Pawan Kalyan: నాంపల్లి అగ్నిప్రమాద ఘటన దిగ్భ్రాంతికరం.. ఆ కుటుంబాలను ఆదుకోవాలి
ABN , First Publish Date - 2023-11-13T14:51:09+05:30 IST
నాంపల్లి అగ్ని ప్రమాదం ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు.
అమరావతి: నాంపల్లి అగ్ని ప్రమాదం ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Janasena Chief Pawan Kalyan) స్పందించారు. అగ్నిప్రమాద ఘటన దిగ్భ్రాంతికరమని.. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని అన్నారు. హైదరాబాద్ నాంపల్లిలో చోటు చేసుకున్న ఘోర అగ్నిప్రమాదంలో తొమ్మిది మంది మృత్యువాతపడ్డారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనైట్లు తెలిపారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆ కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకోవాలని తెలంగాణ ప్రభుత్వానికి (Telangana Government) విజ్ఞప్తి చేశారు. గాయాల పాలైనవారికి, అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. భవనాల్లో రసాయనాలు, ఇంధనాలు నిల్వ చేయడం వల్లే ఈ ఘోరం చోటు చేసుకొందని ప్రాథమిక సమాచారం ద్వారా తెలిసిందన్నారు. నివాస ప్రాంతాల్లో ప్రమాదాలకు ఆస్కారం ఇచ్చేవాటిని నిల్వ చేయకుండా అధికారులు కఠినంగా వ్యవహరించాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.