Pawan Vs Jagan: జగన్‌ను వదలని పవన్.. మరోసారి ట్విట్టర్ వేదికగా సెటైర్.. ఈసారి ఏకంగా..
ABN , First Publish Date - 2023-05-19T09:46:54+05:30 IST
మన సీఎంపై ఎవరైన పాపం పసివాడు సినిమా తీస్తారా అంటూ ఇటీవల ట్విట్టర్ వేదికగా సెటైర్ వేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు తాజాగా జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
అమరావతి: మన సీఎంపై ఎవరైనా ‘‘పాపం పసివాడు’’ సినిమా తీస్తారా అంటూ ఇటీవల ట్విట్టర్ వేదికగా సెటైర్ వేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Janasena Pawan Kalyan) ఇప్పుడు తాజాగా జగన్ ప్రభుత్వంపై (Jagan Government) విరుచుకుపడ్డారు. అన్నమయ్య డ్యాం విషయంలో జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం, మోసాలను వివరిస్తూ వరుసగా ట్వీట్‌లు చేశారు.
పవన్ ట్వీట్ ఇదే...
‘‘అధికారికంగా రూ.500 కోట్ల విలువైన ఏపీ సీఎం (అన్ని ముఖ్యమంత్రిలలో అత్యంత ధనవంతుడు) గురించి నిరంతరం మాట్లాడే వారికి సున్నితమైన రిమైండర్.. కార్ల్ మార్క్స్ లాగా 'వర్గయుద్ధం'. తమాషా భాగం 'అణచివేతకు గురైనవారిలా మాట్లాడటం'. ఏవైనా సందేహాలు ఉంటే, దయచేసి ఏపీ మానవ హక్కుల సంఘాలతో తనిఖీ చేయండి.. 2021 నవంబర్ 19న కురిసిన అతి భారీ వర్షాలకు ఎన్నడూ రానంత వరద మూడు లక్షల ఇరవై వేల క్యూసెక్కులు రావడంతో సుమారు ఐదు గంటల 30 నిమిషాలకు అన్నమయ్య డ్యాం యొక్క మట్టికట్ట తెగిపోయింది. హఠాత్తుగా సంభవించిన ఈ వరద వల్ల.. ఒడ్డున ఉన్న మందపల్లి, తొగురుపేట, పులపతూరు మరియు గుండ్లూరు గ్రామాలలోని 33 మంది ప్రజలు జల సమాధి అయ్యారు. కేంద్ర జలవనురుల శాఖ మంత్రి శకావత్ గారు రాజ్యసభలో ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం అని స్పష్టంగా చెప్పారు. అంతర్జాతీయంగా ఈ ఘటన మీద గనక అధ్యయనం జరిగితే మన దేశ ప్రతిష్టకు భంగం కలుగుతుంది అని వాపోయారు. ప్రమాద ఘటన జరిగిన వెంటనే ఏపీ సీఎం అసెంబ్లీలో చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన ఒక హై లెవెల్ కమిటీ వేస్తున్నాము. ఇటువంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఘనంగా ప్రకటించారు. మరి ఆ కమిటీ ఏమైందో వారు రాష్ట్రంలోని మిగతా డ్యాములకు ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా ఏ సూచనలు చెప్పారో, ఏపీ సీఎం ఏ చర్యలు తీసుకున్నారో ఆ దేవుడికే ఎరుక. అన్నమయ్య డ్యామ్‌ను తిరిగి పూర్తిస్థాయిలో పునర్నిర్మానం చేసి ఒక ఏడాదిలోగా ఆయకట్టుదారుల ప్రయోజనాలు రక్షిస్తామని ఘనంగా ప్రకటించారు. దుర్ఘటన జరిగి ఈరోజుతో 18 నెలలు. ప్రాజెక్టు పూర్తి దేవుడికి ఎరుక. కనీసం ఈరోజుకి కూడా వీసమెత్తు పనులు చేయలేదు. ఈ 18 నెలలలో సాధించింది ఏమిటయ్యా అంటే... అస్మదీయుడు పొంగులేటికి 3.94 శాతం అదనపు ప్రయోజనంతో రివర్స్ టెండరింగ్ డ్రామా నడిపి పనిని రూ.660 కోట్లకు అప్పచెప్పారు’’ అంటూ పవన్ కళ్యాణ్ సెటైరికల్ ట్వీట్ చేశారు.