వాత.. సీబీఐ విచారణాధికారిపై అవినాశ్‌ చేసిన ఆరోపణలు నిరాధారమని 13న కోర్టు తేల్చింది. విచారణ సక్రమంగానే సాగుతోందని పేర్కొంది. ఈ నేపథ్యంలో అవినాశ్‌ అరెస్టు ఆపలేమని కోర్టు 14న చెప్పింది. ఇది జరిగిన 24 గంటలకే అంటే 15న సీఎం ఆకస్మికంగా ఢిల్లీ టూర్‌ పెట్టుకున్నారు. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు జరుగుతుండగానే ఆయన 16న ఢిల్లీకి వెళ్లారు. 17న ప్రధాని, హోం మంత్రితో భేటీ అయ్యారు. ఢిల్లీలో ఏం జరిగిందో ఏమోకానీ సీబీఐలో జోరు తగ్గింది. ‘ఏ క్షణమైనా అరెస్టు’ అనే దశ నుం చి... అవినాశ్‌ రెడ్డిని, ఆయన తండ్రిని కనీసం విచారణకు కూ డా పిలవని పరిస్థితి ఏర్పడింది.

‘సుప్రీం’లో పరిణామాలు..

తాజాగా.. వివేకా హత్యకేసు దర్యాప్తులో జాప్యంపై సుప్రీం కోర్టు తీవ్రంగా స్పందించింది. దర్యాప్తు అధికారి రాంసింగ్‌ను మార్చడం, ఆయననే కొనసాగించడంపై.. బుధవారం సీబీఐ డైరెక్టర్‌ కోర్టుకు సమాధానం చెప్పాల్సి ఉంది. ఇది తదుపరి దర్యాప్తుపై కచ్చితంగా ప్రభావం చూపే పరిణామం! అదే క్ర మంలో అవినాశ్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ కోసం పిటిషన్‌ వేయ డం.. సీఎం ఢిల్లీ టూరు ఖరారు కావడం గమనార్హం! ఇక సీ ఎం ఢిల్లీ వెళ్లి వచ్చాక ఏం జరుగుతుందో... వేచి చూడాల్సిందే!

Updated Date - 2023-03-29T03:50:15+05:30 IST