CM JAGAN: ఏం చిత్తశుద్ధో..?!
ABN , First Publish Date - 2023-02-15T03:15:41+05:30 IST
సొంత జిల్లా కడపలో 2019లో ఉక్కుఫ్యాక్టరీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఉక్కు నిర్మాణం తన వల్లనే సాధ్యమవుతుందంటూ....చిత్తశుద్ధి, విశ్వసనీయత గురించి పెద్ద పెద్ద డైలాగులు చెప్పారు.
కడప స్టీల్‌కు ‘టెంకాయ’ సాక్షిగా మళ్లీ భూమిపూజ
సీఎంగా ఒకసారి చేసిన జగన్.. మూడేళ్లలో పూర్తికి హామీ
ఇన్నాళ్లలో కొంత ప్రహరీ తప్ప మొదలేకాని ప్రధాన పనులు
నేడు మరోసారి టెంకాయ కొట్టనున్న ముఖ్యమంత్రి
గతంలోనే ఈ ఫ్యాక్టరీకి భూమిపూజ చేసిన వైఎస్, బాబు
ఎన్నికలకు ముందు టెంకాయ మోసమంటూ బాబుపై ధ్వజం
ఇప్పుడు ఎన్నికల ఏడాదిలో జగన్ చేస్తున్నదాన్ని ఏమంటారు?
నిలదీస్తున్న వామపక్ష రాజకీయపార్టీలు, స్థానికులు
జగన్ చెప్పినట్లు.. ఎన్నికలకు ఆరునెలల ముందు టెంకాయ కొట్టడం మోసం అయితే, ఎన్నికలకు ఏడాది ముందు మళ్లీ టెంకాయ కొడుతున్నారు! మరి దీన్ని ఏమనాలి? ఇది మోసం కాదా?
‘‘ఎన్నికలకు ఆరునెలల ముందు ఆ పెద్దమనిషి (టీడీపీ అధినేత చంద్రబాబును ఉద్దేశించి) టెంకాయ కొట్టారు. ఒకసారి ఆలోచించుకోమని చెబుతున్నాను. ప్రజలు ఐదు సంవత్సరాల పరిపాలనకు అధికారం ఇస్తారు. అందులో నాలుగున్నర సంవ త్సరాల కాలంలో ఏమీ చేయకుండా ఎన్నికలకు ఆరు నెలల ముందు టెంకాయ కొడితే మోసం అంటారు. అదే అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో టెంకాయ కొడితే చిత్తశుద్ధి అంటారు. పాలనలో తేడా ఎలా ఉంటుందో ఆలోచించుకోండి. మూడేళ్లలో స్టీల్ ప్లాంటును పూర్తిచేస్తాం’’
- 2019 డిసెంబరు 23న కడప స్టీల్ ప్లాంటు శంకుస్థాపనకు టెంకాయ కొట్టే కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ వ్యాఖ్యలు
(కడప - ఆంధ్రజ్యోతి): సొంత జిల్లా కడపలో 2019లో ఉక్కుఫ్యాక్టరీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఉక్కు నిర్మాణం తన వల్లనే సాధ్యమవుతుందంటూ....చిత్తశుద్ధి, విశ్వసనీయత గురించి పెద్ద పెద్ద డైలాగులు చెప్పారు. మూడేళ్లలో పూర్తి చేస్తామని అప్పుడు హామీ ఇచ్చారు. మూడేళ్లు గడిచిపోయాయి. స్టీల్ ప్లాంటుకు ప్రారంభోత్సవం జరగాల్సిన సమయం కూడా దాటిపోయింది. కానీ, ఇప్పుడు అదే స్టీలు ఫ్యాక్టరీకి రెండోసారి భూమిపూజ చేసి టెంకాయ కొట్టేందుకు బుధవారం కడపకు సీఎం జగన్ వస్తున్నారు. ఒక్క ఫ్యాక్టరీకి రెండుసార్లు భూమిపూజ చేయడం ఒక విడ్డూరం. స్టీల్ పరిశ్రమ పూర్తిచేసి ఉద్యోగాలు ఇస్తామంటూ నిరుద్యోగులను నిలువునా దగా చేశారు. సీఎం హోదాలో జగన్ కడప జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్ల పల్లె వద్ద 2019 డిసెంబరు 23న ఏపీ హైగ్రేడ్ స్టీలు ప్లాంటు శంకుస్థాపనకు టెంకాయ కొట్టారు. రూ.15వేల కోట్ల పెట్టుబడితో 25వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తామని నాడు యువతకు హామీ ఇచ్చారు. అయితే, జగన్ స్టీలు ఫ్యాక్టరీ కోసం ఏ ముహూర్తాన టెంకాయ కొట్టారో కానీ, అది ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. కేవలం ప్రహరీ గోడ ఇతర పనులు మాత్రమే కొంతమేర అయ్యాయి.
ప్లాంటుకు అవసరమైన నిర్మాణ పనులేవీ ముందుకుపోలేదు. పొలిటికల్ ఇమేజ్ కోసం స్టీలు ఫ్యాక్టరీ నిర్మిస్తున్నామంటూ హడావుడిగా శంకుస్థాపన చేశారు. గడిచిన మూడేళ్లలో మూడు సంస్థలు మారాయి. ప్రైవేటు, ప్రభుత్వ భాగస్వామ్యంతో స్టీలు ఫ్యాక్టరీ నిర్మించాలనుకున్నారు. తొలుత లిబర్టీ కంపెనీ ఆసక్తి చూపింది. 2021 ఫిబ్రవరి 22న సీఎం అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశంలో లిబర్టీకి ఆమోదముద్ర వేశారు. తొలివిడతలో రూ.1,082 కోట్లు, రెండో విడతలో రూ.ఆరువేల కోట్లతో నిర్మాణం చేపట్టేలా ప్రణాళికలు రూపొందించారు. అయితే ఆ సంస్థకు ఆర్థిక వెసులుబాటు లేకపోవడంతోపాటు మరికొన్ని కారణాలతో ఒప్పందం రద్దయింది. దీంతో టెండర్లలో ఎల్-2గా నిలిచిన ఎస్‌ఆర్ స్టీలు కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నారు. అదీ అటకెక్కింది. ఇప్పుడు ముచ్చటగా జేఎ్‌సడబ్ల్యూవోకు అప్పగించారు. రూ.8,880 కోట్లతో నిర్మిస్తామన్నారు. రెండు దశల్లో పూర్తి చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. మూడేళ్ల క్రితం శంకుస్థాపన సందర్భంగా రూ.15వేల కోట్లతో 25వేల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి చూపిస్తామని చెప్పడం ఇక్కడ గమనార్హం. అయితే ఇప్పుడు జేఎ్‌సడబ్ల్యూవో సంస్థ వద్దకు వచ్చేప్పటికి వ్యయం తగ్గిపోయింది.
కడప జిల్లాలో ఉక్కుఫ్యాక్టరీ ఏర్పాటుకు వైఎస్ హయాంలో బీజం పడింది. 2007 జూన్ 10న జమ్మలమడుగు వద్ద 10,670 ఎకరాల్లో బ్రహ్మణీ స్టీలుప్లాంటు ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. ఫ్యాక్టరీ పనులు ప్రారంభించిన అనంతరం గాలి జనార్దన్‌రెడ్డి ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసులో జైలు కెళ్లడం, వైఎస్ చనిపోవడంతో అది ముగిసింది. విభజన చట్టంలో కడపలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణానికి కేంద్రం ముందుకు రాలేదు. దీంతో అప్పటి సీఎం చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వమే ఉక్కుఫ్యాక్టరీ నిర్మాణానికి శ్రీకారం చుడుతుందని ప్రకటించారు. ఆయన 2018 డిసెంబరు 27న రాయలసీమ స్టీలు అఽథారిటీ కార్పొరేషన్ లిమిటెడ్ పేరిట శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్.. బుధవారం టెంకాయ కొడితే.. ఈ ప్లాంటుకు రెండుసార్లు భూమిపూజ చేసిన తొలి సీఎంగా రికార్డు సృష్టిస్తారు. బుధవారం మఽధ్యాహ్నం స్టీలు ఫ్యాక్టరీకి భూమిపూజ చేసిన అనంతరం ఆయన హెలికాప్టర్‌లో పులివెందుల చేరుకుని అక్కడ ఓ ఫంక్షన్‌లో పాల్గొంటారు. అనంతరం కడపకు చేరుకుని ప్రత్యేక విమానంలో గన్నవరం వెళతారు.
ఇప్పుడు ఎందుకు పూజ?
అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది చివర్లో కడప స్టీల్ ప్లాంటుకు టెంకాయ కొట్టిన వైఎస్ జగన్.. మరో ఏడాదిలో ఎన్నికలు ఉన్నాయనగా మరోసారి భూమిపూజ కోసం కడపకు వస్తుండటం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల ఏడాది కావడం వల్లే మరోసారి స్టీల్ ప్లాంటుపై హడావుడి మొదలుపెట్టారని వామపక్ష పార్టీలు, స్థానికులు ఆగ్రహిస్తున్నారు. మూడేళ్లలో పూర్తి చేస్తానన్న ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం అతీ గతీ లేకపోవడంతో ‘ఆంధ్రజ్యోతి’ వరుస కథనాలను ప్రచురించింది. అలాగే వామపక్షాలు రౌండ్ టేబుల్ సమావేశాలు, పాదయాత్ర తదితర కార్యక్రమాలు చేపట్టాయి. ఎన్నికలకు గడువు దగ్గర పడుతుండడం, స్టీలు ఫ్యాక్టరీపై విమర్శలు రావడంతో మళ్లీ ఇప్పుడు భూమిపూజకు హాజరవుతున్నారనే అభిపాయ్రం బలంగా వినిపిస్తోంది.