రక్తమోడుతున్న రహదారులు
ABN , First Publish Date - 2023-02-23T23:58:29+05:30 IST
జిల్లాలో రహదారులు... రక్తసిక్తమవుతున్నాయి.. ప్రతి నిత్యం ఎక్కడో ఒక మూల ప్రమాదాలు సంభవిస్తూ.. ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి.
ఆరు నెలల్లో 349 ప్రమాదాలు
152 మంది మృత్యువాత
సెల్‌ఫోన.. అతివేగం.. నిర్లక్ష్య డ్రైవింగ్..
మద్యం తాగి వాహనాలు నడపడం.. ప్రమాదాలకు కారణాలు
(రాయచోటి-ఆంధ్రజ్యోతి): జిల్లాలో రహదారులు... రక్తసిక్తమవుతున్నాయి.. ప్రతి నిత్యం ఎక్కడో ఒక మూల ప్రమాదాలు సంభవిస్తూ.. ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. ప్రమాదాల్లో ఇంటిపెద్దలతో పాటు యువత అర్ధాంతరంగా తనువు చాలించి మృత్యు కౌగిలికి చేరుకుంటుండడంతో ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోతున్నాయి. ఇంట్లో నుంచి బయలుదేరిన వాళ్లు.. తిరిగి క్షేమంగా ఇంటికి చేరుతారనే నమ్మకం లేని పరిస్థితులు నెలకొన్నాయి. అతివేగం.. మద్యం తాగడం, రోడ్డు భద్రతా నిబంధనలను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతుండడంతో ప్రమాదాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోందే కానీ.. తగ్గడం లేదు. రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసులు పలు చర్యలు తీసుకుంటున్నా ఫలితం కన్పించడం లేదు.
జిల్లాలో పలు జాతీయ, రాష్ట్ర రహదారులు ఉన్నాయి. ఈ రహదారులపై వేలాది వాహనాలు నిత్యం తిరుగుతూ ఉంటాయి. అయితే ఈ వాహనాలు నడిపే డ్రైవర్లు చాలా వరకు కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాలకు ముఖ్యమైన కారణం అతి వేగంతో పాటు మొబైల్‌ఫోన మాట్లాడటం, మద్యం తాగి వాహనాలు నడపడం, రోడ్డు భద్రతా నిబంధనలు పాటించకపోవడంతోనే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.
ఆరు నెలలు.. 349 ప్రమాదాలు
గత ఏడాది ఆగస్టు నుంచి జనవరి చివరి వరకు జిల్లా వ్యాప్తంగా 349 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఇందులో 142 ప్రాణాంతకమైన ప్రమాదాలు కాగా.. 207 స్వల్ప ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాల్లో 152 మంది మృత్యువాతపడగా, 61 మంది తీవ్రంగా గాయపడ్డారు. 337 మంది ఓ మోస్తారు గాయాలతో బయటపడ్డారు. గత ఏడాది ఆగస్టులో 63 ప్రమాదాలు జరిగాయి. 28 మంది చనిపోగా 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. సెప్టెంబర్‌లో గరిష్టంగా 73 ప్రమాదాలు సంభవించగా.. 29 మంది చనిపోయారు. ముగ్గురు తీవ్ర గాయాల పాలయ్యారు. అక్టోబరులో జరిగిన 52 ప్రమాదాల్లో 23 మంది మరణించారు. 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. నవంబరులో జరిగిన 55 ప్రమాదాల్లో 30 మంది చనిపోగా 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. డిసెంబరులో జరిగిన 48 ప్రమాదాల్లో 23 మంది మృతి చెందగా 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. జనవరిలో 58 ప్రమాదాల్లో 19 మంది చనిపోగా 8 మంది తీవ్రంగా గాయపడ్డారు.
గాలిలో దీపాలు.. అభాగ్యుల ప్రాణాలు
జిల్లా వ్యాప్తంగా జరిగిన కొన్ని ప్రమాదాల్లో ఎందరో అభాగ్యుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. గత ఏడాది మే 26న నిమ్మనపల్లె మండలం రెడ్డివారిపల్లెకు చెందిన గంగిరెడ్డి, అతడి భార్య మఽధులత, పిల్లలు కుషితారెడ్డి, దేవాన్షరెడ్డిలు ఓ వివాహానికి హాజరై ఇంటికెళుతూ రోడ్డు ప్రమాదబారిన పడి మృత్యువాతపడ్డారు. రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టి.. అదుపుతప్పి మృతులు ప్రయాణిస్తున్న కారు పక్కనే ఉన్న చెరువులోకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోవడం అత్యంత విషాదకర సంఘటనగా చెప్పవచ్చు.
రైల్వేకోడూరు మండలం మైసూరువారిపల్లె పంచాయతీ వద్ద ఈ ఏడాది జనవరి 28న జరిగిన బైక్ ప్రమాదంలో కడపకు చెందిన జేపీ నిర్మల్‌సింగ్ (21) మరణించాడు. అతడి స్నేహితుడు యశ్వంతసింగ్ తీవ్రంగా గాయపడి తిరుపతిలో చికిత్స పొందుతూ కోమాలోకి వెళ్లాడు. అదేరోజు మండలంలోని శెట్టిగుంట గ్రామ పంచాయతీ రైల్వేస్టేషన సమీపంలో లారీ ఆటోను ఢీకొన్న ప్రమాదంలో ఓబులవారిపల్లెకు చెందిన నూకరాజు సుబ్బరాజు (75) అనే వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
ఒంటిమిట్ట మండలంలో డిసెంబరు నుంచి ఇప్పటి వరకు దాదాపు ఆరుగురు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఫిబ్రవరి 12వ తేదీ తిరుమలకు వెళుతూ ప్రమాదానికి గురై మహబూబ్‌నగర్‌కు చెందిన ఇరువురు మృతి చెందారు.
చిట్వేలి మండలంలో డిసెంబరులో జరిగిన బైకు ప్రమాదంలో చిట్వేలి మండలం నాగవరం పంచాయతీ జట్టివారిపల్లెకు చెందిన వై.సురేష్ (35), ఆటో ప్రమాదంలో ఓబులవారిపల్లె మండలం మంగంపేటకు చెందిన జె.వెంకటేశ్వరరాజు (46) చనిపోయారు. డిసెంబరు 15న చిల్లావాండ్లపల్లె వద్ద బైకు ప్రమాదంలో బాబు (42), అనంతయ్యగారిపల్లె వద్ద బైకు ప్రమాదంలో జరిగిన ప్రమాదంలో చిట్వేలి దళితవాడకు చెందిన వడ్డీ ఆదిలక్ష్మి (59) మృతి చెందారు.
పీలేరు, కలికిరి, కలకడ, వాల్మీకిపురం, గుర్రంకొండ మండలాల్లో డిసెంబరు 1వ తేదీ నుంచి ఫిబ్రవరి 15 వరకు 11 రోడ్డు ప్రమాదాలు జరగ్గా నలుగురు చనిపోయారు. ఆరు మంది గాయపడ్డారు. పీలేరులో 9, కలకడ, గుర్రంకొండలో ఒక్కో ప్రమాదం సంభవించింది. పీలేరులో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు చనిపోయారు. గుర్రంకొండలో జనవరిలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు చనిపోయారు.
నిమ్మనపల్లె మండలంలో గత ఏడాది డిసెంబరు 15న ఎస్.రామాంజనేయులు బైకు ప్రమాదంలో మృతి చెందాడు. ఈనెల 9న ఎర్రాతివారిపల్లె వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని సయ్యద్‌బాషా అనే మతి స్థితిమితం లేని వ్యక్తి మృతి చెందాడు.
మదనపల్లె పట్టణంలో ఈనెల 11న బెంగళూరు రోడ్డులో జరిగిన ప్రమాదంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గణేష్ (29) మృతి చెందాడు. పెళ్లి చూపుల కోసం బైకులో బెంగళూరు నుంచి స్వగ్రామానికి వస్తూ కారు ఢీకొని మరణించాడు. జనవరి 28వ తేదీ సీఆర్‌పీఎఫ్ మహిళా కానిస్టేబుల్ అరుణాదేవి రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది.
బి.కొత్తకోట మండలంలో జనవరి 12వ తేదీ సాయంత్రం చెండ్రమాకులపల్లె సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పీటీఎం మండలం మల్లెలకు చెందిన సుహేల్ మృతి చెందాడు. మల్లెల నుంచి ద్విచక్ర వాహనంలో వస్తూ ట్రాక్టర్‌ను ఢీకొన్న ప్రమాదంలో చనిపోయాడు.
రామసముద్రం మండలంలో ఫిబ్రవరి 10న దాసర్లపల్లె సమీపంలో ఇద్దరు ద్విచక్ర వాహనదారులు ఎదురెదురుగా ఢీకొనడంతో నరేష్ (40) మృతి చెందాడు.
తంబళ్లపల్లె మండలంలో ఫిబ్రవరి 11న వ్యవసాయ కూలి పనులకు వెళుతూ ద్విచక్రవాహనంలో వెనుక కూర్చొని ప్రయాణిస్తున్న మహిళ జారి పడి మృతి చెందింది.
రామాపురం మండలంలోని కడప-చిత్తూరు జాతీయ రహదారిలో డిసెంబరు నుంచి ఫిబ్రవరి 18 వరకు 8 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఇందులో ముగ్గురు మృతి చెందగా ఆరుగురు గాయపడ్డారు.
గాలివీడు మండలంలో ఫిబ్రవరిలో ఆటో, బస్సు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో తండ్రీ, కొడుకు మృతి చెందారు.
సంబేపల్లె మండలంలో జనవరి 29న శెట్టిపల్లె రోడ్డులో రెండు ఆటోలు ఢీకొన్న ప్రమాదంలో బుర్రావాండ్లపల్లెకు చెందిన గోపగాని సుబ్బరాయుడు మృతి చెందారు. ఫిబ్రవరి 6న దేవపట్ల బస్టాండు వద్ద రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఇరువురికి తీవ్రగాయాలయ్యాయి.
సుండుపల్లె మండలంలో ఫిబ్రవరి మొదటివారంలో జరిగిన ప్రమాదంలో రాచంవాండ్లపల్లె వద్ద ఆర్టీసీ అద్దె బస్సు బైకును ఢీకొన్న ప్రమాదంలో గుర్రంకొండకు చెందిన సాయినాధ్ అనే యువకుడు మృతి చెందాడు.
చిన్నమండెం మండలం తూర్పుపల్లె క్రాస్ రోడ్డు వద్ద డిసెంబరు 15న ఆటో, మోటారు సైకిల్ ఢీకొని గుంటూరు జిల్లా కారుమంచికి చెందిన బత్తల శ్రీనాధ్, ఆటోలో ప్రయాణిస్తున్న చిన్నమండెం మండలం చాకిబండకు చెందిన చిలకల రియాజ్ చనిపోయారు.
ప్రజల సహకారంతోనే ప్రమాదాలు అరికట్టగలం
- హర్షవర్ధనరాజు, ఎస్పీ
జిల్లా వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల నివారణకు అనేక చర్యలు తీసుకుంటున్నాం. హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని ద్విచక్ర వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నాం. తరచూ ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి సూచికలు ఏర్పాటు చేశాం. ప్రజలు రోడ్డు భద్రతా నిబంధనలను పాటించాలి. ప్రజల సహకారంతోనే రోడ్డు ప్రమాదాలు అరికట్టగలం.