CM Jagan : సజ్జల పండగ చేసుకునే ప్రకటన చేసిన జగన్..!
ABN , First Publish Date - 2023-06-15T09:25:14+05:30 IST
ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పండగ చేసుకునే ప్రకటనను ఏపీ సీఎం జగన్ చేశారని తెలుస్తోంది. ప్రభుత్వంలో నలుగురు సలహాదారుల పదవీకాలాన్ని మరికొంత కాలం పొడిగించనున్నారని తెలుస్తోంది.
అమరావతి : ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పండగ చేసుకునే ప్రకటనను ఏపీ సీఎం జగన్ చేశారని తెలుస్తోంది. ప్రభుత్వంలో నలుగురు సలహాదారుల పదవీకాలాన్ని మరికొంత కాలం పొడిగించనున్నారని తెలుస్తోంది. సజ్జల రామకృష్ణారెడ్డి, జీవీడీ కృష్ణమోహన్ , అజయ్ కల్లాం, శామ్యూల్ పదవీ కాలాన్ని పొడిగించేందుకు జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. సలహాదారులుగా నియమించినప్పుడు వీరి పదవీకాలం మూడేళ్లుగా ప్రభుత్వం పేర్కొంది. ఆ తర్వాత సలహాదారులందరికీ ఏకరూపత కోసమంటూ రెండేళ్లకు కుదించింది. కానీ ఆసక్తికరంగా వీరి పదవీకాలాన్ని పొడిగిస్తూనే ఉంది. ఈసారి కూడా పొడిగిస్తే మూడోసారి అవుతుంది.
సలహాదారుల నియామకంలోని రాజ్యాంగబద్ధతను తేలుస్తామని అప్పట్లో న్యాయస్థానం ప్రకటించింది. రాజ్యాంగంలో సలహాదారుల నియామకానికి సంబంధించి నిబంధనలు ఉన్నాయో లేదో తేలుస్తామని తెలిపింది. ముఖ్యమంత్రులకు, మంత్రులకు సలహాదారులను నియమించడాన్ని.. ప్రభుత్వ శాఖలకు సలహాదారులను నియమించడాన్ని ఒకే విధంగా చూడలేమని వ్యాఖ్యానించింది. వివిధ శాఖలకు నేతృత్వం వహించే సీనియర్ ఐఏఎస్ అధికారుల కన్నా.. బయటి నుంచి వచ్చినవారు మెరుగైన సలహాలు ఇస్తారా అని ప్రశ్నించింది. శాఖలతో ప్రారంభమైన సలహాదారుల నియామక సంప్రదాయం రేపు పోలీసు అధికారులు, తహశీల్దార్ల వరకు విస్తరించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. సలహాదారుల రోజువారీ వ్యవహారాలతో తమకు సంబంధం లేదని, ఆ పదవి రాజ్యాంగబద్ధంగా ఉందో లేదో మాత్రమే పరిశీలిస్తామని స్పష్టం చేసిన విషయం విదితమే.